కేవీపీ కోసమే ఎదురు చూస్తున్నారా?

కేవీపీ రామచంద్రరావు ఏపీ రాజకీయాలు పట్టించుకోరా? ఇక తెలంగాణ కాంగ్రెస్ కు పరిమితమవుతారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటీవల కేవీపీ రామచంద్రరావు తాను తెలంగాణకు [more]

Update: 2020-05-28 13:30 GMT

కేవీపీ రామచంద్రరావు ఏపీ రాజకీయాలు పట్టించుకోరా? ఇక తెలంగాణ కాంగ్రెస్ కు పరిమితమవుతారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇటీవల కేవీపీ రామచంద్రరావు తాను తెలంగాణకు చెందిన వాడినని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా కేవీపీని తమ వాడిగా చూస్తున్నారు. ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ లో పదవులు లేకపోయినా హైకమాండ్ వద్ద కమాండ్ ఉన్న నేతగా టీపీసీసీ నేతలు భావిస్తున్నారు.

రాజ్యసభ పదవీకాలం పూర్తవ్వడంతో……

ఇటీవల కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. ఇక ఆయనకు ఇప్పట్లో రాజ్యసభ వచ్చే ఛాన్స్ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో కేవీపీ రామచంద్రరావు ఇక పెద్దల సభకు ఎంపికయ్యే అవకాశం ఇప్పట్లో లేదనే అనిపిస్తుంది. ఎప్పటికైనా తెలంగాణలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే కేవీపీ రామచంద్రరావు తాను తెలంగాణవాడినని చెప్పుకున్నారని కాంగ్రెస్ పార్టీలో లో కామెంట్స్ విన్పిస్తున్నాయి.

టి.కాంగ్రెస్ సమావేశంలో…..

ఇటీవల జరిగిన తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలోనూ వి.హనుమంతరావు ఒక ప్రతిపాదన పెట్టారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపుపై చేపట్టే నిరసనకు కేవీపీ రామచంద్రరావును ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమానికి కేవీపీ రామచంద్రరావు హాజరవుతారా? లేదా? అన్నది పక్కన పెడితే ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారారు. రాజ్యసభ పదవికాలం ముగిసిన తర్వాత కేవీపీ రామచంద్రరావు రాజకీయాలపై మౌనంగా ఉంటున్నారు.

ఏపీ రాజకీయాలకు దూరంగా…..

ఏపీలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తన ఆత్మీయ మిత్రుడు వైఎస్ తనయుడు జగన్ అక్కడ అధికారంలో ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతవరకూ పోలవరం ప్రాజెక్టుపై ఆందోళనలు చేసిన కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు కామ్ అయిపోయారు. పోలవరం ప్రాజెక్టుకు పాదయాత్ర కూడా చేశారు. ఇప్పుడు మౌనంగా ఉండటంతో కేవీపీ రామచంద్రరావు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది. మరి కేవీపీ రామచంద్రరావు దీనిపై ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News