క్లైమాక్స్ లో జరిగేదిదేనా….?

కర్ణాటక రాజకీయాలు చివరి అంకానికి చేరుకున్నాయి. రేపటితో కర్ణాటక సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. అయితే 24గంటల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. [more]

Update: 2019-07-17 16:30 GMT

కర్ణాటక రాజకీయాలు చివరి అంకానికి చేరుకున్నాయి. రేపటితో కర్ణాటక సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. అయితే 24గంటల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు రెండు వర్గాలకూ అనుకూలంగా ఉన్నట్లే కనపడుతుంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాన్ని స్పీకర్ కే పూర్తి స్వేచ్ఛను ఇస్తూ తీర్పు నిచ్చింది. ఇక మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలు రేపు సభకు హాజరు కావడంపై వారికి స్వేచ్చను ఇచ్చింది.

వేటు వేయాలంటూ….

దీంతో స్పీకర్ అసంతృప్త ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు సభకు హాజరుకావాలని విప్ జారీ చేసే అవకాశముంది. విప్ ను థిక్కరించిన వారిపై సస్పెన్షన్ వేటును వేసేలా రెండు పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. బలపరీక్షకు ముందుగానే వీరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే రెండు పార్టీలూ స్పీకర్ రమేష్ కుమార్ ను కోరాయి.

ముగిసేవరకూ ముంబయిలోనే…

మరోవైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప మాత్రం కుమారస్వామి బలపరీక్షలో ఓడిపోవడం ఖాయమంటున్నారు. ఇప్పటికే అసంతృప్త ఎమ్మెల్యేలు కోర్టు తీర్పు తర్వాత తాము అసెంబ్లీకి వచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. కుమారస్వామి బలపరీక్ష ముగిసే వరకూ ముంబయిలోనే వారు ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. 16 మంది ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొడితే కుమారస్వామి సర్కార్ పతనం ఖాయమంటున్నారు.

దిగిపోక తప్పదా…?

కర్ణాటకలో ప్రస్తుతమున్న బలాబలాలను తీసుకుంటే బీజేపీ వైపే మొగ్గు కన్పిస్తుంది. కుమారస్వామి దిగిపోక తప్పదంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సభ్యుల బలం 107కు చేరింది. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ బలం 101కి పడిపోయింది. దీంతో ఎటు చూసినా కుమారస్వామి బలపరీక్షలో నెగ్గేందుకు ఛాన్స్ లేదు. అయితే చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చన్న ఆశతో కుమారస్వామి ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News