వైసీపీ అట్టర్ ప్లాప్ అయిందే…?

ఆయన ఇంటిపేరు కూన. కానీ ఆయన మాత్రం రాజకీయంగా పసి కూన కానే కాదు, అంతకు మించి ఘనాపాఠి. అందుకే ఆయన ఆటలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో [more]

Update: 2019-09-25 03:30 GMT

ఆయన ఇంటిపేరు కూన. కానీ ఆయన మాత్రం రాజకీయంగా పసి కూన కానే కాదు, అంతకు మించి ఘనాపాఠి. అందుకే ఆయన ఆటలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సాగుతాయి. ఆయన ముందు తొడగొట్టిన వారు పడిపోయారే కానీ పడగొట్టలేక పోయారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రభుత్వ మాజీ విప్ కూన రవి మొత్తానికి వైసీపీని ఓడించి విజయవంతంగా బయటకు వచ్చేశారు. ఆయన్ని అరెస్ట్ చేద్దామనుకుని కలలు కన్న వైసీపీ పెద్దల కళ్ళకు బైర్లు క‌మ్మేలా తనదైన రాజకీయ వ్యూహంతో రవి చిత్తు చేశారు. విపక్షంలో ఉన్నా కూడా తానే గ్రేట్ అనిపించున్నారు. తనను అరెస్ట్ చేయలేరు అని గ‌ట్టిగా చెప్పి మరీ జనంలోకి కూన రవి వచ్చేశారు. ఓ విధంగా ఇది వైసీపీ వైఫల్యంగా చెప్పాలి. మరో విధంగా స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యక్తిగత అపజయంగా కూడా చెప్పాలి.

ముందస్తు బెయిల్ సాధించి …

కూన రవి కధ అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం కి స్వయాన మేనల్లుడు పదేళ్ళ క్రితం వరకూ మామ వెనక ఉంటూ వచ్చిన నేత. తమ్మినేని అలా బయటకు వెళ్ళడంతో టీడీపీలో సీటు సంపాదించి ఎమ్మెల్యే అయిపోయారు, ప్రభుత్వ విప్ గా కూడా అధికారం చలాయించారు. ఆ టైంలోనే తమ్మినేని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇపుడు తమ్మినేని వంతు వచ్చింది. అధికారం చేతిలో ఉంది కదా అని ఆయన కూన రవి విషయంలో సీరియస్ గానే దృష్టి పెట్టారు. సరుబుజ్జిలి మండంలోని అధికారులపైన కూన రవి ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో కూన రవి అరెస్ట్ ఖాయమని అంతా భావించారు. తమ్మినేని సైతం చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పుకొచ్చారు. కానీ నెల రోజులు గడచినా ఎవరికీ కనిపించకుండా దాక్కున్న కూన రవి ఆచూకీ కనుగొన‌డంలో పోలీసులు విఫలం అయ్యారు. దాంతో మూడుమార్లు తిరస్కరణకు గురి అయినా చివరకు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ సంపాదించుకుని కూన రవి మళ్ళీ రాజకీయ మైదానంలోకి వచ్చేశారు.

టీడీపీ దూకుడే….

జిల్లాలో పదికి ఎనిమిది ఎమ్మెల్యేలు కలిగి ఉన్నా కూడా వైసీపీ అధికార దర్పం ఎంత బలహీనంగా ఉందో కూన రవి ఉదంతం తెలియచేస్తోంది. ఏకంగా అధికారుల మీద జులుం చేసి మరీ బెయిల్ మీద వచ్చేసిన కూన రవి విషయంలో కనీసం అరెస్ట్ చూపించలేని నిస్సహాయ స్థితిలో వైసీపీ ప్రభుత్వం అక్కడ ఉందని తెలిసిపోతోంది. ఇక వైసీపీ మంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఈ విషయంలో ఎక్కడా పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనిపించలేదు. పైగా కింజరపు కుటుంబంతో ఉన్న మంచి సంబంధాల వల్ల కూడా సైలెంట్ అయ్యారని అంటారు. దాంతో చేతిలో అధికారం లేకపోయినా కధ నడిపించి కూన రవిని అరెస్ట్ కాకుండా టీడీపీ కాపాడుకోగలిగింది. ఇది ఆ పార్టీ విజయంగానే చూడాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో గండర గండడు లాంటి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లొంగిపోయాడంటే అక్కడ వైసీపీ నేతల పట్టుదల, ప్రభుత్వ పనితీరు కూడా కనిపించింది. మరి శ్రీకాకుళంలో ఇదే తీరుగా ఉంటే సైకిల్ పరుగులకు ఫ్యాన్ పార్టీ ఇబ్బందులు పడకతప్పదని అంటున్నారు.

Tags:    

Similar News