ఓటు బ్యాంకు కు చిల్లు పడినట్లేనా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని సామాజిక వర్గాలు నెమ్మదిగా దూరం అవుతున్నాయా. వైసీపీ నేతల వైఖరితో వారు ఆగ్రహిస్తున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది. స్వతహాగా [more]

Update: 2021-06-23 13:30 GMT

వైసీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని సామాజిక వర్గాలు నెమ్మదిగా దూరం అవుతున్నాయా. వైసీపీ నేతల వైఖరితో వారు ఆగ్రహిస్తున్నారా అంటే అవును అనే జవాబు వస్తోంది. స్వతహాగా టీడీపీకి ఒక సామాజిక వర్గం ఫావర్ అని చెబుతారు. వైసీపీకి మరో పార్టీ ముద్ర ఉంది. ఇపుడు మిగిలిన కులాలలో కొన్ని ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేలా ఉన్నాయని అంటున్నారు. బ్రాహ్మణులు మొదటి నుంచి ఎందుకో వైసీపీ మీద పెద్దగా మొగ్గు చూపరు అంటారు. వారి బాటలో ఇపుడు క్షత్రియ సామాజిక వర్గం కూడా ఉందని అంటున్నారు.

అగ్గి మీద గుగ్గిలం …

అసలే రఘురామక్రిష్ణం రాజు ఎపిసోడ్ ఒకటి ఏపీలో రగులుతోంది. ఈ రెబెల్ ఎంపీ ఎంత చెడ్డా క్షత్రియులలో ప్రముఖుడిగా పేరు పడ్డాడు. అయితే అతని అతి వైఖరి, వైసీపీ మీద ఆయన వాడిన భాష వంటివి బాహాటంగా ఆ సామాజికవర్గం మద్దతు ఇచ్చేందుకు అడ్డంకిగా మారాయి. ఆ సంగతి అలా ఉండగానే ఇపుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాన్ని కోరి కెలికి రాజులకు వైసీపీ దూరం అవుతోంది అంటున్నారు. ఏకంగా మంత్రులు, ఇతర నాయకులు పూసపాటి రాజుల మీద చేసిన ఘాటు విమర్శలతో క్షత్రియుల మనోభావాలు దెబ్బ తిన్నాయట. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్షత్రియులు జగన్ కి విన్నపం పేరిట తమదైన స్టైల్ లో స్ట్రాంగ్ మెసేజ్ నే పంపించారు అంటున్నారు.

దూరమేనా…?

ఎన్నో దానాలు చేస్తూ సమాజంలో ఉన్నతంగా ఉన్న పూసపాటి కుటుంబం మీద దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలను క్షత్రియ పరిషత్ జగన్ దృష్టిలో పెడుతోంది. ఏకంగా అశోక్ ని దొంగ అంటూ విజయసాయిరెడ్డి మాట తూలితే ఆయన మీద అనకూడని చాలా మాటలు మంత్రి వెల్లంపల్లి అనేశారు. దీంతో క్షత్రియులు రగిలిపోతున్నారు. రఘురామ వెనక నాడు నిలబడని వారు కూడా ఇపుడు అశోక్ వైపు వస్తున్నారు. ఏపీలో తమ సామాజిక వర్గం మీద ఈ దాడులేంటి అని వారు నిలదీస్తున్నారు. తాము ఎవరి జోలికీ అసలు పోమని అలాంటిది తమని టార్గెట్ చేయడమేంటని కూడా వారు మండిపడుతున్నారు.

చిల్లు పడినట్లే …?

రఘురామతో మొదలైన వివాదం కాస్తా అశోక్ దాకా వెళ్ళింది. అశోక్ మీద కూడా రఘురామ మీద వాడిన భాషనే వైసీపీ పెద్దలు వాడడమే ఇక్కడ చిక్కుని తెచ్చిపెడుతోంది. పెద్ద మనిషిగా ఉన్న అశోక్ విషయంలో నోరు జారితే జాగ్రత్త అన్నట్లుగానే ఇపుడు క్షత్రియ పరిషత్ నుంచి గట్టి సందేశం వచ్చింది అంటున్నారు. గోదావరి జిల్లాలలో ప్రభావం చూపగలిగిన బలమైన సామాజిక వర్గం ఇలా బాహాటంగా వైసీపీ మీద కత్తులు దూస్తోంది అంటే ఆ పార్టీ ఓటు బ్యాంక్ కి చిల్లు పడినట్లే అంటున్నారు. జగన్ కొందరు నాయకులను, మంత్రులను కట్టడి చేయకపోవడం వల్లనే వచ్చిన సమస్య ఇదంతా అంటున్నారు. ఇక మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం విషయంలో చేసిన తప్పులకు ఇది పరిహారం అని కూడా అనుకోవాలని అంటున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలో ఎవరైనా కొద్దో గొప్పో ఓటు బ్యాంకుని కోల్పోతారు. కానీ కొన్ని కీలకమైన సామాజిక వర్గాలకు దూరం కావడం అంటే మాత్రం అది వైసీపీకి ప్రమాదమే అని చెబుతున్నారు.

Tags:    

Similar News