ఏపీ పై ఎందుకంత ప్రేమ..?

ఫాసిజం దాడుల గురించి మాట్టాడుతూ పక్కింటివాడే కదా పోయేదని ఊరుకుంటే చివరికి మనవంతూ వస్తుందని చెబుతుంటారు. అదే సూక్తిని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రమంత్రి, టీఆర్ఎస్ వారసుడు [more]

Update: 2021-03-11 15:30 GMT

ఫాసిజం దాడుల గురించి మాట్టాడుతూ పక్కింటివాడే కదా పోయేదని ఊరుకుంటే చివరికి మనవంతూ వస్తుందని చెబుతుంటారు. అదే సూక్తిని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రమంత్రి, టీఆర్ఎస్ వారసుడు కేటీఆర్. ఆంద్రాలో సాగుతున్న ఉక్కు ఉద్యమానికి అండగా నిలుస్తానని ప్రతిన బూనారు. అవసరమైతే విశాఖ పట్నం వెళ్లి ఉద్యమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు చూస్తూ ఊరుకుంటే తెలంగాణలోని ప్రభుత్వ పరిశ్రమలనూ కేంద్రం ప్రయివేటీకరిస్తుందని ముందస్తు ఆందోళనను వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడినవి అన్నీ నిజాలే. ఆంధ్రా సోదరుల ఉద్యమానికి అండగా నిలుస్తామన్న కేటీఆర్ మాటల్లోని రాజకీయ ఆంతర్యమూ నిజమే. రాష్ట్రం విడిపోయినప్పటికీ ఉమ్మడి సమస్యలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. కలిసి పరిష్కరించుకోవాల్సిన అంశాలూ ఉన్నాయి. కలిసికట్టుగా కేంద్రంపై పోరాడి సాధించుకోవాల్సిన హామీలూ మిగిలే ఉన్నాయి. ఈ స్థితిలో కేటీఆర్ స్నేహహస్తం ఆంధ్రా పార్టీల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.

బీజేపీ గుబులు…

తెలంగాణ రాష్ట్రసమితికి బీజేపీ గుబులు పట్టుకొంది. క్రమేపీ విస్తరిస్తూ సైద్ధాంతికంగా రాష్ట్రంలో కమలం పార్టీ బలపడుతోంది. రెండుసార్లు అధికారంలోకి రావడంతోనే టీఆర్ఎస్ కు ఉన్న సెంటిమెంటు క్రమేపీ కరిగిపోయింది. ప్రజలు ప్రత్యామ్నాయం కనిపిస్తే ఎంచుకునే చాన్సులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెసు అంతర్గత కలహాలతో టీఆర్ఎస్ కు దీటైన ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రజల ముందు ఆవిష్కరించుకోలేకపోయింది. బలమైన నాయకత్వంతో బీజేపీ దూకుడు పెంచింది. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో సాగుతున్న ఉక్కు ఉద్యమం కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన అస్త్రం. తెలంగాణలో ప్రబలమైన సంఖ్యలో ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారున్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సాగిన ఉద్యమంలో పాలు పంచుకున్న వారూ ఉన్నారు. అందువల్ల ఆ భావోద్వేగాన్ని తాను కూడా అందిపుచ్చుకోవాలనుకుంటోంది టీఆర్ఎస్. బీజేపీకి వ్యతిరేకంగా ప్రబలుతున్న సెంటిమెంటు తెలంగాణలో తనకు కలిసొస్తుందని అంచనా వేస్తోంది. అందుకే తానున్నానంటూ స్వచ్ఛందంగా కేటీఆర్ ముందుకు వచ్చారు.

