జగన్ నమ్మాడు మరి

రాజకీయాల్లో అడ్డుకునేందుకు ఏ గేట్లూ ఉండవు. మరేరకమైన బారికేడ్లూ ఉండవు. సత్తువ ఉంటే ఖాళీ మైదానంలో ఎటు నుంచి ఎటైనా దూసుకుపోవచ్చు. అందుకే వివిధ రంగల్లోని వారు [more]

Update: 2019-10-23 13:30 GMT

రాజకీయాల్లో అడ్డుకునేందుకు ఏ గేట్లూ ఉండవు. మరేరకమైన బారికేడ్లూ ఉండవు. సత్తువ ఉంటే ఖాళీ మైదానంలో ఎటు నుంచి ఎటైనా దూసుకుపోవచ్చు. అందుకే వివిధ రంగల్లోని వారు రాజకీయాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ కొన్ని టెక్నిక్స్ తెలిస్తే చాలు రాజకీయం కంటే మించిన ఉద్యోగం వేరేది ఉండదు. ఇదంతా ఎందుకంటే ఒకనాడు ఇదే విశాఖలో కలం పట్టి మంత్రులను ఇంటర్వ్యూ చేసిన పాత్రికేయుడు, ఇపుడు తానే ఇంచార్జి మంత్రి హోదాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం. మీడియా మైకులకు, కెమెరాలకు ఎదురునిలిచి తానే వార్తగా మారిపోవడం, చెప్పుకోవడానికే కొత్తగా ఉన్నా అది అసాధ్యమైతే కాదు. ఇంతకు ముందు కూడా టీడీపీ హయాంలో కాలువ శ్రీనివాసులు మంత్రిగా, ఎంపీగా పనిచేసిన వారే. ఇపుడు వైసీపీలో ఓ పాత్రికేయ మంత్రి గారు ఉన్నారు. ఆయనే కురసాల కన్నబాబు. కన్నబాబు పూర్వాశ్రమంలో ఓ లీడింగ్ తెలుగు డైలీకి విశాఖలో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశారు.

అలా మొదలైన ప్రస్థానం….

తూర్పుగోదావరి జిల్లా కు చెందిన కన్నబాబు ఈనాడు దినపత్రికలో అప్పట్లో విశాఖ జిల్లాలె జర్నలిస్ట్ గా సేవలు అందించి ప్రముఖ పార్టీల నేతలందరితోనూ మంచి పరిచయాలు పెంచుకున్నారు. ఇక బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబు 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం తరఫున కాకినాడ రూరల్ నుంచి తొలిసారి గెలిచి అసెంబ్లీలో చురుకైన పాత్ర పోషించారు. తరువాత కాంగ్రెస్ లో చేరినా కూడా తన ఉనికి బలంగా చాటుకుంటూ వచ్చారు. 2014 నాటికి కాంగ్రెస్ విభజన గాయలతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా తక్కువ ఓట్లతో ఓటమి పాలు అయ్యారు. ఇక తాజా ఎన్నికల్లో ఆయన బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. అటు చంద్రబాబుకు, ఇటు చిరంజీవికి కూడా సన్నిహితుడుగా పేరు పొందిన కన్నబాబుకు విశాఖ జిల్లాలోని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంటి వారితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి.

సమర్ధుడనే…

విశాఖ జిల్లాలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. పైగా ఇక్కడ మెజారిటీ కాపులు జై టీడీపీ అంటున్న స్థితి. మరో వైపు అర్బన్ జిల్లాలో వైసీపీ బాగా వీక్ గా ఉంది. మంత్రిగా అవంతి శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చినా కూడా ఆయన దూసుకుపోలేకపోతున్నారు. పైగా అవంతి, కన్నబాబు ఇద్దరు ప్రజారాజ్యం నుంచి వచ్చినవారే కావడంతో కన్నబాబుని విశాఖ ఇంచార్జిని చేయడం ద్వారా జగన్ రాజకీయంగా ఎక్కువగానే ఆశిస్తున్నారని అంటున్నారు. మరో వైపు మాజీ మంత్రి గంటాతో పాటు, ఆయన బ్యాచ్ టీడీపీలో ఉంది. తనకున్న పరిచయాలతో కన్నబాబు గేలం వేస్తే టీడీపీలో ఉన్న పాత మిత్రులు వైసీపీ వైపుగా మళ్ళే అవకాశం ఉంది. ఇంతకు ముందు జిల్లా ఇంచార్జిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ నిదానస్తుడు. ఆయన స్థానంలో కన్నబాబుని నియమించడం ద్వారా జగన్ పెద్ద బాధ్యతనే పెట్టారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలవాలి. కాపులు వైసీపీ వైపు మళ్ళాలి. పార్టీ కూడా పటిష్టం కావాలి. మరి ఇవన్నీ విశాఖ గురించి ఓ పాత్రికేయునిగా పూర్తి అవగాహన ఉన్న కన్నబాబు చేయగలరని జగన్ గట్టిగానే నమ్ముతున్నారు, చూడాలి మరి.

Tags:    

Similar News