ఏం చేస్తారో చూడాలి

కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆశలు అడియాసలయ్యాయి. కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా ఇటీవల జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు. [more]

Update: 2019-07-17 11:00 GMT

కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆశలు అడియాసలయ్యాయి. కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా ఇటీవల జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూశారు. ఆయనతో పాటు సతీమణి సుజాతమ్మ సయితం ఆలూరు నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తన చిరకాల ప్రత్యర్థి కేఈ కృష్ణమూర్తిని ఆలింగనం చేసుకుని మరీ పార్టీలో చేరిపోయారు.

వైసీపీ నుంచి పిలుపు అందినా….

ఆయన 2014 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఈసారైనా పార్లమెంటు ఎక్కాలని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉబలాటపడ్డారు. అయితే ఒకదశలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నుంచి పిలుపు వచ్చినా స్పందించలేదు. అప్పుడు వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం కోట్ల లో లేకపోవడమే ఇందుకు కారణం. చంద్రబాబునాయుడు నాయకత్వానికి మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టంకడతారని భావించి సతీమణితో సహా కోట్ల పసుపు కండువా కప్పేసుకున్నారు.

టీడీపీ కూడా అధికారంలోకి…..

కానీ కోట్ల ఊహించింది జరగలేదు. తాను ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ సీటు అయినా దక్కుతుందని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భావించారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ స్థానం గెలుచుకునేంత బలం కూడా లేదు. దీంతో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబునాయుడుతో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చర్చించారు.

బీజేపీలో చేరాలని….

పార్టీ పటిష్టం చేయడంపై చంద్రబాబునాయుడితో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చర్చించారని చెబుతున్నారు. అయితే ఇటీవల కాలంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లు కూడా ప్రచారం జరుగతోంది. కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్ లేదని భావించిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కమలం గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాయలసీమలో ఆ పార్టీకి సరైన నేత లేకపోవడంతో బీజేపీలో చేరితే భవిష్యత్ ఉంటుందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన చంద్రబాబునాయుడితో చర్చించారని చెబుతున్నారు. మరి కోట్ల ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News