బాబు, జగన్, పవన్, షర్మిలకూ చెక్…

ఏపీలో ప్రస్తుతం చేవ చచ్చిన నాయకత్వమే పార్టీలలో ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్ మోహన్ రెడ్డి బీజేపీని ఢీకొట్టే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ ఎలాగూ కమలంతో కలిసి నడుస్తున్నారు. ఈ స్థితిలో టీడీపీ,వైసీపీలు ఉక్కు కార్మికుల ఉద్యమానికి అండగా ఉత్తుత్తి మద్దతు మాత్రమే ప్రకటిస్తున్నాయి. నేతలు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఏరకమైన అలజడికీ పూనుకోవడం లేదు. విన్నపాలు, లేఖలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ బలహీనతను కేటీఆర్ ప్రకటన బయటపెడుతోంది. సామాజిక పరంగానూ, ఓటర్ల సంఖ్య రీత్యానూ టీడీపీకి, వైసీపీకి తెలంగాణలో కొంతమేరకు పలుకుబడి ఉంది. వైసీపీ స్వచ్ఛందంగానే పార్టీ కథను ఇక్కడే ముగించేయాలని నిర్ణయించుకుంది. టీడీపి ఇంకా కొంతమేరకు ప్రయాస పడుతోంది. మధ్యలో షర్మిల రంగప్రవేశం చేశారు. ఇంతవరకూ షర్మిల విశాఖ ఉక్కుపై తన స్టాండ్ ప్రకటించలేదు. పవన్ కూడా తెలంగాణలో తనకు ప్రాధాన్యముంటుందని భావిస్తున్నారు. మొత్తమ్మీద ఈ నాయకులందరి బలహీనతలు టీఆర్ఎస్ కు వరంగా పరిణమించాయి. అందుకే ఆంధ్రా నుంచి వచ్చిన స్థిరవాసుల్లో బీజేపీ వ్యతిరేకతకు తాను వేదిక కావాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఆ వర్గాల ఓట్లన్నీ గంపగుత్తగా టీఆర్ఎస్ వైపు మొగ్గేందుకు అవకాశముందని అంచనా వేస్తోంది.

స్థిరమైన ఓటు బ్యాంకు…

పార్టీల వైఖరి, ఓటర్ల ధోరణి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఉద్యమ సమయంలో ఆంధ్రా సెటిలర్లలో భయాందోళనలను కలిగించింది టీఆర్ఎస్. రాష్ట్రం విడిపోతే తమ భవితవ్యం ఏమయిపోతుందేనని చాలామంది భయపడ్డారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా అనేక మార్పులు సంభవించాయి. 2014 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ కాంబినేషన్ కు మద్దతు పలికిన సెటిలర్లు తర్వాత తమ స్టాండ్ మార్చుకున్నారు. టీడీపీకి తెలంగాణ రాజకీయాల్లో ప్రాముఖ్యం లేదని గ్రహించారు. దాంతో ఆ ఓట్లు కాంగ్రెసు, బీజేపీల మధ్య చీలిపోయే అవకాశం ఏర్పడింది. అయితే 2016లో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నయానోభయానో సెటిలర్ల ఓట్లను బాగానే తెచ్చుకోగలిగింది. తాజా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఆయా వర్గాల్లో మరింత పలుకుబడిని పెంచుకుంది. ఆంద్రాలో బీజేపీపట్ల నెలకొన్న వ్యతిరేకతను ఆ ప్రాంత సెటిలర్ల రూపంలో టీఆర్ఎస్ ఎన్ క్యాష్ చేసుకోగలిగింది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ దూకుడికి సెటిలర్లు కళ్లెం వేశారు. టీఆర్ఎస్ పెద్ద పార్టీగా నిలవడానికి సహకరించారు. అధికారపార్టీ పరువును కాపాడారు. ఈ ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కదులుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలతో పాటు ఖమ్మం, నిజమాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, నిజమాబాద్ లలో సెటిలర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు . 32 నియోజకవర్గాల్లో బలాబలాలను తారుమారు చేయగల సంఖ్యలో సెటిలర్లు ఉన్నారనేది అంచనా. అందుకే టీఆర్ఎస్ వారిని శాశ్వతంగా అక్కున చేర్చుకునేందుకు బీజేపీతో, కేంద్రంతో తగవుకు దిగేందుకు సాహసిస్తోంది. అందుకే కేటీఆర్ ఆ ప్రకటన చేశారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News