కూన ఆముదం తాగించేస్తున్నాడుగా

ఆయన ఇంటి పేరు కూన. ఒంటి పేరు రవికుమార్. కానీ ఆయన మాత్రం అసలు సిసలు రాజకీయ నెరజాణ. ఆయన్ని తట్టుకోవడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇపుడు [more]

Update: 2020-05-26 06:30 GMT

ఆయన ఇంటి పేరు కూన. ఒంటి పేరు రవికుమార్. కానీ ఆయన మాత్రం అసలు సిసలు రాజకీయ నెరజాణ. ఆయన్ని తట్టుకోవడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇపుడు అధికారంలో ఉన్నా కానీ వైసీపీ వల్ల కావడంలేదు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీలో అంతా సీనియర్ లీడర్లు, షష్టి పూర్తి బ్యాచ్ ఉన్న వేళ కూన పదేళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి కూన రవికుమార్ సత్తా చాటాడు. ఇప్పటికి రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా పనిచేసిన కూన రవికుమార్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. సొంత మామ తమ్మినేని సీతారాం ఆముదాలవలసలో నెగ్గారు, కానీ ఆయన రాజకీయ అనుభవాన్ని మించి మరీ కూన మొత్తం జిల్లాలోని వైసీపీ నేతలకు ఆముదం తాగించేస్తున్నాడు. ఆయన్ని తట్టుకోవడం ఎలాగో తెలియక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.

అధికారుల మీద……

కూన రవికుమార్ తాను ఇప్పటికీ అధికారంలో ఉన్నాననే భావిస్తున్నారు, అదే దర్జా చూపిస్తున్నారు. ఆయన అక్రమ మధ్యం వ్యాపారం చేస్తారని, అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ కేవలం వారు ఆరోపణలు చేసి ఊరుకుంటున్నారు. ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా కూన రవికుమార్ ను ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. శ్రీకాకుళం జిల్లాలో అక్రమ మధ్యం ప్రవహిస్తూంటే వైసీపీ మంత్రి ఏంచేస్తున్నారని ఏకంగా తన సొంత ప్రభుత్వం మీదనే తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారంటేనే కూనకు సర్కార్ మద్దతు ఎంత ఉందో చెప్పుకోవచ్చు. ఇక అక్రమంగా ఇసుక రవాణా చేస్తూంటే పట్టుకున్నారని పొందూరు తహశీల్దార్ మీదనే కూన మాటలతో దాడి చేశారు. అంతకు ముందు సరుబుజ్జిలి ఎంపీపీ మీద కూడా ఇదే తీరున కూన విరుచుకుపడ్డారు. ఆయన మీద కేసులు పెట్టడం తప్ప వైసీపీ ఏమీ చేయలేకపోతోంది.

దెబ్బ తిన్న నైతిక స్థైర్యం….

ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాలోని అధికారులలో నైతిక స్థైర్యం దెబ్బ తింటోంది. వారు పని ప్రశాంతంగా చేయలేకపోతున్నారు. తాము నిజాయతీగా పనిచేస్తే ఆదుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వం సిధ్ధంగా ఉందన్న భరోసా వారికి కలగడంలేదు. అదే సమయంలో అక్రమాలను అడ్డుకుంటూంటే కూన రవికుమార్ లాంటి వారు నేరుగా టార్గెట్ చేస్తూ అధికారులను బెంబేలెత్తిస్తున్నారు. దీంతో అధికారులకు ఏమీ పాలుపోవడం లేదు. వారు కనుక గమ్మున ఉంటే మాత్రం ప్రభుత్వం ఒక్క క్షణం కూడా పాలన చేయలేదని చెప్పవచ్చు.

మంత్రి ఫెయిలేనా..?

జిల్లాలో ఏకైక మంత్రిగా ధర్మాన క్రిష్ణ దాస్ ఉన్నారు. ఆయన మెత్తదనంతో ఉంటున్నారు. ఆయనకు రాజకీయ అనుభవం పదేళ్ళు మాత్రమే. ఆయన నెమ్మదిగా ఉండడమే కాదు, కింజరాపు కుటుంబంతో మొహమాటాలు కూడా ఉన్నాయని అంటున్నారు. కింజరాపు కుటుంబం ఇపుడు జిల్లాలో కూన రవికుమార్ లాంటి వారిని ప్రోత్సహిస్తోంది. దాంతో వారిని ఏమీ అనలేక అలాగనీ కామ్ గా ఉండలేక మంత్రి గారు తికమక పడుతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో కూన రవికుమార్ లాంటి వారు ఇదే అద‌నుగా రెచ్చిపోతున్నారు. మరి సాక్షాత్తూ ప్రభుత్వ అధికారుల మీద కూన స్వారీ చేస్తూంటే ప్రభుత్వం పట్టనట్లుగా ఉంటే రేపటి రోజున ఉద్యోగులు అంతా వైసీపీకి యాంటీ అయినా ఆశ్చర్యం లేదు. పరిస్థితి చేయిదాటక ముందే సర్కార్ తన సత్తా చూపించాలని వైసీపీలోనే గట్టిగా డిమాండ్ వినిపిస్తోంది.

Tags:    

Similar News