కుమార బ్రహ్మాస్త్రం ఏమవుతుంది…?

కర్ణాటక రాజకీయాలు రంగులరాట్నం లా తిరుగుతున్నాయి. నెంబర్ గేమ్ పవర్ కోసం ఫాస్ట్ గా మారిపోతూ వస్తుంది. కుమార స్వామి సర్కార్ కి ఒక పక్క బిజెపి [more]

Update: 2019-07-13 18:29 GMT

కర్ణాటక రాజకీయాలు రంగులరాట్నం లా తిరుగుతున్నాయి. నెంబర్ గేమ్ పవర్ కోసం ఫాస్ట్ గా మారిపోతూ వస్తుంది. కుమార స్వామి సర్కార్ కి ఒక పక్క బిజెపి తో మరోపక్క కాంగ్రెస్ రెబెల్ ఎమ్యెల్యేలతో ఇంకోపక్క సొంత పార్టీ లుకలుకలు తలపోటుగా పరిణమించాయి. ఇవన్నీ దాటుకుని సర్కార్ ను నిలబెట్టుకోవాలంటే ఇక విశ్వాస పరీక్షను ఎదుర్కోవడం తప్ప గత్యంతరం లేదు. అందుకే తాను బలపరీక్షకు సిద్ధం అంటూ బ్రహ్మాస్త్రం బయటకు తీశారు కర్ణాటక ముఖ్యమంత్రి. ఈ దెబ్బతో ముందు ఉండి బిజెపి, వెనుకే ఉండి కాంగ్రెస్ ఆడుతున్న ఆటకు చెక్ పడుతుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా 14 మంది ముంబాయిలోనే ….

రాజీనామాకు సిద్ధపడ్డ 14 మంది ఎమ్యెల్యేలు ఇంకా ముంబాయి హోటల్ లోనే వున్నారు. మరో ఇద్దరు స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినట్లు ప్రకటించారు. 113 మేజిక్ ఫిగర్ అందుకునే వారు సర్కార్ ఏర్పాటు చేసే వీలుంది. ప్రస్తుతం బిజెపికి 107 బలం వుంది. 16 మంది తిరుగుబాటు ఎమ్యెల్యేలు వున్నారు. అయితే సుప్రీం కోర్ట్ మంగళవారం వరకు యధాతధపరిస్థితికి కేసును వాయిదా వేసింది. కోర్ట్ నిర్ణయం ఇలా రాగానే కుమార స్వామి తాను విశ్వాస పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. ఆయన ఇలా ఎదురుదాడికి దిగడం వెనుక పటిష్ట వ్యూహం ఉందా తిరుగుబాటు దారులకు చుక్కలు చూపించడానికా అన్నది మంగళవారం తేలనుంది. రాజీనామా చేసిన ఎమ్యెల్యేలు విశ్వాస పరీక్షలో విప్ ను ఉల్లంఘించి ఓట్లు వేస్తే వారిపై వేటు తప్పదు. దాంతో తాను పదవినుంచి దిగిపోయినా వారి పదవులు రద్దు చేసే యోచనలో కుమారస్వామి ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో అత్యధికులు సిద్ధరామయ్య వర్గం కావడంతో ద్విముఖ వ్యూహంతో ఆయన ముందుకు వెళుతున్నట్లు చెబుతున్నారు.

ట్రబుల్ షూటర్ ప్రయత్నం …

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ శివకుమార్ గత కొద్ది రోజులుగా సర్కార్ ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నం స్వల్పంగా ఫలించింది. రాజీనామాకు సిద్ధం అయిన ఎమ్యెల్యే నాగరాజు శివకుమార్ ఇచ్చిన హామీకి అంగీకారం తెలిపి వెనక్కి తగ్గారు. మిగిలినవారు కూడా ఇలాగే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారన్న ఆశాభావం కాంగ్రెస్ వ్యక్తం చేస్తుంది. మరో పక్క స్పీకర్ ఈ వ్యవహారం సాధ్యమైనంత సాగతీస్తే పరిస్థితి సర్దుమణుగుతుందని భావిస్తున్నారు.

కొనసాగుతున్న క్యాంపులు ….

మరోపక్క కర్ణాటకలో క్యాంప్ రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బిజెపి, జేడీఎస్ తమ తమ ఎమ్యెల్యేలను రిసార్ట్స్ కి తరలించి వారికి భారీ భద్రతతో కాపలా కాసుకుంటున్నాయి. ఇది ఇలా ఉంటే కర్ణాటక రాజకీయాలపై బిజెపి కాంగ్రెస్ నడుమ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. బిజెపి ప్రలోభాలతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. స్పీకర్ ఆలస్యాన్ని భరించలేని బిజెపి గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా వచ్చే మంగళవారానికి కానీ కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News