లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ రివ్యూ

నటీనటులు : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌ తదితరులు సంగీతం : కల్యాణీ మాలిక్‌ నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి దర్శకత్వం [more]

Update: 2019-03-29 09:35 GMT

నటీనటులు : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌ తదితరులు
సంగీతం : కల్యాణీ మాలిక్‌
నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి
దర్శకత్వం : రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు

నిన్న మొన్నటి వారకు నందమూరి తారకరామారావు అంటే తెలుగు ప్రజలకు దైవం అన్న లెక్కలోనే ఉండేది. కానీ ఎన్టీఆర్ బైయోపిక్స్ అంటూ రచ్చ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో.. అప్పుడే ఎన్టీఆర్ కున్న అభిమానం ప్రేక్షకుల్లో తగ్గిపోయింది. ఇది నిజం… ఇదే నిజం. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ గా బాలకృష్ణ – క్రిష్ కాంబోలో తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలే ప్రత్యక్ష ఉదాహరణలు. ఆ రెండు సినిమాల్లోనూ ఎన్టీఆర్ ని దైవంగా చూపించినా ప్రేక్షకులకు రుచించలేదు అంటే తప్పు ఎన్టీఆర్ బయోపిక్ తీసినవాళ్లలో ఉందా? లేదంటే ఎన్టీఆర్ గౌరవం ప్రజల్లో తగ్గిందా? అనేది ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు తనకి ఇవ్వలేదన్న కారణంతోనే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ అవసాన స్థితిలో ఒక పార్ట్ ని సినిమాగా తెరకెక్కించాడు. ఎన్టీఆర్ రెండో పెళ్లి, వెన్నుపోటు రాజకీయాల ప్రధానాంశంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదలైంది మొదలు అనేక కాంట్రవర్సీలకు నెలవుగా ఆ సినిమా మారింది. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని వర్మ సినిమాగా ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. అందుకే కొంతమందికి వ్యతిరేకంగా మరికొంతమందికి అనుకూలంగా ఉంటుందన్నది నగ్న సత్యం. అలాగే నందమూరి, చంద్రబాబు, టీడీపీ శ్రేణుల్ని కావాలని నెగెటివ్ గా వర్మ చూపిస్తున్నాడని టాక్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ చివరి దశలో జరిగిన చాలా విషయాలు చాలామందికి తెలియవు. అందుకే వర్మ వాటిని అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేసాడు. కానీ తమని ఎక్కడ నెగెటివ్ గా ఫోకస్ చేసాడో అని టీడీపీ శ్రేణులు మొదటి నుండి లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద కత్తి కట్టారు. కానీ నందమూరి ఫ్యామిలీ మాత్రం లైట్ తీసుకుంది. ఇక వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని విడుదల కాకుండా చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ వర్మ మాత్రం.. అన్ని అడ్డంకులు దాటించి లక్ష్మీస్ ఎన్టీఆర్ ని నేడు వరల్డ్ వైడ్(ఏపీ మినహా)గా ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఏపీలో ఎన్నికల కారణంగా అక్కడి టీడీపీ కార్యాకర్తలు హైకోర్టు మెట్లెక్కడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీ లో విడుదల కాకుండా హైకోర్టు స్టే ఇచ్చింది. అందుకే ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ షోస్ పడలేదు. మరి తెలంగాణతో పాటుగా వరల్డ్ వైడ్ గా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ వలన ఎవరికి గుండె జారిందో.. ఎవరికీ ఫేవర్ గా ఈ సినిమా ఉంది అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ‌

ఎన్టీఆర్‌ (విజయ్ కుమార్‌) ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవి కోల్పోయిన సమయంలో ఎన్టీఆర్‌ దగ్గరకు ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతి(యజ్ఞ శెట్టి) వస్తుంది. ఆమె నడవడిక గురించి, చదువు సంస్కారం ఉన్నావిడ అని తెలుసుకున్న ఎన్టీఆర్ తన జీవిత చరిత్ర రాసేందుకు అనుమతి ఇస్తాడు. అలా ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ కి బాగా దగ్గరవుతుంది. ఎన్టీఆర్ కి సపర్యలు చేస్తుంది. అయితే ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతిల మధ్యన ఉన్న అన్యోన్యతను చూసిన ఎన్టీఆర్‌ పెద్ద అల్లుడు బాబు రావ్‌ (శ్రీ తేజ్‌) వర్గం చెడు ప్రచారం మొదలుపెడుతుంది. ఓ పత్రికా అధిపతితో కలిసి బాబూరావ్ ఈ ప్రచారాన్ని హోరెత్తిస్తాడు. తమ మీద నెగెటివ్ గా వార్తలు రావడం విన్న ఎన్టీఆర్ తన సినిమా మేజర్ చంద్రకాంత్ సినిమా ఫంక్షన్‌లో లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా బహిరంగంగా ప్రకటించేస్తాడు. 1994లో లక్ష్మీతో కలిసి ప్రచారం చేసిన ఎన్టీఆర్‌ భారీ మెజారిటీ సాధించి తిరిగి అధికారం చేపడతాడు. ఎన్టీఆర్ రెండో పెళ్లికి నందమూరి కుటుంబం నుండి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఎన్టీఆర్ కూతుళ్లు, కొడుకులు ఎన్టీఆర్ రెండో పెళ్లి విషయమై ఎలా స్పందించారు? భారీ కుట్రకు తెరతీసిన బాబూరావ్.. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కునేందుకు ఎలాంటి పన్నాగాలు పన్నాడు? ఎన్టీఆర్ మరణానికి బాబురావు ఎలా కారణమయ్యాడు అనేది లక్ష్మీస్ ఎన్టీఆర్ మిగతా కథ.

