అయితే అటు…లేకుంటే ఇటు….?

కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ లో లుకలుకలు ఎటువైపునకు దారితీస్తాయో అన్న అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ కుమారస్వామి, దేవెగౌడలు ఎలాంటి నిర్ణయమైనా [more]

Update: 2019-05-18 18:29 GMT

కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ లో లుకలుకలు ఎటువైపునకు దారితీస్తాయో అన్న అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వుతున్న వేళ కుమారస్వామి, దేవెగౌడలు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశముంది. అయితే జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలను బట్టి వారి నిర్ణయం ఉంటుందంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమికి అవకాశాలుంటే ఇక్కడ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండే అవకాశముంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కుమారస్వామి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

సిద్ధరామయ్య గ్రూపు….

కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లోఉన్నారని చెబుతున్నా అది అబద్ధమేనని సిద్ధరామయ్య వంటి నేతలు ఖండించలేకపోతున్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. కుమారస్వామి ఒంటెత్తు పోకడలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు. సిద్ధరామయ్యను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని పార్టీలో స్వరం ఊపందుకుంది. హోంమంత్రి ఎంబీ పాటిల్ సయితం సిద్ధరామయ్యను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారు.

రాజీనామా చేయడానికి….

ఇది కుమారస్వామికి మింగుడుపడటం లేదు. తమ నేతను అవమానపర్చే విధంగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను జనతాదళ్ ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు. సాక్షాత్తూ జేడీఎస్ అధ్యక్షుడు విశ్వనాథ్ సిద్ధరామయ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య ఏం గొప్ప పని చేశారని ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నారని విశ్వనాథ్ వ్యాఖ్యానించారు. ఆయనకు చెంచాగిరీ చేసే వాళ్లే ఇటువంటి ప్రతిపాదనలు తెస్తున్నారని మండిపడ్డారు.

సర్దుబాటు చేసినా….

జేడీఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పెరిగిన మాటల యుద్ధంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుగోపాల్ రంగంలోకి దిగారు. పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు. అయినా కుమారస్వామి మాత్రం లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత సంచలన నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు. శాసనసభలో బీజేపీకి 104, కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్ కు 37 స్థానాలున్నాయి. ప్రస్తుతం రెండు శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరరగబోతున్నాయి. ఈ ఫలితాలను కూడా కుమారస్వామి పదవిని ప్రభావితం చేస్తాయంటున్నారు. కాంగ్రెస్ శృతిమించితే తాము బీజేపీతో చేతులు కలిపేందుకు కూడా సిద్ధమన్న సంకేతాలు జేడీఎస్ నుంచి వస్తున్నాయి. సిద్ధరామయ్య వెనకుండి ఈ తతంగాన్ని నడుపుతున్నారని జేడీఎస్ అంటోంది. మొత్తం మీద కర్ణాటకలో మే 23వ తేదీ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.

Tags:    

Similar News