కోటంరెడ్డికి చంద్రబాబు ఇలా చెక్ పెడ‌తార‌ట..‌!

నెల్లూరు జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నెల్లూరు రూర‌ల్‌. ఇక్కడ కాంగ్రెస్‌కు బ‌ల‌మైన పునాదులు ఉన్నాయి. పాత రాపూరు స్థానంలో ఇది కొత్తగా ఏర్పడింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడిన‌ప్పటి [more]

Update: 2020-08-08 02:00 GMT

నెల్లూరు జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నెల్లూరు రూర‌ల్‌. ఇక్కడ కాంగ్రెస్‌కు బ‌ల‌మైన పునాదులు ఉన్నాయి. పాత రాపూరు స్థానంలో ఇది కొత్తగా ఏర్పడింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఏర్పడిన‌ప్పటి నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి స‌రైన నాయ‌కుడు లేరు స‌రిక‌దా.. ఏ మాత్రం ప‌ట్టు దొర‌క‌డం లేదు. ఈ నియోజ‌క‌వ‌ర్గం రాపూరుగా ఉన్నప్పుడు వ‌రుస ఎన్నిక‌ల్లో 2009 వ‌ర‌కు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి విజ‌యం సాధించారు. మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. త‌ర్వాత వైఎస్ జ‌మానాలో మంత్రిగా నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా జిల్లాలో తిరుగులేని హ‌వా సాధించారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కొన్నాళ్లు మౌనం పాటించారు. ఇక, అదే స‌మ‌యంలో కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి ఇక్కడ నుంచి వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగారు.

ప్రతి ఎన్నికకు అభ్యర్ధిని మారుస్తూ….

వ‌రుస ఎన్నిక‌ల్లో కోటం రెడ్డి కూడా విజ‌యం సాధించారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో కోటంరెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప్రతి ఎన్నిక‌కు ఎవ‌రో ఒక కొత్త నేత‌ను వెతుక్కునే ప‌రిస్థితికి దిగ‌జారింది. ఎప్పటిక‌ప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ / ఆ పార్టీ మిత్రప‌క్షాల‌ త‌ర‌ఫున పోటీ చేసిన అభ్యర్థి డిపాజిట్లు ద‌క్కించుకుంటే చాల‌నే ధోర‌ణిని ప్రద‌ర్శించారు. 2009లో ఇక్కడ టీడీపీ పోటీ చేయ‌కుండా పొత్తులో భాగంగా క‌మ్యూనిస్టుల‌కు ఇవ్వగా ప్రజారాజ్యం రెండో స్థానంలో ఉంటే క‌మ్యూనిస్టులు మూడో స్థానానికి దిగ‌జారారు. ఇక 2014 ఎన్నిక‌ల్లోనూ ఇక్కడ టీడీపీకి క్యాండెట్ లేక బీజేపీకి సీటు ఇవ్వగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోటంరెడ్డి గెలిచారు.

అజీజ్ ను కంటిన్యూ చేస్తే….

ఇక మొన్న ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిగా పోటీ చేయ‌డంతో పార్టీ త‌ర‌పున అభ్యర్థిని పెట్టక త‌ప్ప‌లేదు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీలో ఉన్న మాజీ మేయ‌ర్ అబ్దుల్ అజీజ్ చంద్రబాబు పిలుపుతో టీడీపీలోకి జంప్ చేశారు. ఈ క్రమంలోనే ఆయ‌న గ‌త ఎన్నిక‌ల చివ‌రి క్షణంలో టీడీపీ టికెట్ ద‌క్కించుకుని పోటీ చేశారు. ఈ క్రమంలో కోటంరెడ్డికి అజీజ్ ఓ మోస్తరు పోటీ ఇచ్చారు. గ‌తంలో టీడీపీ నేత‌ల‌కు రాని విధ‌గా ఇక్కడ ఆయ‌న‌కు ఓట్లు వ‌చ్చాయి. 64948 ఓట్లు ద‌క్కాయి. అయినా 22 వేల పైచిలుకు ఓట్లతో ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ అజీజ్‌ను ఇక్కడ ఇన్‌చార్జ్‌గా కంటిన్యూ చేసి.. పార్టీని బ‌లోపేతం చేసుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కోటంరెడ్డికి చెక్ పెట్టవ‌చ్చనేది బాబు యోచ‌న‌గా చెబుతున్నారు.

కోటంరెడ్డిపై వ్యతిరేకత….

పైగా అజీజ్‌ను రూర‌ల్ ఇన్‌చార్జ్‌గా కంటిన్యూ చేస్తే నెల్లూరు సిటీ, రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ ఓట్లను టీడీపీ వైపు తిప్పుకునే ఛాన్స్ ఉంటుంద‌ని కూడా చంద్రబాబు భావిస్తున్నార‌ట‌. ఇక్కడ అజీజ్ కూడా ప్రజ‌ల్లోకి బాగానే వెళ్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ ఖాతా తెర‌వ‌లేదు. ఈ యేడాది కాలంలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోలిస్తే రూర‌ల్ నియోజక‌వ‌ర్గంలో మాత్రమే టీడీపీ కార్యకలాపాలు అజీజ్ ఆధ్వర్యంలో కాస్త యాక్టివ్‌గా జ‌రుగుతున్నాయి. ఇక వైఎస్సార్‌సీపీ నుంచి వ‌రుస‌గా రెండోసారి గెలిచిన కోటంరెడ్డిపై ఇప్పుడు ప్రజ‌ల్లో ఓ మోస్తరు వ్యతిరేక‌త స్టార్ట్ అవ్వగా… ఆయ‌న‌కు సొంత పార్టీలోనే అనేక మంది వ్యతిరేకులు త‌యార‌య్యారు. ఈ ప‌రిణామాల‌ను యూజ్ చేసుకుంటే ఇక్కడ అజీజ్ కోటంరెడ్డికి చెక్ పెట్టి పార్టీకి ఏ మాత్రం ప‌ట్టులేని నెల్లూరు రూర‌ల్లో విజ‌యం సాధించ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

Tags:    

Similar News