‘‘గీత’’ దాటితే అంతేగా మరి..?

గత ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీ కూటమి హవా వీచినా ఏజెన్సీ ఏరియాలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల గిరిపుత్రులు [more]

Update: 2019-03-10 00:30 GMT

గత ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీ కూటమి హవా వీచినా ఏజెన్సీ ఏరియాలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల గిరిపుత్రులు మొగ్గు చేపారు. దీంతో ఏజెన్సీలోని అరకు పార్లమెంటుతో పాటు ఎక్కువ అసెంబ్లీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. వైసీపీ పట్ల ప్రజల్లో సానుకూలత ఉండటంతో రాజకీయాలకు కొత్త అయినా కొత్తపల్లి గీత ఆ పార్టీ తరపున అరకు ఎంపీగా 90 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే, ఎంపీగా గెలిచిన కొన్ని రోజులకే ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. టీడీపీలో ఆమె చేరుతారని అంతా భావించారు. కానీ, ఆమెపై పోటీ చేసిన ఓడిన సంధ్యారాణికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆమె టీడీపీలోకి కూడ వెళ్లలేదు. తర్వాత కేంద్రంలో అధికారంలోకి ఉన్న భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉన్నారు. కానీ అందులోనూ చేరలేదు. చివరకు ఆమె ప్రత్యేకంగా పార్టీనే స్థాపించుకున్నారు.

పార్టీని స్థాపించినా..

ఆరు నెలల క్రితం ఆమె విజయవాడలో ‘జన జాగృతి’ పేరుతో ప్రత్యేకంగా పార్టీ స్థాపించారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే తమ పార్టీ అజెండా అని ప్రకటించుకున్నారు. కానీ, పార్టీ స్థాపించి ఆరు నెలలు అవుతున్నా ఆమె పార్టీ జాడ ఆంధ్రప్రదేశ్ లో కనిపించడం లేదు. కనీసం ఆమె స్వంత నియోజకవర్గం అరకు పార్లమెంటు పరిధిలోనూ ఆమె పార్టీకి క్యాడర్ ఏర్పడలేదు. దీంతో ఆమె పార్టీ కొనసాగడం ఇక కష్టమే అంటున్నారు. కనీసంగా ఆమె పార్టీ తరపున ఈసారి ఆమెనైనా పోటీ చేస్తారా అనేది కూడా స్పష్టత లేదు. వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రాజకీయాలు కొత్త అయినా పోటీచేసిన మొదటిసారే గెలిచారు. ఈసారి ఆమె పరిస్థితి ఏంటనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

పోటీలో ఉంటారా..? తప్పుకుంటారా..?

వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడినందున ఆమె మళ్లీ ఆ పార్టీలో చేరే అవకాశం లేదు. ఇక, తెలుగుదేశం పార్టీకి అరకు పార్లమెంటు కోసం ఇటీవలే బలమైన అభ్యర్థి దొరికారు. ఇక్కడి నుంచి గెలిచి కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరారు. ఆయనే అరకు నుంచి బరిలో ఉన్నారు. ఇక, ఆమె తన స్వంత జనజాగృతి పార్టీ నుంచి బరిలో ఉంటారా లేదా జనసేన, బీజేపీల్లో ఏదైనా పార్టీలోకి వెళతారా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, అసలు ఈసారి ఆమె పోటీకి దూరంగా ఉంటారని కూడా స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కొత్తపల్లి గీతకు రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లోనే ఎంపీగా గెలివడం వల్ల మంచి అవకాశమే వచ్చినా ఆమె నిలబెట్టుకోలేదని, ఆమె అరకు నుంచి పోటీ చేసినా గడ్డు పరిస్థితులే ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News