బిగ్ బాంబ్ లు ఎందుకు?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అణుకువగానే ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెలరేగి పోతున్నారు. సొంత పార్టీ నేతలకే మింగుడుపడని విధంగా తయారయ్యారు. ఆయన నెల్లూరు రూరల్ [more]

Update: 2019-11-09 06:30 GMT

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అణుకువగానే ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెలరేగి పోతున్నారు. సొంత పార్టీ నేతలకే మింగుడుపడని విధంగా తయారయ్యారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో పదికి పది మంది ఎమ్మెల్యేలు గెలిచినా వారిలో నోరు వేసుకుని పడిపోయేది ఒక్క కోటంరెడ్డి మాత్రమే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోటంరెడ్డితో కాకాణి గోవర్థన్ రెడ్డి సయితం యాక్టివ్ గా ఉండేవారు. కానీ ఇప్పుడు పదిలో తొమ్మిది మంది సైలెంట్ గానే ఉన్న కోటంరెడ్డి మాత్రం పార్టీపైనే బిగ్ బాంబ్ లు వేస్తున్నారు.

వివాదాలకు కేరాఫ్….

ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ గా మారారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోతున్నారని పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. నెల్లూరులో ఒక జర్నలిస్ట్ పై దూకుడుగా వెళ్లడంతో కోటంరెడ్డిని వార్తల్లో నిలిపింది. తర్వాత ఎంపీడీవో తో వివాదం రాష్ట్ర స్థాయిలో హైలెట్ చేసింది. మరో చింతమనేని ప్రభాకర్ అంటూ సోషల్ మీడియాలో సయితం హోరెత్తిపోయింది. దీంతో జగన్ నేరుగా రంగంలోకి దిగి కోటంరెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

కాకాణి టార్గెట్ గా….

ఇక కోటంరెడ్డికి వెంటనే బెయిల్ లభించినా… తనపై కొందరు వైసీపీ నేతలు కావాలని కుట్రపన్నారని ఆరోపించారు. పరోక్షంగా మరో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టార్గెట్ చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డి కష్టకాలంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. ఎన్నికల ఫలితాలు రావడంతో ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు మంత్రి పదవి వస్తుందనుకున్నా రాలేదు. దీంతో ఆయన మౌనంగానే పదవి కోసం నిరీక్షిస్తున్నారు.

విపక్షాలకు అస్త్రం అందించి….

అయితే కాకాణి గోవర్థన్ రెడ్డికి భవిష్యత్తులోనూ పదవి రాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలే విపక్షాలు ఇసుక మాఫియా రాద్ధాంతం చేస్తున్న సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాకాణి గోవర్థన్ రెడ్డిని ఉద్దేశించే వ్యాఖ్యానించారని తెలుస్తోంది. కోటంరెడ్డి వ్యాఖ్యలు ఇటు కాకాణికే కాదు ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టాయి. విపక్షాలకు అస్త్రాలను అందించాయి. కోటంరెడ్డి బిగ్ బాంబ్ లు ఎందుకు వేస్తున్నారనేది వైసీీపీలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News