సరైనోడే కాదు చపలచిత్తమున్నోడు కూడా

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది ప్రత్యేక స్టయిల్. ఆయన వైఖరి ప్రత్యర్థులకు, సొంత పార్టీనేతలకూ గిట్టకపోయినా అనుచరులకు మాత్రం ఆయన నిజంగా లీడర్. కోటంరెడ్డి స్టూడెంట్ [more]

Update: 2020-02-27 08:00 GMT

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది ప్రత్యేక స్టయిల్. ఆయన వైఖరి ప్రత్యర్థులకు, సొంత పార్టీనేతలకూ గిట్టకపోయినా అనుచరులకు మాత్రం ఆయన నిజంగా లీడర్. కోటంరెడ్డి స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదగడంతో ఆయన తన వెనక నడిచిన వారిని ఎన్నడూ మరిచిపోలేదు. తన అనుచరులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత మరే ఎమ్మెల్యే ఇవ్వకపోవడం విశేషంగానే చెప్పుకోవాలి. అంతేకాదు ఆయన వివిధ సమస్యలపై సొంత పార్టీపై చిందులు తొక్కినా అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న బలమేనని చెప్పక తప్పదు.

లౌక్యంతో పాటు…..

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రాజకీయమే కాదు లౌక్యం కూడా బాగా తెలుసంటారు. ప్రజలనాడిని బట్టి ఆయన పనిచేసుకు వెళుతుంటారు. సమస్య కన్పిస్తే వెంటనే ఆయన ఆందోళనకు దిగి ఎమ్మెల్యే తప్పు లేదని అనిపించుకుంటారు. ఇలాంటి ఫీట్లు ఎన్నో చేసే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా సీఏఏ, ఎన్సార్సీ విషయంలో రాజీనామాకు సిద్ధమని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాదు మేధావులతో సీఏఏకు వ్యతిరేకంగా సమావేశం పెట్టి వివాదానికి కారణమయ్యారు. ప్రభుత్వం చేత అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయిస్తానని చెప్పి ముస్లిం ప్రజల చేత జిందాబాద్ కొట్టించుకున్న ఏకైక ఎమ్మెల్యే కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

ఉపయోగం ఉంటుందని తెలిసినా….

తనకు నియోజకవర్గంలో ఏమాత్రం ప్రయోజనం ఉంటుందని భావించినా వెంటనే రంగంలోకి దిగిపోతారు. అది సొంత పార్టీ నేతల మీదయినా సరే విరుచుకుపడిపోతారు. ఇసుకమాఫియా మీద సొంత పార్టీ నేతలనే తప్పు పట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జర్నలిస్ట్ మీదకు కూడా దాడికి దిగి వివాదాలకు కారణమయ్యారు. ఇంత వివాదాలున్న ఇప్పటకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు టీడీపీని ఖాళీ చేసేశారు. పేరున్న నేతలందరికీ ఫ్యాన్ పార్టీ కండువా కప్పేశారు.

అనుచరులకే ఫస్ట్ ఛాయిస్……

ఇక అనుచరుల్లో సరైనోడుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముద్రపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, తన అనుచరులకు పదవులను కట్టబెట్టడంలో ముందుంటారు కోటంరెడ్డి. శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు, ఇరుగళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ, వేదగిరి నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు, నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల వంటి వాటన్నింటినీ తన అనుచరులతో నింపేశారు. ఈ నియోజకవర్గంలో పదవుల భర్తీ జరిగనట్లు ఎక్కడా జరగలేదంటారు. అలాగే పార్టీ కోసం పనిచేసిన వారికి అత్యధికులు కూడా ఇచ్చింది ఇక్కడే. అందుకే ఇతర వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే కొంత కంటగింపుగా ఉంటుంది. అనుచరుల అండదండలు ఉండబట్టే తాను ఇన్ని రోజులు రాజకీయం చేయగులుగుతున్నానని, రెండుసార్లు ఎమ్యెల్యే అయ్యానని సగర్వంగా చెప్పుకుంటారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

Tags:    

Similar News