సిద్ధూ మీద పీకల దాకా కోపం…తగ్గేట్లు లేరుగా

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య పొసగడం లేదు. కాంగ్రెస్ అనే కంటే జేడీఎస్ కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ను టార్గెట్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా [more]

Update: 2020-08-04 17:30 GMT

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య పొసగడం లేదు. కాంగ్రెస్ అనే కంటే జేడీఎస్ కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ను టార్గెట్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా కుమారస్వామి సిద్ధరామయ్య అంటేనే మండి పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎన్నికల బాధ్యతను అప్పగిస్తే తాము పొత్తులపై పునరాలోచిస్తామన్న సంకేతాలను కుమారస్వామి ఇస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ తో జత కట్టడం ఇష్టం లేదన్నదే కుమారస్వామి అభిప్రాయంగా ఉంది.

కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు…..

పధ్నాలుగు నెలల పాటు కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం నడిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ కు అత్యధిక స్థానాలు ఆ ఎన్నికల్లో వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ అధిష్టానం జేడీఎస్ కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. కుమారస్వామి ముఖ్యమంత్రి కావడం సిద్ధరామయ్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఒప్పించింది. చెరి రెండున్నరేళ్ల పాటు సీఎం గా పంచుకోవాలన్న అప్పటి సిద్ధరామయ్య ప్రతిపాదనను కూడా జేడీఎస్ అంగీకరించలేదు.

ఇద్దరి మధ్య….

ఆ తర్వాత కుమారస్వామి సయితం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో మరొక వర్గాన్ని చేరదీయడం మొదలు పెట్టారు. అధికారంలోకి వచ్చిన రెండునెలల నుంచి సిద్ధరామయ్యకు, కుమారస్వామిల మధ్య విభేదాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా విభేదాలు సమసి పోలేదు. ఫలితంగా సిద్ధరామయ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.

ఆయన నేతృత్వంలో అయితే….

కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా యడ్యూరప్ప ఆ పదవిలో ఎన్నాళ్లో ఉండలేరని సిద్ధరామయ్య అంచనా వేశారు. తిరిగి ప్రభుత్వం ఏర్పాటు అయితే తాను ముఖ్యమంత్రి అవ్వాలన్నది సిద్ధరామయ్య ఆలోచన అని కుమారస్వామి కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ కలలు కల్లలయ్యాయన్నారు. తాము యడ్యూరప్ప ప్రభుత్వాన్ని అస్థిరపర్చబోమని కూడా కుమారస్వామి వ్యాఖ్యానించడం సిద్ధరామయ్యను ఉద్దేశించిందే. దీంతో వచ్చే ఎన్నికల బాధ్యతలను కాంగ్రెస్ సిద్ధరామయ్యకు అప్పగిస్తే తాము దూరంగా ఉంటామని కుమారస్వామి చెప్పకనే చెప్పారు.

Tags:    

Similar News