ఎలగెలగెలాగా… మేనమామే టార్గెట్ అట

ఇంటి పేరు కూన. వంటి పేరు మాత్రం రాజకీయ నెరజాణ. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ కొత్త అధ్యక్షుడు కూన రవికుమార్. మేనమామ ప్రస్తుత స్పీకర్ [more]

Update: 2020-10-15 03:30 GMT

ఇంటి పేరు కూన. వంటి పేరు మాత్రం రాజకీయ నెరజాణ. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ కొత్త అధ్యక్షుడు కూన రవికుమార్. మేనమామ ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం చాటున‌ రాజకీయ అరంగేట్రం చేసినా కూడా అన్నీ తానే అయి నాడు మామ కోసం చేసిన రాజకీయం ఇపుడు తనకు బాగా ఉపయోగపడింది. ఎపుడైతే తమ్మినేని ప్రజారాజ్యంలోకి ఫిరాయించారో నాటి నుంచి టీడీపీని అట్టిపెట్టుకుని ఉండడమే కాదు, చంద్రబాబుకు బాగా దగ్గర అయ్యారు. అంతే కాదు, మేనమామ తీవ్రంగా వ్యతిరేకించే కింజరాపు కుటుంబంతోనే కొత్త దోస్తీ కట్టి రాజకీయంగా రాటుదేలారు. ఇక ఆముదాలవల‌సలో ఆముదం వృక్షంగా ఉన్న తమ్మినేని నీడన తాను కూడా ఎదగగలనని నిరూపించుకున్నారు.

బస్తీమే సవాల్……

ఏడు పదుల వయసుకు తమ్మినేని సీతారాం రాజకీయం చేరింది. జగన్ వేవ్ తో పాటు తమ్మినేని ఏజ్ సెంటిమెంట్ కూడా కలసి కూన రవికుమార్ ని మాజీ ఎమ్మెల్యేని చేశాయి. తన‌కు ఇవే చివరి ఎన్నికలు అంటూ ఎన్నికల వేళ పెద్దాయన చేసుకున్న విన్నపం ఫలించి ప్రజలు వైసీపీని గెలిపించారు. ఇక జీవితంలో ఆఖరుసారి అయినా మంత్రి పదవిని చేపట్టాలని తమ్మినేని ఆశపడ్డారు. కానీ జగన్ మాత్రం స్పీకర్ ని చేశారు. ఇక తమ్మినేని దాని మీద అలకబూనడం తప్ప ఏమీ చేయలేరు. కానీ మేనల్లుడి మీద రాజకీయ యుద్ధం మాత్రం ఎక్కడా ఆపడంలేదు. తన చేతుల మీదుగా ఎదిగిన మేనల్లుడి ఈ రోజు ఇలా ఎదురు నిలిచి సవాల్ చేయడాన్ని తమ్మినేని అసలు తట్టుకోలేకపోతున్నారు.

రఫ్ఫాడించేస్తారా….

ఇక శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ ప్రెసిడెంట్ పదవి వచ్చిన తరువాత కూన రవికుమార్ జోరు వేరేగా ఉంది. తాను పసి కూనను అనుకున్నారేమో అసలు కానంటూ మేనమామ సహా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపించేశారు. నేను నోట్లో వేలు పెట్టుకున్నాను అనుకుంటే అది మీ తప్పే అవుతుంది. ఇక వైసీపీని జిల్లాలో ఎలా ఎలిమినేట్ చేయాలో తనకు పక్కాగా తెలుసు అని కూన రవికుమార్ గర్జిస్తున్నారు. కొత్త మంత్రి సీదరి అప్పలరాజుకు అధికార పదవితో వచ్చిన బరువుని తగ్గిస్తామని కూడా అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కి టీడీపీ తడాఖా చూపిస్తాను అంటున్నారు.

బావమరిదితోనేనా…

ఈసారి ఆముదాలవలస ఎన్నికలు చిత్రంగా ఉండేలా సీన్ కనిపిస్తోంది. తమ్మినేని సీతారాం స్వచ్చంద రాజకీయ విరమణ ప్రకటిస్తారని అంటున్నారు. ఆయన తన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ ని వారసుడిగా ముందుకుతెస్తున్నారు. మేనల్లుడిని నమ్ముకుని ఇంతదాకా తెచ్చుకున్న తమ్మినేని ఇపుడు కొడుకుని తీర్చిదిద్దే పనిలో పడ్డారు. కూన రవికుమార్ కి సరైన జవాబు తన వారసుడే అని గట్టిగా అంటున్నారు. ఇక తాను సీన్లో తప్పుకుని రవి సవాళ్ళకు జవాబు చెప్పే బాధ్యతను కుమారుడికి అప్పగించేశారు. మరి అటు కూన రవి కుమార్ ఉంటే ఇటు రాజకీయంగా పసి కూన తమ్మినేని వారసుడు ఉన్నారు.ఈ ఇద్దరిలో ఎవరు అసలైన నెరజాణ అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది. మొత్తానికి కూనను ముందు పెట్టి చంద్రబాబు చేస్తున్న రాజకీయం జిల్లాలో ప్రకంపనలు పుట్టిస్తోంది.

Tags:    

Similar News