మీకు ఏమైంది అధ్యక్ష్యా…?

అధ్యక్ష్యా… అని గౌరవంగా పిలిపించుకునేవారు … ఏ పార్టీ వారైనా కలిసి ఫిర్యాదు చేసినా వినేవారు….. అటు అధికార పార్టీ సభ్యులను, ఇటు ప్రతిపక్షాల సభ్యులను సమన్వయ [more]

Update: 2019-09-28 09:30 GMT

అధ్యక్ష్యా… అని గౌరవంగా పిలిపించుకునేవారు … ఏ పార్టీ వారైనా కలిసి ఫిర్యాదు చేసినా వినేవారు….. అటు అధికార పార్టీ సభ్యులను, ఇటు ప్రతిపక్షాల సభ్యులను సమన్వయ పరుస్తూ సాగేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన ఆయన పరిస్థితి ఇప్పుడు ఏమైంది. ఆయన మౌనంగా ఎందుకున్నారు. ఓ నాటి వెలుగులు ఎందుకు కనుమరుగయ్యాయి. ఇవన్నీ ఎవరో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది.ఆయనే ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేసిన కేతిరెడ్డి సురేష్ రెడ్డి .

పిలుపు మలుపు తిప్పిందా….?

కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదిగారు సురేష్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగయ్యారు. విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోకపోవడం, అధికారంలోకి టి.ఆర్.ఎస్ రావడంతో ఇక ఆయన ఎక్కడా కనిపించలేదు. ఏ సమావేశాలకూ హాజరుకాలేదు. సరిగ్గా అదే సమయంలో ఆయనకో పిలుపు వచ్చింది. రాజకీయంగా ప్రజలు తనను మరచిపోతున్న తరుణంలో సీఎం కేసీఆర్ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిని టి.ఆర్.ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు అండగా ఉండాలని కోరారు. దీంతో సురేష్ రెడ్డి గులాబి కండువా కప్పుకున్నారు. అదే సమయంలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీగా చేసి మండలి ఛైర్మన్ ఇస్తారనే హామీ తీసుకున్నారని ఆ తర్వాతే పార్టీలో చేరినట్లు తెలిసింది.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా……

60ఏళ్ల వయస్సు ఉన్న సురేష్ రెడ్డి చౌట్‌పల్లిలో జన్మించారు. 1984లో మండలస్థాయి రాజకీయాలలో ప్రవేశించిన సురేష్ రెడ్డి 1989లో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి బాల్కొండ శాసనసభా స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచే రాజకీయ జీవితంలో సురేష్ రెడ్డి దశమారింది. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1989 నుంచి 2004 ఎన్నికల వరకు నాలుగు పర్యాయాలు వరసగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 2004లో 12వ శాసనసభకు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2009 శాసనసభ ఎన్నికలలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

కిం….కర్తవ్యం…?

నిజామాబాద్ జిల్లాలో పేరున్న నేతగా ఉన్న సురేష్ రెడ్డి తన క్యాడర్ ను కూడా టి.ఆర్.ఎస్ పార్టీలో చేర్పించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవితను గెలిపించేందుకు తీవ్రంగా కృషిచేశారు. కాని దురదృష్టవశాత్తు కవిత ఓడిపోవాల్సివచ్చింది. అప్పటి నుంచి సురేష్ రెడ్డి కి పార్టీ తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో సురేష్ రెడ్డి కూడా ఏ సమావేశాల్లోనూ పాల్గొనడం లేదు. మొన్నటి వరకు మండలి ఛైర్మన్ అవుతాననుకున్న సురేష్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపికతో ఆ ఆశలు కూడా ఆవిరయ్యాయి. దీంతో సురేష్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

కమలాన్ని పట్టుకుంటారా…..?

కేసీఆర్ మాట ఇస్తే జవదాటరనే నమ్మకంతోనే సురేష్ రెడ్డి ఉన్నారు. కాని మండలి ఛైర్మన్ గా గుత్తా ఎన్నికతో ఇప్పడు సురేష్ రెడ్డికి రాజకీయం అంతుచిక్కడ లేదు. కాని ఆయనను నమ్ముకుని ఆయన వెంటే ఉంటున్న వారు మాత్రం కమలం గూటికి వెళ్లాలనే ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో సురేష్ రెడ్డి బీజేపీలో చేరుతారననే వార్తలు ఇటీవలి కాలంలో ప్రచారం జరుగుతోంది. మరి సురేష్ రెడ్డి ఏం చేస్తారో…..? వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News