జానారెడ్డికి ఓటమి జ్వరం పట్టుకుందా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జనారరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే వరస ఓటములు జానారెడ్డిని కలవరానికి [more]

Update: 2021-04-01 09:30 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జనారరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే వరస ఓటములు జానారెడ్డిని కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవకపోవడంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందన్న టెన్షన్ జానారెడ్డిలో మొదలయింది. జానారెడ్డి నాగార్జున సాగర్ లో బలమైన అభ్యర్థి. దీనిని ఎవరూ కాదనలేరు.

బీజేపీ బలహీనంగా ఉన్నా…..

అయితే జానారెడ్డికి ఇక్కడ మరో అదృష్టమేంటంటే.. బీజేపీ బలహీనంగా ఉండటం. దుబ్బాక, హైదరాబాద్ స్థాయిలో ఇక్కడ బీజేపీ ప్రభావం చూపే అవకాశాలు లేవు. దీంతో జానారెడ్డి ఈసారి తన గెలుపు ఖాయమని మొన్నటి వరకూ భావించారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా ప్రజలు తననే ఆదరిస్తారన్న నమ్మకంతో జానారెడ్డి ఉన్నారు. అయితే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోవడంతో జానారెడ్డి వ్యూహాలు మార్చే యత్నంలో ఉన్నారు.

కాంగ్రెస్ అంటే….

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించేందుకు ఇష్టపడటం లేదని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా స్పష్టంగా బయటపడింది. అధికార టీఆర్ఎస్ కు అధికంగా ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదని ఆ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు నాగార్జున సాగర్ లో నోముల నరసింహయ్య మరణంతో ఏర్పడిన ఎన్నిక కావడంతో సానుభూతి కూడా ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి ఇటీవల సీనియర్ నేతలతో వ్యూహరచన చేసినట్లు తెలిసింది.

సోనియాతో ప్రచారం…..

ఇప్పటికే జానారెడ్డి నాగార్జున సాగర్ లో పర్యటిస్తున్నారు. ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. అయినా వరస ఓటములతో ఉన్న కాంగ్రెస్ కు నాగార్జునసాగర్ లో గెలవకపోతే మరింత ఇబ్బంది పడుతుంది. అందుకే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి సోనియాను ఆహ్వానించాలని జానారెడ్డి భావిస్తున్నారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా ఒకసారి సాగర్ ప్రచారంలో పాల్గొంటే ఓటమి నుంచి గట్టెక్కుతామని జానారెడ్డి భావిస్తున్నారు. ఈమేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News