నటీనటులు

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నటించిన నటులెవ్వరు ప్రేక్షకులకు పరిచయం లేని మొహాలు. చిన్న చిన్న సినిమాల్లో నటించినా.. వారి మొహాలు గుర్తుపెట్టుకునే సినిమాల్లో వారు నటించలేదు. అదే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ప్లస్ అయ్యింది. అలాగే బయోపిక్ గా తీసిన ఈ చిత్రంలోని నటీనటులు నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉండడం కూడా ప్లస్ పాయింట్. ఎన్టీఆర్ గా నటించిన విజయ్ కుమార్‌, లక్ష్మీస్ పార్వతిగా నటించిన యజ్ఞ శెట్టి, బాబురావు గా నటించిన శ్రీ తేజ్ ఇలా ఎవరికి వారే తాము చేసిన పాత్రలకు ప్రాణం పోశారు. ఎన్టీఆర్ ఆహార్యం ముందు విజయ్ కుమార్ తేలిపోయినా.. ఎన్టీఆర్ హావభావాలను, తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక లక్ష్మీపార్వతిగా యజ్ఞశేట్టి చాలా బాగా నటించింది. ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతిల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. ఇక బాబురావ్ గా శ్రీ తేజ్‌ పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. మెయిన్ గా తన లుక్స్ తోనే విలనిజాన్ని పండించాడు. ఎన్టీఆర్ కూతుళ్లు కొడుకుల పాత్రలు, హరికృష్ణ, బాలకృష్ణ మరియు ఇతర కుటుంబ సభ్యుల పాత్రల్లో నటించిన నటీనటులు, అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో అదరగొట్టేసారు.

విశ్లేషణ

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్నది మొదలు.. చాలామంది గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అన్నట్టుగానే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తీసి ప్రేక్షకుల మీదకి వదిలాడు. ఎన్టీఆర్ ని పెద్దలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఎలా వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అనే పాయింట్ మీద లక్ష్మీస్ ఎన్టీఆర్ ని వర్మ తెరకెక్కించాడు. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లాడడం.. పెళ్లాడిన క్రమంలో అతని ఫ్యామిలీ నుంచి లక్ష్మీపార్వతికి జరిగిన అవమానాలు ప్రముఖంగా చూపించాడు వర్మ. సినిమా ఫస్ట్ హాఫ్ లో లక్ష్మీపార్వతిని హైలెట్ చేస్తూ.. ఆవిడ చాలా అమాయకురాలని, ఓ అభిమానిగా ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిందని.. అంతకు మించి ఆమెకు వేరే ఆలోచన లేదన్నట్లుగా తెరకెక్కించారు. దాంతో ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మధ్య వచ్చే సన్నివేశాలు తప్ప ఫస్టాఫ్‌లో వేరే ఏమీ లేదు. అవి మొదట ఇంట్రస్టింగ్ గా ఉన్నా.. అవే కంటిన్యూగా రావటం చూపించడంతో ప్రేక్షకుడు బోర్ ఫీలవుతాడు. సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీని తనవైపు తిప్పుకున్న బాబు రావు కుట్రలు చేసి వెన్నుపోటుతో అధికారం లాక్కోవడంతో పదవి కోల్పోయి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌పై వైస్రాయ్‌ హోటల్‌ దగ్గర చెప్పులు వేయటంతో కుమిలిపోయి ఎన్టీఆర్ చనిపోయాడనేది సినిమాటిక్ గా చూపించాడు. కాకపోతే ప్రతి తెలుగు వాడి హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అంతటి మహానటుడు, మహానాయకుడిని అతి సాధారణమైన వ్యక్తిగా మరి నాటకీయంగా చూపించడం ఏమీ బాగాలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన కొన్ని నాటకీయ అంశాలను, అప్పటి పరిస్థితులను చాలా ఆసక్తికరంగా చూపించడంలో వర్మ విఫలం అయ్యాడు. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతితో తనని పెళ్లి చేసుకోమని అడిగినట్లు చెప్పించే సీన్ కూడా అస్సలు కన్విన్స్ కాదు. అలాగే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన వెన్నుపోటు ఘట్టం కేవలం ఒక వ్యక్తి చుట్టూనే ఉన్నట్టుగా చూపించాడు, కానీ నిజంగా పార్టీలోని అప్పటి ప్రముఖ నాయకులందరీ అభిప్రాయాలుతో పాటుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అవసరాల రీత్యా.. ఎన్టీఆర్ ను సీఎం పీఠం నుండి దించేయడం జరిగింది. కానీ వర్మ మాత్రం మొత్తం చంద్రబాబే ఈ వ్యవహారాన్ని నడిపించి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని హస్తగతం చేసుకునేందని చూపించాడు. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలా విలన్ గా చూపించడం అనేది మాత్రం కొంతమందికి ఏ మాత్రం రుచించదు. కానీ లక్ష్మీపార్వతికి మాత్రం ఈ సినిమాతో బలం వచ్చినట్లయ్యింది.

ప్లస్ పాయింట్స్: నటీనటులు కొత్త మొహాలు కావడం, కళ్యాణ్ మాలిక్ సంగీతం, సెకండ్ హాఫ్, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: స్లో నేరేషన్, ఫస్ట్ హాఫ్, ఎడిటింగ్, నాటకీయత ఎక్కువగా కనిపించడం

Tags:    

Similar News