కనిపిస్తే పచ్చడి చేస్తారనేనా?

ఆంధ్రా ఆక్టోపస్ గా మీడియా ప్రకటిత వ్యక్తి ఎవరో అందరికి తెలిసిందే. ఆయనే మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజనను జరగనిచ్చేది [more]

Update: 2020-02-17 13:30 GMT

ఆంధ్రా ఆక్టోపస్ గా మీడియా ప్రకటిత వ్యక్తి ఎవరో అందరికి తెలిసిందే. ఆయనే మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజనను జరగనిచ్చేది లేదంటూ తెలంగాణ వాదులతో నేరుగా తలపడి ఆంధ్రా లో హీరో అయ్యి విభజన జరిగిపోయాకా జీరో అయిపోయారు ఆయన. ఇక దేశంలో ఏ ఎన్నికలు జరిగినా చిలక జోస్యాలు చెప్పడం అవి దాదాపు ఫలితాలు వచ్చాకా లగడపాటి సర్వేలతో సుమారుగా సరిపోలడం కొంత కాలం నడిచింది. ఆ తరువాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఏపీ ఎన్నికల సమయంలో మరీ ఏకపక్షంగా టిడిపి గెలుపు లెక్కలు చెప్పి బొక్కబోర్లా పడ్డారు. ఆయన జోస్యాలతో తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల్లో పందెం రాయుళ్ళు నష్టపోయి లగడపాటి కనిపిస్తే పచ్చడి చేసెయ్యాలన్నంత కోపోద్రిక్తులై ఉండగా ఇక రాజకీయ జోస్యాలకు చెక్ పెడుతూ ఆయన మాయం అయిపోయారు.

2014 లో వైసిపి అధికారంలోకి రాకుండా ….

ఎట్టి పరిస్థితుల్లో వైసిపి అధికారంలోకి రావడానికి వీల్లేదని సమైక్యాంధ్ర పార్టీని వెనుకుండి ఏర్పాటు చేయించింది లగడపాటి రాజగోపాల్ అంటారు. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి డ్రైవర్ అయితే ఆ బండికి డీజీల్ లగడపాటి అన్నది ఎన్నికల ప్రచారం లో కనిపించింది. కొన్ని చోట్ల సమైక్యాంధ్ర అభ్యర్థులు బలంగా ఉంటే వారిని ప్రచారం చేయొద్దని లగడపాటి ఆదేశించడం, సీట్లు ఇచ్చి ఫండ్ ఇస్తామని అభ్యర్థులను నిండా ముంచిన వ్యవహారంలో ఆయనదే కీలక పాత్ర అంటారు. నాడుకూడా టిడిపి అధికారంలోకి రావడానికి ఆయన తెరవెనుక చేయని ప్రయత్నమే లేదు. నాడు ఆయన వ్యూహాలు ఫలించి తెలుగుదేశం అనుకున్నట్లే అధికారం దక్కించుకుంది. వైసిపి విపక్షానికి పరిమితం అయ్యింది.

జగన్ సీట్లో కి వచ్చాకా …

ఎపి లో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత లగడపాటి రాజగోపాల్ జాడ పూర్తిగా లేకుండా పోయింది. ఎన్నికల ముందు కొద్దిసార్లు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తో నేరుగా సమావేశాలు అయిన రాజగోపాల్ క్రీయాశీలక రాజకీయాల్లోకి తిరిగి వస్తారనే అంతా భావించారు. అయితే రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని లగడపాటి తాను చెప్పిన మాటకు కట్టుబడే ఉండిపోయారు. కానీ గత ఎన్నికల్లో టిడిపి కి లబ్ది చేసేందుకు తనదైన ప్రయత్నం చేసినా అది బెడిసి కొట్టింది. వైసిపి గెలుపు సునామీ దెబ్బకు రాజగోపాల్ సర్వే లు మూత పడిపోయాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన నేరుగా లేకపోయినా సర్వేల పేరుతో హల్చల్ చేసే ఛాన్స్ వైసిపి విజయం లేకుండా చేసింది.

అమరావతి లో ఇంత జరుగుతున్నా …

విజయవాడ నుంచి గతంలో ఎంపి గా పనిచేసిన రాజగోపాల్ వాస్తవానికి అమరావతి నుంచి రాజధాని ముక్కలు అవుతున్న అంశంపై స్పందిస్తారని అక్కడివారు ఎదురు చూశారు. అలాగే జగన్ నిర్ణయం తప్పో ఒప్పో చెబుతూ కనీసం ట్విట్టర్ వేదిక గా అయినా ట్వీట్ చేస్తారేమో అని చూసిన వారికి ఆయన మౌనం అర్ధం కావడం లేదు. ప్రజలు లగడపాటి పక్షపాత బుద్ధి తెలుసుకున్న తరువాత ఆయన నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందన్నది విశ్లేషకుల అంచనా. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లోను, రాజకీయ విశ్లేషణలు సర్వేల అంచనాలతో దశాబ్ద కాలం ఊపేసిన స్టార్ గా వున్న లగడపాటి భవిష్యత్తులో అయినా అజ్ఞాతం వీడి బయటకు వస్తారో లేక తన వ్యాపార లావాదేవీల్లోనే మునిగితేలుతారో చూడాలి.

Tags:    

Similar News