లద్దాఖ్ ఎన్నికలు.. ఎవరిది గెలుపు?

లద్దాఖ్… ఈ మూడక్షరాల పేరు చాలామంది భారతీయులకు సుపరిచితమే. ఛైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో మంచుకొండల్లో విస్తరించిన ఈ ప్రాంతంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఇక శీతాకాలంలో [more]

Update: 2020-10-16 16:30 GMT

లద్దాఖ్… ఈ మూడక్షరాల పేరు చాలామంది భారతీయులకు సుపరిచితమే. ఛైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో మంచుకొండల్లో విస్తరించిన ఈ ప్రాంతంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. ఇక శీతాకాలంలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ విధి నిర్వహణ సైనికులకు కత్తిమీద సామే. ప్రస్తుత శీతాకాలంలోనూ అక్కడి వాతావరణం వేడెక్కింది. ఇందుకు కారణం ఎన్నికలే. ఈ నెల 16న జరగనున్న లద్దాఖ్ అటామనస్ హిల్ ఏరియా కౌన్సిల్ ఎన్నికలు రాజకీయ పార్టీల్లో వేడి రగలిస్తున్నాయి.

తొలి ఎన్నికలు కావడంతో…..

గత ఏడాది ఆగస్టు 5న లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించాక జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడంతో అంతటా ఆసక్తి నెలకొంది. అయిదేళ్ల క్రితం ఎన్నికలు 2015లో జరిగాయి. మొత్తం 30 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 18, కాంగ్రెస్ 5, నేషనల్ కాన్ఫరెన్స్ 2 స్థానాలను గెలుచుకున్నాయి. నాలుగు స్థానాలు నామినేటెడ్ పదవులు. ఇక్కడ షియా ముస్లిములు 46 శాతం, బౌద్ధులు 40 శాతం, హిందువులు 12 శాతం మంది ఉన్నారు. లద్దాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి పార్టీలకు ఇష్టంలేదు. దీనివల్ల తమ పట్టు తగ్గుతుందన్నది వాటి భావన.

అందుకే ఈ ఎన్నికలకు…..

లద్దాఖ్ ఒకప్పుడు జమ్ము కశ్మీర్ లో భాగం. గత ఏడాది కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. కశ్మీర్ కు అసెంబ్లీ, ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. లద్దాఖ్ కు అసెంబ్లీ ఉండదు. ముఖ్యమంత్రి కూడా ఉండరు. కంద్రం తరఫున లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా పాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. లద్దాఖ్ అటామనస్ హిల్ ఏరియా కౌన్సిల్ పాలన చేస్తుంది. దీంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏకైక స్థానాన్ని భాజపా అభ్యర్థి జమాంగ్ త్సేరింగ్ నంగ్యాల్ గెలుచుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే హిల్ మంత్రి కౌన్సిల్ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, పార్టీలో కశ్మీర్ వ్యవహారాల పర్యవేక్షకుడు రామ్ మాధవ్ లద్దాఖ్లో పర్యటించి ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్త పరిచారు. వ్యూహరచన చేశారు. ఏకైక ఎంపీ నంగ్యాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తున్నారు. మొత్తం 26 స్థానాలకు సుమారు 160 నామినేషన్లు దాఖలయ్యాయి. భాజపా తరఫున 43, కాంగ్రెస్ నుంచి 43, ఆప్ తరఫున 27 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 44 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

అన్న పార్టీలూ వ్యతిరేకించినా….

తొలుత ఇక్కడి పార్టీలు ఎన్నికలను వ్యతిరేకించాయి. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు, కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని అవి కేంద్రాన్ని కోరాయి. ఈ మేరకు అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఇతర చిన్నాచితక పార్టీల నాయకులు హోంమంత్రి అమిత్ షా ను కలిశాయి. వాయిదాకు కేంద్రం విముఖంగా ఉంది. భాజపా జాతీయ నాయకులు ీ విషయంలో రాష్ర్ట నాయకులకు సర్ది చెప్పారు. లద్దాఖ్ ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లోకి చేర్చాలన్నది ఇక్కడి పార్టీల ప్రధాన డిమాండ్. కమలం పార్టీది అదే డిమాండ్. ఎన్నికల అనంతరం ఈ విషయాన్ని పరిశీలిస్తామని అమిత్ షా చెప్పడంతో స్థానిక నాయకులు మెత్తబడ్డారు. బోడో అటామనస్ కౌన్సిల్ మాదిరిగా తమ కౌన్సిల్ కు అధికారాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లద్దాఖ్ అన్నిరకాలుగా వెనకబడిందని, ఆరో షెడ్యూల్ లో చేర్చడం వల్ల నిధులమంజూరు పెరుగుతుందని, తద్వారా తమ ప్రాంత అభివద్ధికి బాట పడుతుందన్నది ఇక్కడి నాయకుల భావన. 2003లో నాటి ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ హయాంలో అటామనస్ కౌన్సిల్ ఏర్పాటైనప్పటికీ ఇప్పటికీ ప్రగతికి బీజాలు పడలేదన్నది పార్టీల భావన. అధికార సాధనే లక్ష్యంగా పావులు కదిపే జాతీయ నాయకులకు ఈ ప్రాంత అభివద్ధిపై శ్రద్ధ తక్కువన్నది చేదునిజం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News