ఆ వైసీపీ నేతలకు టెన్షన్ టెన్షన్

తీగ‌లాగితే.. డొంక క‌దిలిన చందంగా మారింది వైసీపీ ప‌రిస్థితి. అంద‌క అంద‌క అందిన అధికారాన్ని చేప‌ట్టి రెండు నెల‌లు కూడా తిర‌గ‌క‌ముందే..ప్రజ‌ల్లో కొంత మేర‌కు అసంతృప్తి జ్వాల‌లు [more]

Update: 2019-08-25 02:00 GMT

తీగ‌లాగితే.. డొంక క‌దిలిన చందంగా మారింది వైసీపీ ప‌రిస్థితి. అంద‌క అంద‌క అందిన అధికారాన్ని చేప‌ట్టి రెండు నెల‌లు కూడా తిర‌గ‌క‌ముందే..ప్రజ‌ల్లో కొంత మేర‌కు అసంతృప్తి జ్వాల‌లు ర‌గులుతున్నాయి. దీనికి తోడు ప్రతిప‌క్షాలు తొలి రోజు నుంచి కూడా చేస్తున్న ఆరోప‌ణ‌లు మ‌రింత‌గా పార్టీ ఇమేజ్‌ను, ప్రభుత్వ ప‌రువును కూడా పోగొడుతున్నాయా? అనే సందేహం తెర‌మీదికి వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. రాజ‌ధాని ప్రాంతాలైన గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజ‌ల్లో ఒక విధ‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. చంద్రబాబును గెలిపించి ఉంటే.. అనే రూపంలో సాగుతున్న వైసీపీ నేత‌ల చెవిలో కూడా ప‌డింది.

రాజధాని మార్పు అంశం….

దీంతో వారు ఎక్కడిక‌క్కడ దీనిపై చ‌ర్చిస్తున్నారు. దీనికి కార‌ణంపైనా ఆరాతీస్తున్నారు. గతంలో ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఏర్పాటు చేశారు చంద్రబాబు. అయితే, కార‌ణం ఏదైనా జ‌గ‌న్ అండ్‌టీం ఆది నుంచి కూడా దీనిని వ్యతిరేకిస్తూ వ‌స్తోంది.ఈ నేప‌థ్యంలోనే ప్రస్తుతం తాము అధికారంలోకి వ‌చ్చాం కాబ‌ట్టి త‌మ ఇష్ట ప్రకారం రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతుంద‌నే రీతిలో మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ‌, కొడాలి నాని వంటి వారు చెబుతున్నారు. దీంతో రాజ‌ధాని జిల్లాల‌ ప్రజ‌ల్లో తీవ్రమైన వ్యతిరేక‌త మొగ్గు చూపుతోంది. ఇక్కడి ప్రజ‌లు, రైతులు రాజ‌ధాని ప్రక‌ట‌న‌తో ల‌బ్ధి పొందిన విష‌యం తెలిసిందే.

గుంటూరు, కృష్ణా జిల్లా నేతలు….

త‌మ ప్రాంతాలు, ముఖ్యంగా రెండు జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాజ‌ధాని ప్రక‌ట‌న ఊత‌మి స్తుంద‌ని వారు భావించారు. అదే స‌మ‌యంలో చాలా మంది రైతులు త‌మ భూములు ప్రభుత్వానికి ఇచ్చి ల‌బ్ధి పొందారు. కొంద‌రు ఇక్కడే పెట్టుబ‌డులు కూడా పెట్టారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వం ఈ రాజ‌ధానిని ఎక్కడికి త‌ర‌లిస్తుందోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు ప్రస్తుత ప్రజ‌ల ఆందోళ‌న‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.

ప్రజా వ్యతిరేకత వస్తుందని….

జ‌గ‌న్‌పై విమ‌ర్శలు సంధిస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ నాయ‌కులు ఈ వ్యతిరేక‌త అనే గండం నుంచి ఎలా బ‌య‌ట‌కు ప‌డాల‌నే విష‌యంపై త‌ర్జన భ‌ర్జన చేస్తున్నారు. ఇంత‌క రాజ‌ధానిపై జ‌గ‌న్ రాజ‌ధాని మార్పు విష‌యంలో ఎలాంటి ప్రక‌ట‌న‌లు చేయ‌క‌పోయినా మంత్రుల తీరు వ‌ల్ల సామాన్య ప్రజ‌ల్లోనూ లేనిపోని సందేహాలు క‌ల‌గ‌డంతో పాటు అది అంతిమంగా తమకే మైన‌స్‌గా మారుతోంది.మిగిలిన జిల్లాల వైసీపీ నేతల మాట ఎలా ఉన్నా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ వీరి మాట‌ల‌కు ఎలా క‌ళ్లెం వేస్తాడో ? లేదా రాజ‌ధానిపై ఎలాంటి ప్రక‌ట‌న చేస్తారో? చూడాలి.

Tags:    

Similar News