అద్వానీకి ఆ ఆఫర్ కరెక్టేనా?

ఎల్.కె. అద్వానీ. ఈ పేరు తెలియని వారుండరు. రాజకీయాల్లో విలువలను పాటించే వ్యక్తిగా ఆయనకు పేరు. భారతీయ జనతాపార్టీని, కాషాయజెండాను తన రధయాత్రతో దేశవ్యాప్తం చేసిన అద్వానీ [more]

Update: 2019-01-27 16:30 GMT

ఎల్.కె. అద్వానీ. ఈ పేరు తెలియని వారుండరు. రాజకీయాల్లో విలువలను పాటించే వ్యక్తిగా ఆయనకు పేరు. భారతీయ జనతాపార్టీని, కాషాయజెండాను తన రధయాత్రతో దేశవ్యాప్తం చేసిన అద్వానీ గతకొన్నాళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎలాంటి పదవులను పొందలేకపోయారు. ఇందుకు కారణం ఆయన వయస్సే. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం వయస్సును కౌంట్ లోకి తీసుకుని ప్రధాని నరేంద్రమోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు పక్కనపెట్టేశారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధాని కావాల్సిన అర్హతలు ఉన్నప్పటికీ, ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించకపోవడం వెనక కూడా పార్టీలో కుట్ర జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.

తిరిగి పోటీ చేస్తారా…?

వచ్చేలోక్ సభ ఎన్నికల్లో అద్వానీ తిరిగి పోటీ చేస్తారా? భారతీయ జనతా పార్టీలో 75 ఏళ్లు దాటిన వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదన్న నిబంధనలు ఉన్నాయి. పోటీ చేసేందుకు ఎటువంటి అర్హతలు లేకపోయినా 75 ఏళ్లు దాటిని వారిని పక్కనపెట్టాలన్నది ఆ పార్టీ అధినేతలు తీసుకున్న నిర్ణయం. అద్వానీ ప్రస్తుతం 91 ఏళ్ల వయస్సులో ఉన్నారు. ఆయన గాంధీనగర్ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తిరిగి పోటీ చేస్తారా? లేదా? అన్నది పార్టీ నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే మోదీ, అమిత్ షాలు మాత్రం పోటీపై నిర్ణయాన్ని అద్వానీకే వదిలేశారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో అక్కడిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప కు 75 ఏళ్లు దాటినా ఆయన పోటీ చేసేందుకు అధిష్టానం అనుమతించింది.

అందలం ఎక్కించకుండా….

అధికారంలోకి వచ్చి ఉంటే యడ్యూరప్ప ముఖ్యమంత్రి కూడా అయ్యే వారు. అయతే యడ్యూరప్పకు ఇచ్చిన మినహాయింపు అద్వానీ, మురళీమనోహర్ జోషిలాంటి అనుభవమున్న నేతలకు వర్తించదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటిసీనియర్ నేతలను మార్గదర్శకమండలిలో నియమించడాన్ని కూడా తప్పుపట్టారు. 2014 ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి రాగానే అద్వానీ అందలం ఎక్కుతారని అందరూ భావించారు.కానీ అది జరగలేదు. పార్టీలో దిగువస్థాయి నేతలు,క్యాడర్ లో అద్వానీకి జరిగిన అన్యాయంపై అడపా దడపా అసంతృప్తి పెల్లుబుకుతూనే ఉంది. అయినా ఇవేమీ కేంద్రనాయకత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు.

పోటీ చేయబోరంటున్న….

తాజాగా గాంధీనగర్ లో 2019 ఎన్నికల్లో పోటీ చేసే నిర్ణాయాన్ని అద్వానీ అభీష్టానికే వదిలేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అద్వానీ పోటీ చేసే ఉద్దేశ్యంలో లేరంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయడం కంటే రాజకీయాల నుంచి నిష్క్రమించడమే మేలని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వాజ్ పేయి మరణం తర్వాత అద్వానీ మరింత కుంగిపోయారు. ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలను అద్వానీ చూస్తూ, వింటూ ఊరుకోవడం తప్ప చేసేదేమీ లేదని తెలిసిందే. దీంతో ఆయన బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఆఫర్ కు ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. మరో సీనియర్ నేత మురళీమనోహర్ జోషి పరిస్థితి కూడా సేమ్ టు సేమ్.

Tags:    

Similar News