కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతున్నారా..?

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తీసుకున్న మొదటి నిర్ణయం పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ ను నియమించడం. ఈ [more]

Update: 2018-12-29 02:30 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తీసుకున్న మొదటి నిర్ణయం పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ ను నియమించడం. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా పూర్తిగా పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చేతుల్లో పెట్టారాయన. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కావాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ పార్టీ బాధ్యతలను కేటీఆర్ కి అప్పగించారు. ఇక బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ మొదటి రోజు నుంచే పార్టీ వ్యవహారాల్లో చాలా కీలకంగా మారిపోయారు. పార్టీ బాధ్యతలు తీసుకోగానే పలు జిల్లాల్లో పర్యటించారు. సభలు నిర్వహించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పార్టీ ఉంటుందని చెప్పారు. అయితే, కేసీఆర్ ఏ నమ్మకంతో కేటీఆర్ కి పార్టీ బాధ్యతలు అప్పగించారో, అది నిర్వర్తించడంలో కేటీఆర్ సఫలమవుతున్నట్లే కనిపిస్తోంది.

నేతలకు అందుబాటులో ఉంటూ…

పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి కేటీఆర్ బిజీగా మారిపోయారు. తరచూ ఆయన పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కి వస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశ మవుతున్నారు. తనవద్దకు వచ్చిన పార్టీ నేతలు అందరినీ కలిసి వారి సమస్యలు వినే అవకాశం ఇస్తున్నారు. ఇక, ఇటీవలి ఎన్నికల్లో పార్టీ భారీ విజయమే సాధించినా కొన్ని సమస్యలను కేటీఆర్ గుర్తించారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల్లో వర్గపోరును ఆయన పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరితో ఒకరికి పడని నాయకులను కూర్చోబట్టి వారితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించి చేతులు కలిపిస్తున్నారు. ధర్మపురిలో తనను ఓడించేందుకు మాజీ ఎంపీ వివేక్ వర్గం ప్రయత్నించిందని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో కేటీఆర్ వీరిద్దరితో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. ఇక 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటును కూడా కేటీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు.

క్యాడర్ లో జోష్…

ఇక పార్టీ ముఖ్యనేతలు, కార్యవర్గంతో సమావేశమవుతూ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ సూచనలతో టీఆర్ఎస్ శ్రేణులు ఓటరు నమోదు కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇక, లోక్ సభ, పంచాయితీ ఎన్నికలు త్వరలోనే జరగనుండటంతో వాటిల్లో విజయ పరంపరను కొనసాగించేందుకు కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎక్కువ ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారు. వాస్తవానికి, కేసీఆర్ తనపై ఉన్న బాధ్యతలు, ఇతర కారణాల దృష్ట్యా ఎక్కువ సమయంలో ప్రజల్లో ఉండలేకపోయారు. ఇప్పుడు కేటీఆర్ ఈ సంప్రదాయాన్ని మార్చి ఎక్కువగా జిల్లాల్లో పర్యటించాలని అనుకుంటున్నారు. ఇక, క్యాడర్ కూడా ఇప్పుడు సంతృప్తిగా ఉంది. ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు క్యాడర్ కు కేటీఆర్ అందుబాటులో ఉంటుండటంతో వారి సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కలుగుతోంది. ఇక, కేటీఆర్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా, మంత్రి పదవులు ఆశిస్తున్న వారు కేటీఆర్ దృష్టిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి కేటీఆర్… టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు తెలంగాణ భవన్ లో సందడి కూడా బాగా పెరిగినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News