బావా మరుదులు..లెక్కల్లో తేడానా...?

Update: 2018-12-10 15:30 GMT

తెలంగాణ రాష్ట్రసమితిలో అందరికంటే ఎక్కువ బిజీ అయిపోయారు బావామరుదులు. పార్టీకి జోడెడ్లుగా వ్యవహరిస్తున్న వీరిద్దరినీ పార్టీ వారసులుగానే చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి పీఠానికి ఎవరు వారసులనే విషయాన్న కేసీఆర్ తేల్చాలి. పార్టీ పరంగా మాత్రం వీరిద్దరినీ ద్వితీయశ్రేణినాయకులు, కార్యకర్తలు సమానంగానే చూస్తారు. తెలంగాణ ఎన్నికలు ముగిసి ఫలితాలకోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత తరుణంలో వీరిద్దరు లెక్కల చిక్కుల్లో పడిపోయారు. ఎక్కడ పార్టీకి ఎక్కువ స్థానాలు లభిస్తున్నాయనే అంచనాలు వేస్తున్నారు. భిన్నమైన శైలిలో వీరిరువురూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. పైకి ఎంత అన్యోన్యతను ప్రదర్శిస్తున్నప్పటికీ రాజకీయంగా వీరిమధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవం. దానిని బహిరంగంగా అంగీకరించకపోయినా పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. ఒకరకంగా వీరిమధ్య బాలెన్సింగ్ ఫాక్టర్ గా కేసీఆర్ కుమార్తె కవితను చెప్పుకోవాలి. ఆమెను రాష్ట్రంలో పెట్టకుండా కేంద్రానికి పంపివేయడం కేసీఆర్ తెలివైన నిర్ణయమే. ఇప్పుడు కేటీఆర్,హరీశ్ లు తమ వర్గాలకు చెందిన నాయకులు ఎన్నికవుతున్నారా? లేదా? ఎంతమందికి అవకాశముందనే లెక్కలు తీస్తున్నారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పాటు కావాల్సి వస్తే సమీకరణ ఎలా చేయాలనే అంశంపైనా దృష్టి పెడుతున్నారు.

కేటీఆర్ టెక్నికల్...

కేటీఆర్ లెక్కలు చాలా వెరైటీగా ఉన్నాయంటున్నారు పార్టీ నాయకులు. పూర్తిసాంకేతిక వివరాలపై ఆధారపడుతున్నట్లు గా కార్యకర్తలు చెబుతున్నారు. నియోజకవర్గాలవారీగా ఓటింగు పర్సంటేజీ ఎంత నమోదైంది? అక్కడ సంక్షేమ పథకాలు ఎంతమేరకు అమలవుతున్నాయి? పార్టీ కి అసెంబ్లీ స్థానాల పరిధిలో నిజమైన కార్యకర్తల బలమెంత ఉంది? అన్న కోణాల్లో ఆరాతీస్తూ అక్కడ తమ అభ్యర్థుల గెలుపు అవకాశాలను కేటీఆర్ అంచనా వేస్తున్నారంటున్నారు. అయితే దీనిపై విమర్శలు సైతం వినవస్తున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన వారందరూ ఓటు వేయరు. అలా చేస్తే అసలు టీఆర్ఎస్ కు రాష్ట్రంలో పోటీయే ఉండదు. వివిధ పథకాల రూపంలో కోటిమందికిపైగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారు. అలాగే 60 లక్షలపైగా కార్యకర్తలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ఓటేసినా పార్టీకి ఎదురుండదు. కానీ నిజానికి కార్యకర్తల నమోదు అనేది పెద్ద హంబగ్. సంఖ్యను చూపించడానికి ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు గంపగుత్తగా పేర్లు రాయించేస్తుంటారు. వీటి ఆధారంగా కేటీఆర్ అంచనాలు వేయడమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

హరీశ్ పొలిటికల్....

కేటీఆర్ తో పోలిస్తే హరీశ్ రాజకీయ పరమైన అంచనాలు వేస్తున్నారు. ప్రత్యర్థుల బలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ గెలుపోటములను లెక్క గడుతున్నారు. కూటమి అభ్యర్థుల బలాబలాలేమిటి? వారికి ఏయే సామాజిక వర్గాల నుంచి మద్దతు లభించింది. ఆయా కులాలకు ఎంతమేరకు ఓట్లున్నాయి? కూటమి అసంతృప్తులెవరు? రెబల్స్ గా బరిలో ఉన్నవారు చీల్చిన ఓట్లు ఎంతమేరకు ఉంటాయి? తమ అభ్యర్థి బలాబలాలేమిటనే విషయాల అధారంగా హరీశ్ పార్టీ జయాపజయాలను లెక్కవేస్తున్నారనేది పార్టీ సమాచారం. అందువల్లనే టీఆర్ఎస్ విజయశాతం విషయంలోనూ వీరిద్దరి మధ్య తేడాలు కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హరీశ్ లెక్క అరవై సీట్ల దరిదాపుల్లోఆగిపోతోంది. అయితే కేటీఆర్ అంచనాలు మరోవిధంగా ఉన్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికల తరహాలోనే 90 పైచిలుకు సీట్లు సాధిస్తామనే నమ్మకం ఆయనలో పాతుకుపోయింది. ఎగ్జిట్ పోల్స్ , ఇతర అంశాలతో సంబంధం లేకుండా తాము కచ్చితంగా మూడింట రెండువంతులకు పైగా స్థానాలు సాధిస్తామని ఆయన పక్కాగా పార్టీ నాయకులకు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకనుగుణంగా లేవని పార్టీ నాయకులు ఆయన ముందు చెప్పేందుకు సాహసించడం లేదు. ఈవిషయంలో హరీశ్ కొంచెం లిబరల్ గా ఉంటున్నారు. లోపాలను, బలహీనస్థానాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేసీఆర్ రెస్టు...

ప్రతిపక్షాలు ఆరోపణ చేసినట్లుగానే కేసీఆర్ గెస్టు హౌస్ బాట పట్టారు. నెగ్గినా, ఓడినా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతారన్న విపక్షాల మాటను అబద్ధం చేయడమెందుకనుకున్నారో , ఏమో ఎన్నికల తర్వాత నుంచి కనిపించడం మానేశారు. నిజానికి తెలంగాణలో ఏంజరగబోతోందన్న విషయంలో కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉంది. కేటీఆర్, హరీశ్ ల కంటే స్పష్టమైన సమాచారాన్ని ఆయన సేకరించగలిగారు. పార్టీతో సంబంధం లేకుండా తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు, పార్టీ నాయకులు, ఇంటిలిజెన్సు వర్గాలు, ఒపీనియన్, ఎగ్జిట్ పోల్సు ల నుంచి నాలుగు విధాలుగా సమాచారాన్ని క్రోడీకరించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం పూర్తి చేయడంతోనే తన బాధ్యత పూర్తయినట్లుగా కేసీఆర్ తేల్చిచెప్పేశారు. ప్రజలు అవకాశమిస్తే సేవ చేస్తాను. లేకపోతే రెస్టు తీసుకుంటానని ప్రజల సమక్షంలోనే చెప్పేశారు. ప్రజల నాడి పట్టుకోవడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. టీఆర్ఎస్ లో అందరికంటే ఎక్కువ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే ఆయనకు ఫలితాలపై సంపూర్ణ అవగాహన వచ్చేసిందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫలితమేమిటని ఆయనను అడిగేంత సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News