చుక్కలు చూపిస్తున్నాడుగా

నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేస్తారు. అప్పడప్పుడూ పార్టీని [more]

Update: 2019-12-07 13:30 GMT

నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు చేస్తారు. అప్పడప్పుడూ పార్టీని సయితం ఇరుకున పెడుతుంటారు. గత రెండుసార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీవోతో జరిగిన వివాదం తర్వాత కొంత మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తిగా నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. జగన్ ఎదుట తన సత్తా తగ్గలేదని నిరూపించుకోవడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధమయ్యారు.

నియోజకవర్గంపైనే…..

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తిగా నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారు. ఆయనతో పాటు సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పూర్తిగా పార్టీని బలోపేతం చేయడానికి రోజూ చేరికలతో నియోజకవర్గంలో పండగ వాతావరణాన్ని కల్పిస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా అబ్దుల్ అజీజ్ ఉన్నారు. ఆయన పార్టీని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిలు ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి దాదాపు 90 శాతం మంది టీడీపీ నేతలకు వైసీపీ కండువా కప్పేశారు.

దాదాపు కీలక నేతలందరూ….

ఆ నియోజకవర్గంలో మొత్తం 26 డివిజన్లు ఉన్నాయి. 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల తాజా మాజీ కార్పొరేటర్లు, ద్వితీయ శ్రేణి నేతలు, సర్పంచ్ లందరూ వైసీపీలో చేరిపోయారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కోడూరు కమలాకర్ రెడ్డి, మాజీ మంత్రి నారాయణ అనుచరులు చాట్ల నరసింహరావు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ వెన్నంటి ఉన్న కార్పొరేటర్లు సయితం ఫ్యాన్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు టీడీపీలో అబ్దుల్ అజీజ్, ఆయన సోదరుడు జలీల్ తప్ప ఎవరూ ఇప్పుడు టీడీపీలో లేకుండా పోయారు.

ఆందోళనలో టీడీపీ…..

దీంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలయింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కీలక నేతలు పార్టీని వీడుతుండటంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సయితం ఆందోళన చెంది అబ్దుల్ అజీజ్ తో చర్చించినట్లు తెలిసింది. నేతలు వెళ్లిపోయినంత మాత్రాన ఇబ్బంది ఏమీ లేదని బయటకు చెబుతున్నప్పటికీ కోటంరెడ్డి దెబ్బకు నియోజకవర్గం మొత్తం ఖాళీ అవుతుండటంతో నిత్యం ప్రజల్లోనే ఉండాలని అబ్దుల్ అజీజ్ కు పార్టీ నుంచి ఆదేశాలు అందాయట. మొత్తం మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు.

Tags:    

Similar News