అందుకే ఆ టీడీపీ నేత ఫ్యూచ‌ర్ ఖ‌ల్లాస్‌

రాజకీయాల్లో నాయకులకు లోలోన ఏభావాలు ఉన్నప్పటికీ.. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, బహిరంగ వేదికలు ఎక్కినప్పుడు లేదా ప్రజలను కలుసుకున్నప్పుడు మాత్రం చాలా సౌమ్యంగా మాట్లాడాలి. మనసులో [more]

Update: 2019-08-09 14:30 GMT

రాజకీయాల్లో నాయకులకు లోలోన ఏభావాలు ఉన్నప్పటికీ.. ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, బహిరంగ వేదికలు ఎక్కినప్పుడు లేదా ప్రజలను కలుసుకున్నప్పుడు మాత్రం చాలా సౌమ్యంగా మాట్లాడాలి. మనసులో ఉన్న భావాలను నోటి ద్వారా ప్రజలపైకి రువ్వుతానంటే.. కుదురుతుందా ? ఈ మాత్రం కూడా తెలుసుకోలేకుండా ఉంటారని రాజకీయ నాయకుల గురించి ఎవరూ అనుకోరు. కానీ, టిడిపి సీనియర్ నేత, వరుస విజయాలతో పార్టీకి అండగా నిలిచి, నెల్లూరులో కాంగ్రెస్‌కు రాజకీయ కోటగా వెంకటగిరిలో సైకిల్‌ను గెలిపించి సత్తాచాటిన నాయకుడు కురుగొండ్ల రామకృష్ణ మాత్రం ఇలా నోటి దూల కారణంగానే చెడ్డపేరు తెచ్చుకున్నాడు.

వైఎస్ హవా సమయంలోనూ…..

2009, 2014లో వెంకటగిరి నియోజకవర్గంలో టిడిపి సత్తా చాటాడు కురుగొండ్ల రామకృష్ణ. నిజానికి అందరిలా దూకుడుగా తిరిగేందుకు ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలు మాత్రం ఆయనను అభిమానించారు. వెంకటగిరిలో సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి ని సైతం ఓడించి కురుగొండ్ల రామకృష్ణకు పట్టం కట్టారు. అదికూడా వైఎస్ హవా భారీ ఎత్తున సాగిన 2009 ఎన్నికల్లో ప్రజలు ఇలా తీర్మానించుకుని ముందుకు సాగారు. అయితే, ఆ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక 2014 ఎన్నికల్లో చంద్రబాబు హవా జోరుగా సాగడంతో ఆయనను సీఎంగా చేయాలని నిర్ణయించుకున్న ప్రజలు ఈ క్రమంలోనే మరోసారి కురుగొండ్ల రామకృష్ణకు అవకాశం కల్పించారు.

రెండు సార్లు గెలిచి….

ఇలా రెండుసార్లు ప్రజలు ఆయనను గెలిపించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కొంత స్థానిక కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకపోవడంతో సహా.. చంద్రబాబు వ్యూహంపై నమ్మకంతో మరోసారి కురుగొండ్ల రామకృష్ణకు ఇక్కడ అవకాశం కల్పించారు. రామ‌కృష్ణ మాస్ లీడ‌ర్‌గా ఉండ‌డం కూడా ఆయ‌న‌కు క‌లిసొచ్చింది. ఇలా రెండు సార్లు గెలిచిన కురుగొండ్ల రామకృష్ణ తన బలంతోనే నెట్టుకు వచ్చాన‌ని, తనకు తిరుగులేదని భావించారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని సృష్టించుకున్నారు. వారికే పనులు చేసిపెట్టడం, కాంట్రాక్టులు దక్కేలా చక్రం తిప్పడం చేశారు. ఇక, తనకు అనుకూలంగా లేరని భావిస్తే.. సొంత పార్టీ నేతలపైన కూడా కేసులు పెట్టించార‌నే విమర్శలు ఎదుర్కొన్నారు.

సరిదిద్దుకునే ప్రయత్నమూ….

ఇక వైసీపీ నేతలపై అనేక కేసులు పెట్టించారు. బహిరంగంగానే ప్రజలపై దూష‌ణ ప‌ర్వం సాగించారు. తన చేష్టలు అన్ని వీడియోలు, కామెంట్లు గా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నా ఏమాత్రం లెక్క చేయకపోగా.. తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలోనే విసుగెత్తిన ప్రజలు కురుగొండ్ల‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు చంద్రబాబుకు సైతం ఉప్పందింది. తాను చేయించిన సర్వేలో కురుగొండ్ల మార్కులు తక్కువ పడ్డాయ‌ని తెలుసుకున్న బాబు.. నేరుగా అమరావతికి ఆహ్వానించి ఆయనకు క్లాస్ ఇచ్చారు. అయినా కూడా తన వైఖరిలో కురుగొండ్ల మార్పు తెచ్చుకోలేదు.

బాబు ఆగ్రహంగా….

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి అక్కడ సరైన గౌరవం దక్కక పోవడంతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనకు ఎంతో కాలంగా అచ్చి వచ్చిన ఆత్మకూరు నియోజకవర్గం కేటాయించాలని జగన్‌ను కోరారు. అయితే, ఇక్కడ మేకపాటి గౌత‌మ్ రెడ్డి ఉండడంతో కాదనలేక.. వెంకటగిరి నియోజకవర్గం కేటాయించారు. జగన్ వాస్తవానికి నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా చక్రం తిప్పినా.. ఆనం సోదరులకు వెంకటగిరి తో ప్రత్యేక సంబంధాలు లేవు. ఇక్కడ నేదురుమల్లి కుటుంబం చక్రం తిప్పుతోంది. వెంక‌ట‌గిరిలో ఆనంకు పోటీ చేయ‌డం ఇష్టం లేక‌పోయినా జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు కనుక పోటీ చేస్తానని చెప్పిన ఆనం అయిష్టంగానే పెద్దగా ఖర్చు కూడా పెట్టకుండా తూతూ.. మంత్రంగా ప్రచారం చేశారు. అయితే ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించారు. నిజానికి వెంకటగిరిలో ఆనం గెలుపు వెనుక ఆయన కృషి కన్నా కూడా కురుగొండ్ల రామకృష్ణపై పెరిగిన వ్యతిరేకతే స్థానికేతరుడు అయిన ఆనంను గెలిపించింది. దీంతో ఇప్పుడు కురుగొండ్ల పై చంద్రబాబుకు పీకల్లోతు ఆగ్రహం ఉంది. అయినా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు కురుగొండ్ల రామకృష్ణ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుందా ? లేదా బాబు ఆయ‌న్నే అక్కడ కంటిన్యూ చేస్తారా ? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News