లైైన్ క్లియర్ చేస్తున్నారా?

అతి కొద్దికాలంలోనే తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానంలో కేటీఆర్ బాధ్యతలను స్వీకరిస్తారన్న ప్రచారం మరింత [more]

Update: 2020-02-07 16:30 GMT

అతి కొద్దికాలంలోనే తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానంలో కేటీఆర్ బాధ్యతలను స్వీకరిస్తారన్న ప్రచారం మరింత పెరిగింది. అయితే ఉప ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను నియమించి పాలనను ఆయన చేతి మీదుగానే నడిపించాలన్న యోచనలో కూడా కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి. కొద్దిరోజుల్లోనే కేటీఆర్ ముఖ్యమైన పదవి చేపట్టనున్నారన్నది వాస్తవం.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా…..

కేటీఆర్ ఇప్పటికే పార్టీ పగ్గాలు చేపట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను స్వీకరించిన కేటీఆర్ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటారు. ఆయన వ్యూహం ప్రకారమే టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ అంతా తానే అయి కేటీఆర్ చూసుకున్నారు. మంచి ఫలితాలు లభించాయి. విపక్షాలు మున్సిపల్ ఎన్నికల్లో చతికలబడేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అవ్వడంతో ఆయనకు కిరీట ధారణకు ముహూర్తం నిర్ణయించడమే తరువాయి అంటున్నారు.

బాధ్యతలను చేపట్టక ముందే….

కేటీఆర్ బాధ్యతలను స్వీకరించడానికి ముందే ప్రభుత్వంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాలన సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ఐఏఎస్ లను భారీ స్థాయిలో బదిలీలను ప్రభుత్వం చేయడం వెనక కేటీఆర్ ఉన్నారన్నది కాదనలేని వాస్తవం. కేటీఆర్ కుర్చీ ఎక్కేముందే ఫీల్డ్ లెవెల్ లో తనకు అనుకూలురైన వారిని నియమించుకున్నారన్న ప్రచారం పార్టీలోనూ, ప్రభుత్వ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతుంది.

మంత్రివర్గంలోనూ…..

దీంతో పాటు త్వరలోనే మంత్రివర్గంలోనూ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. కేసీఆర్ కొందరు మంత్రుల విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. వీరి సంఖ్య ఐదు నుంచి ఆరువరకూ ఉంటుందన్నారు. మంత్రి వర్గంలో మార్పులు చేసి కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న వారిని నియమించాలన్న యోచనలో కూడా కేసీఆర్ ఉన్నారంటున్నారు. కేటీఆర్ పట్టాభిషేకం కోసం ఎంతమంది మంత్రులు తమ పదవులను కోల్పోతారన్నది చర్చనీయాంశమయింది. మొత్తం మీద యువరాజు పట్టాభిషేకానికి ముందుగానే గ్రౌండ్ క్లియర్ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News