పెద్దాయన పైనే భారమంతా?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే భవిష్యత్ ఉంటుందన్నది వాస్తవం. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని [more]

Update: 2021-03-08 11:00 GMT

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే భవిష్యత్ ఉంటుందన్నది వాస్తవం. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే వీలుంటుంది. ఎగిరెగిరిపడే బీజేపీకి సమాధానమిచ్చినట్లు అవుతుంది. పార్టీ నుంచి వలసలకు చెక్ పడేందుకు అవకాశాలున్నాయి. సాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ఇన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశముంది. అందుకే పెద్దాయన జానారెడ్డిపైనే భారమంతా మోపారు.

కుంగిపోయి ఉన్న కాంగ్రెస్ కు……

వరస ఓటములతో కుంగిపోయిన, నీరస పడిన కాంగ్రెస్ కు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు రావడం అదృష్టంగానే భావించాలి. దుబ్బాక ఉప ఎన్నికలో దారుణ ఓటమి పాలు కావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్ స్థానానికే పరిమితం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు నీరసపడ్డాయి. మరోవైపు రెట్టించిన ఉత్సాహంతో బీజేపీ దూకుడుగా ఉంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని వరస విజయాలతో చెప్పుకునే అవకాశం బీజేపీకి దక్కింది. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలుపు జానారెడ్డిపైనే ఆధారపడి ఉంది.

వ్యక్తిగత ఇమేజ్ తోనే….

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జాతీయ స్థాయి సమస్యలు పనిచేయవు. స్థానిక సమస్యలే ఇక్కడ ప్రభావం చూపనున్నాయి. జానారెడ్డి వ్యక్తిగత ప్రతిష్టే ఇక్కడ ఎక్కువగా పనిచేస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే ఏడుసార్లు విజయం సాధించిన జానారెడ్డి గత ఎన్నికలలో కేవలం స్వల్ప ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి ఆయన అవకాశాన్ని చేజార్చుకునేందుకు సిద్ధంగా లేరు.

టీఆర్ఎస్ కు ధీటుగా……

అధికార పార్టీకి ధీటుగా జానారెడ్డి వ్యూహాలను రచిస్తున్నారు. తనపై అధికార పార్టీ ఎవరిని బరిలోకి దింపినా అందుకు తగిన ప్రణాళికలను జానారెడ్డి సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జానారెడ్డి అన్ని మండాలాల్లో ప్రచారాన్ని పూర్తి చేశారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలను పెట్టి వారిని ఆకట్టుకుంటున్నారు. జానారెడ్డి మిగిలిన నేతలు మాదిరి కాదు. పార్టీ మారే మనస్తత్వం లేదు. అదే జానారెడ్డికి ప్లస్ పాయింట్ అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కు సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు అనివార్యమనే చెప్పాలి. అందుకే కాంగ్రెస్ నేతలు జానారెడ్డిపై పూర్తి భారం పెట్టేశారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News