అంతా తాను అనుకున్నట్లుగానే?

కర్ణాటకలో జరుగుతున్న ఉప పోరు త్రిముఖ పోటీ ఖాయమయింది. ఇప్పటి వరకూ జనతాదళ్ ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ కుమారస్వామి [more]

Update: 2020-10-21 18:29 GMT

కర్ణాటకలో జరుగుతున్న ఉప పోరు త్రిముఖ పోటీ ఖాయమయింది. ఇప్పటి వరకూ జనతాదళ్ ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ కుమారస్వామి పోటీకి సై అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటించాలని నిర్ణయించారు. తాము బరిలోకి దిగడం వల్ల ఎవరు నష్టపోయినా పరవాలేదని, తమ క్యాడర్ చెక్కు చెదరకుండా ఉండేందుకే పోటీకి దిగుతున్నట్లు కుమారస్వామి భావిస్తున్నారు.

రెండు చోట్ల…..

కర్ణాటకలో రెండు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి బెంగళూరులోని రాజరాజేశ్వరినగర, రెండు తుముకూరులోని శిర నియోజకవర్గం. ఈ రెండు ప్రాంతాల్లో కొంత జేడీఎస్ కు పట్టుంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన పరాభావాన్ని కుమారస్వామి మర్చిపోయినట్లు లేదు. తన తండ్రిని, కుమారుడిని ఓడించిన కాంగ్రెస్ నేతలతో చేతులు కలపకూడదని నిర్ణయించి పోటీకి దిగాలని నిశ్చయించారు.

నష్టమేమీ లేకపోవడంతో…..

నిజానికి ఈ రెండు ఉప ఎన్నికల వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమూ లేదు. ప్రయోజనమూ లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా పొత్తు విషయంపై పట్టించుకోలేదంటున్నారు. నిజానికి డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ సంబంధాలు మరింత మెరుగుపడతాయనుకున్నారు. సిద్ధరామయ్య మీద ఉండే కోపం కుమారస్వామికి డీకే శివకుమార్ మీద లేకపోవడమే ఇందుకు కారణం.

కాంగ్రెస్ అందుకే…..

రాజ్యసభ ఎన్నికల్లోనూ కుమారస్వామి తండ్రి దేవెగౌడకు కాంగ్రెస్ మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేస్తాయని భావించారు. కానీ ఇప్పుడు విడివిడిగా పోటీ చేయడంతో భవిష్యత్ లో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య పొత్తు ఉండదని తేలిపోయింది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. జేడీఎస్ తో తమ అనుబంధం కొనసాగుతుందని, ఉప ఎన్నికలు కావడం, ఈ ఫలితాలు దేనిపై ప్రభావం చూపించనందువల్లనే తాము జేడీఎస్ తో పొత్తు అంశం మాట్లాడలేదని చెబుతున్నారు. మొత్తం మీద రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు పోటీ చేయడంతో త్రిముఖ పోటీ నెలకొంది. పోటీ ఆసక్తిదాయకంగా మారింది.

Tags:    

Similar News