రాయుడో.. రాయుడా.. రెంటికీ చెడ్దావుగా

రాజ‌కీయాల్లో ఎంత దూకుడు ఉండాలో.. అంతేస్థాయిలో నిల‌క‌డ‌, నిదానం అనేది ఖ‌చ్చితంగా ఉండాలి. మ‌రీ ముఖ్యంగా కొన్నాళ్లపాటు ప్రజ‌ల్లో ఉండాల‌న్నా.. రాజ‌కీయ హిస్టరీ సృష్టించాల‌న్నా కూడా నిల‌క‌డైన [more]

Update: 2020-05-04 15:30 GMT

రాజ‌కీయాల్లో ఎంత దూకుడు ఉండాలో.. అంతేస్థాయిలో నిల‌క‌డ‌, నిదానం అనేది ఖ‌చ్చితంగా ఉండాలి. మ‌రీ ముఖ్యంగా కొన్నాళ్లపాటు ప్రజ‌ల్లో ఉండాల‌న్నా.. రాజ‌కీయ హిస్టరీ సృష్టించాల‌న్నా కూడా నిల‌క‌డైన రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే, దీనికి భిన్నంగా న‌చ్చిన పార్టీలోకి జంప్ చేస్తూ.. నిన్న-నేడు-రేపు మ‌రో పార్టీ అనేలా వ్యవ‌హ‌రిస్తే.. ఏ నాయ‌కుడికైనా ఫ్యూచ‌ర్ ఏముంటుంది. ఏదో అప్పటికి ద‌క్కిందాంతో తృప్తి పొంద‌డం త‌ప్ప. నిజాయితీగా ప‌నిచేసినా.. నిల‌క‌డైన రాజ‌కీయాలు చేయ‌క ‌పోవ‌డంతో ఇలాంటి వారిని చూసి స‌మాజం కూడా అయ్యో పాపం! అని అన‌క త‌ప్పదు.

అయ్యో కొత్తపల్లి…..

ఇప్పుడు ఇలానే అయ్యోపాపం రాయుడు అని అనిపించుకుంటున్నారు మాజీ మంత్రి కొత్తప‌ల్లి సుబ్బారాయుడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన కొత్తప‌ల్లి సుబ్బారాయుడు కేవ‌లం 15 ఏళ్ల రాజ‌కీయ వ్యవ‌ధిలో ఎన్నిక‌లకో పార్టీ చొప్పున పార్టీలు మారారు. నిజానికి ఇలా మార‌డం త‌న‌కు ప్లస్ అవుతుంద‌ని ఆయ‌న అనుకున్నా.. రియల్‌గా చూస్తే మాత్రం ఆయ‌న‌కు మైన‌స్ అయింది. సుదీర్ఘకాలం రాజ‌కీయాల్లో కొన‌సాగినా చ‌రిత్ర సృష్టించార‌నే ఖ్యాతిని ఆయ‌న పొంద‌లేక పోయారు. అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌నే అప‌వాదును మోస్తున్నారు. ఇప్పుడూ ఆయ‌న ఎలాంటి ఆధారం లేని చివురుటాకు మాదిరిగానే ఉన్నార‌ని చెబుతున్నారు.

జగన్ అవకాశమిచ్చినా….

కొత్తప‌ల్లి సుబ్బారాయుడు 2004 వ‌ర‌కు టీడీపీలో ఉన్నారు. 2009లో చిరంజీవి స్థాపించిన‌ ప్రజారాజ్యంలోకి జంప్ చేశారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. దీంతో 2012లో వైసీపీ ఆవిర్భావంతో జ‌రిగిన ఉప పోరులో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేశారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల స‌మ‌యానికి జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించి ఆ పార్టీలోకి కొత్తప‌ల్లి సుబ్బారాయుడు జంప్ చేశారు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు కీల‌క‌మైన ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వైసీపీ చీఫ్ ప‌ద‌వి ఇచ్చారు. అంతేకాదు, న‌ర‌సాపురం టికెట్ ఇచ్చారు. అయితే, అప్పటికే జంప్ జిలానీ అనే పేరు తెచ్చుకోవ‌డంతో కొత్తప‌ల్లి ఓట‌మి పాల‌య్యారు.

ఆయన బలవంతం మీద…..

అనంత‌రం ఆయన అధికారంలో ఉన్న టీడీపీలోకి జంప్ చేశారు. ఆ వెంట‌నే ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం మేర‌కు కాపు కార్పొరేష‌న్ చైర్మన్ ప‌ద‌విని చేప‌ట్టారు. ఆ ‌ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. కొత్తప‌ల్లి సుబ్బారాయుడుకి బాబు అస‌లు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయ‌న వెంట‌నే వైసీపీలోకి రావాల‌ని అనుకున్నారు. కానీ, కొత్తప‌ల్లి గుణం తెలిసిన జ‌గ‌న్ ఆయ‌న‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే, న‌ర‌సాపురం ఎంపీ అభ్యర్థిగా ఉన్న క‌నుమూరి ర‌ఘురామ కృష్ణంరాజు.. త‌న‌కు సాయంగా ఉంటాడ‌ని, కాపు ఓటు బ్యాంకు ఏమైనా ఉంటే ప్లస్ అవుతుంద‌ని చెప్పి.. త‌న బ‌ల‌వంతం మీద కొత్తప‌ల్లి సుబ్బారాయుడుని వైసీపీలోకి తెచ్చారు.

వేసిన అడుగులే….

మ‌రి ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చి ప‌ది మాసాలు పూర్తయ్యాయి. మ‌రి కొత్తప‌ల్లి సుబ్బారాయుడు రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి అంటే.. ఎక్కడి గొంగ‌ళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. నిజానికి జ‌గన్‌కు ఈయ‌న‌పై సానుభూతి లేదు. పైగా న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘుపై కూడా జ‌గ‌న్‌కు సానుభూతి లేక‌పోగా.. పార్టీ లైన్‌కు భిన్నంగా ఉన్నార‌ని ఆయ‌న‌ను ప‌క్కన పెట్టారు. దీంతో ర‌ఘుతీసుకువ‌చ్చిన కొత్తప‌ల్లి సుబ్బారాయుడు విష‌యంలో దారులు మూసుకుపోయాయి. ఎలాంటి ప‌ద‌వీ వ‌చ్చే ఛాన్స్ లేదు. దీంతో జిల్లా ప్రజ‌లు పాపం సుబ్బారాయుడు అంటున్నారు. నిజానికి ఆయ‌న నిజాయితీ ప‌రుడే.. కానీ.. వేసిన అడుగుల్లో త‌ప్పులు జ‌రిగిన‌ప్పుడు ప్రయోజ‌నం ఏంటి? రాజ‌కీయంగా ఆయ‌న త‌న‌కంటూ గౌర‌వ‌ప్రద‌మైన పేజీని ఏర్పాటు చేసుకోలేకపోవ‌డంతో పాటు పాపం కొత్తప‌ల్లి అని ప్రతి ఒక్కరు జాలిప‌డే ప‌రిస్థితికి ఆయ‌న వెళ్లిపోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News