ఈ సెగ ఎప్పటికైనా తప్పదా?

Update: 2018-08-13 17:30 GMT

పొరుగున ఉన్న కర్ణాటకలో మరో ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైంది. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉత్తర కర్ణాటక ప్రజలు గళమెత్తుతున్నారు. నిర్లక్ష్యానికి గురైన తమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమని వారు వివరిస్తున్నారు. కంటితుడుపు చర్యలు, తాత్కాలిక పరిష్కారాలు సమస్యను పరిష్కరించలేవని, సొంత రాష్ట్రంలోనే తమకు న్యాయం జరుగుతుందని స్పష్టీకరిస్తున్నారు. పాలకుల మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని, హామీలు తప్ప ఆచరణలో తమ ప్రాంతానికి ఏమీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడు దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎంతోకాలం కొనసాగదని, దీనికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంత ప్రజానీకం భావిస్తోంది.

విసిరేసినట్లుండే......

ఉత్తర కర్ణాటక ప్రాంతం ఒక మూలన విసిరేసినట్లు ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాంతాన్ని ముంబయి-కర్ణాటక, నిజాం నవాబు పాలిత ప్రాంతాన్ని హైదరాబాద్-కర్ణాటకగా వ్యవహరిస్తారు. ఉత్తర కర్ణాటక భౌగోళికంగా పెద్దదే. 13 జిల్లాల్లో ఇది ఉంది. బీదర్, గుల్బర్గా, విజయపుర, యాదగిరి, రాయచూరు, బళ్లారి, కొప్పల, హోవేరీ, ధార్వాడ, గదన్, బెళగావి, చాగల్ కోట జిల్లాలు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంత జనాభా 2.45 కోట్లు, విస్తీర్ణం 88,361 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా కర్ణాటక మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఉత్తర కర్ణాటక (కురునాడు), కోస్తా కర్ణాటక (కారావళి) దక్షిణ కర్ణాటక ప్రధాన ప్రాంతాలు. ఆదినుంచి రాష్ట్ర రాజకీయాల్లో దక్షిణ కర్ణాటకదే ఆధిపత్యం. ఆ ప్రాంత నాయకులే ముఖ్యమంత్రులవుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. రాజధాని బెంగళూరు సుదూరంలో ఉంది. ఈ ప్రాంతంలో వనరులున్నప్పటికీ అభివృద్ధి శూన్యం. నదులు, గనులు ఇతర సహజ వనరులను సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. ప్రాంతీయ అసమానతలను నివారించే లక్ష్యంతో గతంలో నంజుడప్ప కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ దాని సిఫార్సులను పాలకులు బుట్టదాఖలు చేశఆరు. 2012లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ 371 అధికరణాన్ని సవరించింది. దీనివల్ల ఉద్యోగ, విద్యారంగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు లభించాయి. ఈ ప్రాంత అభివృద్ధికి రూ.2500 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. పైపై మెరుగులు తప్ప తమ మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వైరుధ్యాలు అనేకం.....

భాషాపరమైన, సాంస్కృతిక పరమైన వైరుథ్యాలు కూడా కన్నడ ప్రజల్లో ఉంది. తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో హిందీ, ఉర్దూ ప్రభావం అధికంగా కన్పిస్తోంది. ఇది ఒకప్పటి నిజాం పాలిత ప్రాంతం. పూర్వపు బొంబాయి రాష్ట్రంనుంచి కర్ణాటకలో కలిసిన ప్రాంతాల్లో మరాఠీ భాష ప్రాబల్యం ఎక్కువ. ఇక దత్త మండలాలుగా పేర్కొనే బళ్లారి, రాయచూరు తదితర ప్రాంతాల్లో తెలుగు భాషను ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఉత్తర కర్ణాటకకు చెందిన వారి కన్నడ మాండలికం పూర్తిగా భిన్నమైనది. బెంగళూరు, మైసూరు డివిజన్లు అభివృద్ధి చెందినంతగా ఉత్తర కర్ణాటక అభివృద్ధి చెందలేదన్నది చేదు నిజం. ఈ ప్రాంత ప్రజల గోడును ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ప్రజలను సంతృప్తి పర్చేందుకు బెళగావిలో సువర్ణ సౌధ పేరిట రెండో సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఇక్కడ రెండుసార్లు శాసనసభ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్ట సవరణ చేశారు. ఇవి ప్రజలను సంతృప్తి పర్చలేకపోయాయి. తాజాగా కుమారస్వామి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ ఈ ప్రాంతానికి అన్యాయం చేశారన్న ఆరోపణలు విన్పించాయి. ఇక ‘‘మహాదాయి’’ జల వివాదం నేటికీ పరిష్కారం కాకపోవడం ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోంది.

బీజేపీ మద్దతు ఉందా?

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఈ నెల 2న బంద్ బంద్ జరిగింది. వివిధ ప్రజా సంఘాలతో ఏర్పాటైన ఉత్తర కర్ణాటక పోరాట సమితి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా బెళగావిలో ప్రత్యేక జెండాను ఆవిష్కరించారు. పసుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులో ఈ జెండాను రూపొందించారు. ఉద్యమానికి పరోక్షంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మద్దతు ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పార్టీ అధినేత బి.ఎస్. యడ్యూరప్ప బెళగావిలో జరిగిన దీక్షలో పాల్గొన్నారు. బళ్లారి నాయకుడు బి.శ్రీరాములు, ఉమేష్ కత్తి వంటి నాయకులు ఉత్తర కర్ణాటక ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించడం విశేషం. ఉద్యమానికి తాను నాయకత్వం వహిస్తానని శ్రీరాములు ప్రకటించడం గమనార్హం.

పద్ధెనిమిదేళ్ల క్రితమే......

అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం మౌనాన్నే ఆశ్రయించింది. ఇతమిద్ధంగా ఏ విషయమూ చెప్పడం లేదు. గత నెల 31న బెళగావిలో ‘‘సువర్ణ సౌధ’’ వద్ద జరిగిన సత్యాగ్రహ దీక్షలో పెద్ద సంఖ్యలో మఠాధిపతులు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలోనే సామాజిక ఉద్యమకారుడు వైజయంత్ పాటిల్ నాయకత్వంలో ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైందని, అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో కొనసాగుతుందని ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడుతున్నారు. 2006లోనే తాను ముఖ్యమంత్రిగా ఉండగా బెళగావికి రెండో రాజధాని హోదా కల్పిస్తూ తీర్మానాన్ని చేయించానని, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోలేదని ఆయన గుర్తు చేస్తున్నారు. నాటి తీర్మానాన్ని అమలుచేయడంద్వారా ప్రత్యేక ఉద్యమాన్ని ఉపశమింపచేయాలని కుమారస్వామి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించలేదు. ప్రత్యేక ఉద్యమం మున్ముందు ఏ పరిణామాలకు దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News