ఇంత రచ్చ జరుగుతున్నా?

లగడపాటి రాజగోపాల్ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కన్పిస్తుంది. గత ఎన్నికల సమయంలో సర్వేల పేరిట హల్ చల్ చేసిన లగడపాటి ఆ తర్వాత కన్పించకుండా పోయారు. [more]

Update: 2020-02-11 14:30 GMT

లగడపాటి రాజగోపాల్ పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే కన్పిస్తుంది. గత ఎన్నికల సమయంలో సర్వేల పేరిట హల్ చల్ చేసిన లగడపాటి ఆ తర్వాత కన్పించకుండా పోయారు. ఇప్పుడు రాజధాని అమరావతి విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా ఆయన బయటకు రాకపోవడంపై సన్నిహితులే తప్పుపడుతున్నారు. లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్ కే పరిమితమయ్యారని తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వం మారడంతో ఆయన విజయవాడ వైపు చూడటం లేదు.

విభజన తర్వాత కూడా…..

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే చల్లి రాజగోపాల్ సంచలనం సృష్టించారు. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని శపథం చేశారు. రాష్ట్ర విభజన జరగడంతో ఆయన ప్రత్యక్ష్య ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే 2014 లో చంద్రబాబు గెలిచిన తర్వాత పలుమార్లు లగడపాటి రాజగోపాల్ కలుసుకున్నారు. ఏపీ సచివాలయానికి, సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి చంద్రబాబుతో లగడపాటి భేటీ అయ్యారు.

సర్వేలతో తికమక….

ఇక ఎన్నికలకు ముందు వరకూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తాను చేయించిన సర్వే రిపోర్ట్ ను బయటపెట్టారు. ఈ సందర్భంగా అమరావతి వచ్చిన లగడపాటి రాజగోపాల్ కు అక్కడి ప్రజలు పూలతో స్వాగతం పలికారు. తన సర్వే తప్పని తేలితే ఇక భవిష్యత్తులో సర్వేలు కూడా చేయనని చెప్పారు. కానీ లగడపాటి సర్వే విఫలమయింది. జగన్ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంతో ఇక ఆయన విజయవాడ వైపు కన్నెత్తి చూడటం లేదు.

రాజధాని విషయంలో……

అయితే విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన లగడపాటి రాజగోపాల్ కు ఇప్పటికీ ఆ ప్రాంతంలో అభిమానులున్నారు. రాజధాని అమరావతి తరలింపు విషయంలో లగడపాటిని కూడా భాగస్వామ్యం చేయాలని కొందరు ప్రయత్నించినా ఆయన కుదరదని చెప్పినట్లు తెలిసింది. జగన్ మొండివాడని, ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం ఉండదని లగడపాటి రాజగోపాల్ తన మిత్రుల వద్ద అన్నట్లు చెబుతున్నారు. అందుకే రాజధాని అమరావతి విషయంలో తాను ఎలాంటి ప్రకటన చేయబోనని చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద గత ఎనిమిది నెలల నుంచి లగడపాటి రాజగోపాల్ ఏపీ వైపు చూడటమే లేదు. శుభకార్యాలకు కూడా హాజరు కాలేదంటున్నారు మిత్రులు.

Tags:    

Similar News