‘‘కుమార’’ కు అన్ని వైపుల నుంచి కుమ్ముడే...!

Update: 2018-05-22 16:30 GMT

కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి(58) ఎంతో అదృష్టవంతుడు. మొత్తం రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి, అహోరాత్రులు శ్రమించిన నాయకులు ముఖ్యమంత్రులు కావడం కష్టమవుతున్న రోజుల్లో ఆయన ఆ పదవిని సునాయసంగా అందుకోగలుగుతున్నారు. పెద్దగా ప్రజాబలం లేనప్పటికీ, పరిమితమైన శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రాబల్యంతో సీఎం పదవి ఆయన వద్దకు నడుచుకుంటూ వచ్చింది. దీనిని అదృష్టం కాక ఏమనుకోవాలి ? నిజనికి ముఖ్యమంత్రి పదవి చేపట్ట దగ్గ పరిపక్వత గానీ, అనుభవం గానీ ఆయనకు లేవు. 2006లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన వయస్సు 46 ఏళ్ళు. వారసత్వ రాజకీయాలు, పరిస్థితులు కలిసిరావడంతో రెండుసార్లు కన్నడ పీఠాన్ని కైవసం చేసుకోగలిగారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా ‘‘తెలుగు పోస్ట్’’ ప్రత్యేక కథనం.

సినీ నిర్మాతగా....

దేవెగౌడ, చెన్నమ్మ దంపతులకు 1959 డిసెంబరు 16న జన్మించిన కుమారస్వామి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. సినీ నిర్మాతగా, పంపిణీదారుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. తొలుత ‘చంద్రకారి’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో కుమారస్వామికి మంచిపేరు వచ్చింది. కన్నడ కంఠీరవగా పేరొందిన సినీనటుడు రాజ్ కుమార్ కు ఆయన వీరాభిమాని. విద్యార్థి దశలో రాజ్ కుమార్ చిత్రాలు ఉన్న చొక్కాలను ధరించడం ఇందుకు నిదర్శనం. సూర్యవంశ, గలాటి ఆళి మంత్రి వంటి చిత్రాలను నిర్మించారు. అనంతరం కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. కుమారస్వామి కుటుంబం కూడా పెద్దదే. హెచ్.డీ రేవణ్ణ, హెచ్.డీ రమేశ్, హెచ్.డీబాలకృష్ణ ఆయన సోదరులు. హెచ్.డీ అనసూయ, హెచ్.డీ శైలజ సోదరీమణులు. ప్రముఖ వైద్యుడు, జయదేవ్ వైద్యశాల డైరెక్టర్ డాక్టర్ మంజునాథ్ ఆయన సొంత బావ. మానసికంగా కుమారస్వామి సున్నిత మనస్కుడు. ఈ దఫా ఎన్నికల్లో తాను గెలవకుంటే మరణమే శరణ్యం అంటూ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఆయన మానసికస్థితికి ఇది దర్పణం పడోంది. గతంలో బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం తప్పని ఒప్పుకున్నారు.

రాజకీయాలపై అనాసక్తి.....

కుమారస్వామికి మొదటినుంచీ రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. తండ్రి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో సైతం ఆయన రాజకీయాలపై అంత ఆసక్తి చూపలేదు. జనతాదళ్(ఎస్) అధ్యక్షుడు మొరాజుద్దిన్ పటేల్ 1996లో చనిపోవడంతో కుమారస్వామి ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న అప్పటి పార్టీ నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారు. చివరికి దేవెగౌడ కుమారస్వామి వైపే మొగ్గుచూపడంతో సిద్ధరామయ్య పార్టీని వీడారు. అనంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కనకపుర నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరవాతకాలంలో రాజకీయంగా ఎదురుదెబ్బలు తిన్నారు. 1998లో జరిగిన లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. 1999 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయనను ప్రజలు తిరస్కరించారు. 2004లో రామనగర నుంచి మళ్లీ అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. అప్పట్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. కొద్దికాలం సీఎంగా పనిచేశారు. 2006 నుంచి 2007 వరకు బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు.

