గీతకు పాత పాటే

కొత్తప‌ల్లి గీత‌. ఏపీ రాజ‌కీయాల్లో త‌ర‌చుగా వినిపించే పేరు ఇది. దుందుడుకు స్వభావానికి, ఎవ‌రిపైనైనా విమ‌ర్శల బాణాల‌ను సంధించ‌డానికి కేరాఫ్‌గా కొత్తప‌ల్లి గీత పేరునే ఎవ‌రైనా చెబుతారు. [more]

Update: 2019-07-22 09:30 GMT

కొత్తప‌ల్లి గీత‌. ఏపీ రాజ‌కీయాల్లో త‌ర‌చుగా వినిపించే పేరు ఇది. దుందుడుకు స్వభావానికి, ఎవ‌రిపైనైనా విమ‌ర్శల బాణాల‌ను సంధించ‌డానికి కేరాఫ్‌గా కొత్తప‌ల్లి గీత పేరునే ఎవ‌రైనా చెబుతారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ఏపీలో విస్తరించాల‌ని, ఏపీలో వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో కుదిరితే అధికారం, లేకుంటే.. ప్రధాన ప్రతిప‌క్షం స్థాయికి ఎద‌గాల‌ని నిర్ణ యించుకున్న బీజేపీకి ఇప్పుడు ఈమె త‌రుపుముక్క అవుతారా? లేక.. త‌ల‌నొప్పి అవుతారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఆమె ఎక్కడ ఉన్నా వివాదాల‌కు కేంద్ర బిందువుగా పేరు తెచ్చుకున్నారు. అర‌కు ఎంపీగా గ‌డిచిన ఐదేళ్ల కాలంలో చ‌క్రం తిప్పిన కొత్తప‌ల్లి గీత అనేక వివాదాల‌కు కేరాఫ్‌గా మారిన విష‌యం తెలి సిందే.

ఏ పార్టీలోనూ తిన్నగా….

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నాయ‌కుల్లో ప్రత్యేక పొజిష‌న్ ద‌క్కించుకున్న ఘ‌న‌త కొత్తప‌ల్లి గీత‌కే చెందుతుంది. రాజకీయాల్లో త‌న‌కంటూ స్థానం క‌ల్పించి, ఎన్ని వ్యతిరేక‌త‌లు, ఎంత పోటీ ఉన్నా.. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ అదినేత జ‌గ‌న్ .. కొత్తప‌ల్లి గీత‌కు అత్యంత కీల‌క‌మైన అర‌కు పార్లమెంటు స్థానాన్ని కేటాయించారు అంతేకాదు, ప్రచారం నిర్వహించి గె లిపించారు. అయితే, వైసీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో కొత్తప‌ల్లి గీత‌.. క‌నీసం జ‌గ‌న్‌కు మొహం కూడా చూపించ‌లేదు. పైగా త‌ర్వాత కాలంలో కొత్తప‌ల్లి గీత‌ టీడీపీకి ద‌గ్గర‌య్యారు. అయితే, ఆమెపై అప్పటికే ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచేందుకు త‌ప్పుడు అఫిడ‌విట్ స‌మ‌ర్పించ‌డం, హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వివాదాస్పద స్థలానికి సంబంధించి కేసు న‌మోదు కావ‌డంతో చంద్రబాబు ఆమెను పార్టీలోకి చేర్చుకునే విష‌యంపై త‌ట‌ప‌టాయించారు.

రచ్చ గెలిచినా….

నిజానికి ర‌చ్చ గెలిచిన కొత్తప‌ల్లి గీత‌.. ఇంట గెల‌వ‌లేక పోయారు. బెస్ట్ పార్లమెంటేరియ‌న్ అవార్డును పొందిన‌ప్పటికీ.. నియోజ‌క వ‌ర్గంలో ప్రజ‌ల‌కు అందుబాటులో లేకుండా పోయారు. ప్రతి ఒక్కరితోనూ ఛీ కొట్టించుకున్నారు. మా ఎంపీ ఎక్కడ? అని ప్రజ‌లు నినాదాల‌తో ఒక సంద‌ర్భంలో అర‌కు నియోజ‌క‌వ‌ర్గం ద‌ద్దరిల్లింది. అయితే, పార్లమెంటు రికార్డుల్లో మాత్రం.. గీత ఉత్తమ పార్లమెంటేరియ‌న్ గా గుర్తింపు పొందారు. లోక్‌సభలో 77 చర్చల్లో పాల్గొని, 535 ప్రశ్నలను లేవనెత్తి 97శాతం మార్కులు పొందారు. అయితే, పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ప్రజ‌ల‌కు అందుబాటులో లేకుండా పోయారు. అరకు నియోజకవర్గానికి ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవడంలో కూడా కొత్తప‌ల్లి గీత‌ విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంది.

సొంత పార్టీ పెట్టుకుని….

అటు వైసీపీకి ఉద్దేశ పూర్వకంగా దూర‌మైన కొత్తప‌ల్లి గీత టీడీపీలో ఎంట్రీ ల‌భించ‌క పోవ‌డంతో ఒంట‌రిగానే కాలం వెళ్లదీశారు. ఇంత‌లోనే ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. ఈ క్రమంలో ఓ పార్టీ అధినేత సూచ‌న‌ల మేర‌కు వైసీపీని దెబ్బకొట్టడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీల ఓట్లను చీల్చేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగారు కొత్తప‌ల్లి గీత‌. ఈ క్రమంలోనే జ‌న జాగృతి పేరుతో సొంతంగా పార్టీ పెట్టుకుని అర‌కు నుంచి ఆమె ఒక్కరే పోటికి దిగింది. అయితే, తాజా ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎన్ని కుట్రలు ప‌న్నినా ప్రజ‌లు మాత్రం జ‌గ‌న్ వెంట ఉండ‌డంతో ఎవ‌రి ఆశ‌లూ ఫ‌లించ‌లేదు. దీంతో ఎన్నిక‌ల అన‌త‌రం ఇటీవ‌ల తాను బీజేపీలోకి త‌న పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రక‌టించి సంచ‌ల‌నం సృష్టించారు కొత్తప‌ల్లి గీత‌.

ఉపయోగం ఎవరికి…?

వాస్తవానికి ఏపీలో ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ.. ఎవ‌రు వ‌చ్చినా .. త‌లుపులు తీసిపెట్టే ఉంచ‌డంతో కొత్తప‌ల్లి గీత‌కు ఎంట్రీ ల‌భించింది. అయితే, రాబోయే కాలంంలో ఆమె బీజేపీకి ఏమేర‌కు ఉపయోగ‌ప‌డుతుందో.. లేదా ఆ పార్టీని ఏమేర‌కు ఉప‌యోగించుకుంటుందో చూడాలి. ఏదేమైనా.. కొత్త వింత‌.. పాతొక రోత‌.. అనేది కొత్తప‌ల్లి గీత‌కు పాత‌పాటే..మ‌రి క‌మ‌ల నాథులకు ఏవిధంగా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News