ఏ నిమిషానికి ఏమి జరుగునో..?

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూనే ఉన్నాయి. సీఎం కుమారస్వామి సర్కార్ లో ఉన్న లుకలుకల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎదురు చూడటంతో పాటు ఆపరేషన్ ఆకర్ష్‌కు [more]

Update: 2019-02-09 08:00 GMT

కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూనే ఉన్నాయి. సీఎం కుమారస్వామి సర్కార్ లో ఉన్న లుకలుకల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఎదురు చూడటంతో పాటు ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ తెరతీయడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. ఒక పక్క కాంగ్రెస్ ఎమ్యెల్యేలు, మరో పక్క బీజేపీ.. ముఖ్యమంత్రి కుమారస్వామికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో దినదిన గండం నూరేళ్ల‌ ఆయుష్షులా కర్ణాటక సర్కార్ బండి ఈడుస్తూ వస్తుంది.

ఆడియో టేప్ సంచలనం

జేడీఎస్‌ కు చెందిన నాగ గౌడ అనే ఎమ్యెల్యేకు యడ్యూరప్ప బేరం పెట్టిన వ్యవహారం ఆడియో టేప్ రూపంలో నెట్టింట హల్చల్ చేస్తుంది. దీంతో చూశారా ఈ భాగోతం అంటూ కుమారస్వామి రోడ్డెక్కేశారు. ప్రధాని మోడీ టార్గెట్ గా స్వామి నిప్పులు చెరిగారు. తమ సర్కార్ ను పడగొట్టడానికి మోడీ కేంద్రంగా కుట్ర జరుగుతుంది అంటూ ఆరోపణలు గుప్పించారు. కొందరు కాంగ్రెస్ ఎమ్యెల్యేలకు సైతం తాయిలాలు ఎర చూపి బీజేపీ అధికారం కోసం పాకులాడుతుందని స్వామి వాపోయారు. బీజేపీపైకి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని ధ్వజమెత్తారు.

రాజకీయాల నుంచి తప్పుకుంటా

కుమార స్వామి చేసిన ఆరోపణలను రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ సీఎం యడ్యూరప్ప ధీటుగా సమాధానం చెప్పారు. బీజేపీ సర్కార్ ను పడగొట్టాలని చూడటం లేదని అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. అంతర్గత విభేదాలతో సతమతం అవుతున్న జేడీఎస్ సర్కార్ కి మాత్రం నూకలు చెల్లాయని యడ్యూరప్ప చెప్పడం గమనిస్తే కుమారస్వామి ఆరోపణలు, విమర్శలు నిజమేనని అంటున్నారు విశ్లేషకులు. బయటకు వచ్చిన ఆడియో టేప్ మార్పింగ్ అని, తాము ఎలాంటి తప్పుడు పనులు చేయబోమంటున్నారు య‌డ్యూరప్ప. అటు జేడీఎస్ సర్కార్, ఇటు ప్రధాన విపక్షం ఒకరిపై మరొకరుగా సాగుతున్న ఆరోపణలు, విమర్శలు మాత్రం నిత్యకృత్యంగా మారిపోయాయి. ఎప్పటి వ‌ర‌కు ఈ సస్పెన్స్ కొనసాగుతుందో వేచిచూడాలి.

Tags:    

Similar News