వ్యక్తిగత జీవితం కూడా.....

కుమారస్వామి వ్యక్తిగత జీవితం కూడా అనేక మలుపులు తిరిగింది. సొంతూరు హసన్ లో ప్రాథమిక విద్య అనంతరం బెంగళూరులో బీఎస్సీ పూర్తి చేశారు. కోలార్ కు చెందిన అనితతో 1986 మార్చి 13న వివాహమైంది. వీరి కుమారుడు నిఖిల్ గౌడకు సినిమాలు అంటే ఆసక్తి ఎక్కువ. దాంతో కుమారుడితో ‘జాగ్వార్’ అనే చిత్రాన్ని స్వయంగా నిర్మించారు కుమారస్వామి. 2006లో నటి రాధికను కుమారస్వామి అనధికారికంగా వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె ‘శమిక’. కుమారస్వామి తన రెండో వివాహం గురించి ఎక్కడా ఎన్నికల అఫిడవిట్ లో ప్రస్తావించలేదు. దీన్ని విపక్షాలు వివాదం చేశాయి. అయితే రాధిక మౌనం వహించడంతో పెద్దగా వివాదం కాలేదు. కొన్నేళ్లుగా రెండో భార్యకు దూరంగా ఉంటున్నారు. ఇద్దరూ వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో రామనగర, చెన్నపట్న నుంచి పోటీచేసిన కుమారస్వామి రామనగర నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అక్కడి నుంచి భార్య అనితను బరిలోకి దించడం ద్వారా కుటుంబాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి సోదరుడు హెచ్.డీ.రేవణ్ణ నుంచి రాజకీయంగా ఎలాంటి భయం లేదు. కానీ భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న భరోసా లేదు.

ముళ్లకిరీటమే.......

మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్న కుమారస్వమికి ఈ పదవి కచ్చితంగా ముళ్ళకిరీటం వంటిది. కాంగ్రెస్ తో వ్యవహారం నడపడం కష్టమన్న సంగతి కొత్త విషయం ఏమీకాదు. పేరుకు ముఖ్యమంత్రి అయినప్పటికీ పెద్దన్నగా హస్తం పార్టీ తెరవెనక నుంచి చక్రం తిప్పడం ఖాయం. అది పెట్టే డిమాండ్లను, షరతులను ఆమోదించి ముఖ్యమంత్రి పదవిలో ఎంతకాలం కొనసాగగలరన్నది ప్రశ్నార్థకం. అవసరమైతే మద్దతును ఉపసంహరించడానికి అది వెనుకాడబోదు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. కాంగ్రెస్ ఇంకొంత ముందుకు పోయి జనతాదళ్(ఎస్)లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో కుమారస్వామికి సీఎం పదవి కచ్చితంగా ముళ్ళకిరీటం వంటిదే.

గవర్నర్ తోనూ చికాకులే.....

రాజకీయాలను పక్కనపెడితే పాలనపరంగా కూడా కుమారస్వామికి అనేక చిక్కులు, ఇబ్బందులు ఎఎదురుకానున్నాయి. ముందుగా గవర్నర్ వాజుభాయ్ వాలా నుంచి ప్రమాదం ఉంది. బిల్లుల ఆమోదంలో, ఇతర విషయాల్లో ఆయన ప్రభుత్వానికి చికాకులు కల్పించవచ్చు. బీజేపీ గవర్నర్ గా అదేపని చేస్తారు. ఇక కాంగ్రెస్, జనతాదళ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం అంత సులభం కాదు. వీటిని తీర్చదానికి అవసరమైన ఆర్థికవనరులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది. జీతాలు, పింఛన్ల చెల్లింపులు, రోజూవారీ ఖర్చులకే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సరిపోతోంది. ఇక అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు సొమ్మును సమకూర్చుకోవడం అంత తేలిక కాదు. సిద్ధాంతపరమైన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల అటువైపు నుంచి సహకారం ఉండదు. ఈ నేపథ్యంలో కుమారస్వామి పని కత్తిమీద సాము చేయాల్సి ఉంటుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News