సైకిల్ తొక్కడం ఆపేసినట్లేనా ?

రాజ్యాలు రాసివ్వడం ఒకపుడు రాజులు చేసేవారు. ఈ ప్రజాస్వామ్య యుగంలో నయా సామ్రాజ్యాధినేతలుగా చలామణీ అవుతున్నరాజకీయ పార్టీల అధినేతలు తమ వెంట నడిచే నేతలకు ప్రాంతాలను పాలిటిక్స్ [more]

Update: 2021-05-28 02:00 GMT

రాజ్యాలు రాసివ్వడం ఒకపుడు రాజులు చేసేవారు. ఈ ప్రజాస్వామ్య యుగంలో నయా సామ్రాజ్యాధినేతలుగా చలామణీ అవుతున్నరాజకీయ పార్టీల అధినేతలు తమ వెంట నడిచే నేతలకు ప్రాంతాలను పాలిటిక్స్ కోసం రాసి ఇచ్చేస్తున్నారు. ఆ మీదట వారి టాలెంట్, జనాల దయ, అదృష్టం అన్నీ కలసి వస్తే అక్కడ కొత్త నవాబే అవుతారు. అందుకే ముందు అధినేతల చుట్టూ నాయకమ్మన్యులు ప్రదక్షిణం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇపుడు వచ్చే మూడేళ్ల కాలం పైనే చూపు సారించింది. మరో సమరానికి తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది.

ఆయన ఎక్కడ …?

గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయి రాజాం నుంచి పసుపు పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరావు ఇపుడు ఎక్కడ అంటోంది రాజాం టీడీపీ క్యాడర్ . ఆయన రెండేళ్ళుగా పెద్దగా హడావుడి చేయడం లేదు. సైకిల్ తొక్కడం కూడా ఎపుడో మానేశారు అంటున్నారు తమ్ముళు. ఇక స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన క్యాడర్ ని సమాయత్తం చేసి వెన్నంటి నిలవలేదని ఫిర్యాదులు ఉన్నాయి. పైగా ఆయన జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు మీడియా ముఖంగా గట్టి మద్దతు ఇచ్చి మరీ చంద్రబాబు కన్నెర్రకు గురి అయ్యారని టాక్. ఇంకో వైపు చూస్తే ఆయనకూ కింజరాపు ఫ్యామిలీకి కూడా అసలు పడడంలేదుట. ఎందుకంటే కోండ్రు మురళీమోహనరావు ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు సన్నిహితుడుగా ముద్ర పడ్డారు. ఆయన చొరవతోనే టీడీపీలోకి వచ్చారు.

ప్రతిభకు పట్టమే ….?

సరిగ్గా ఇక్కడే మాజీ స్పీకర్ ఫ్యామిలీకి లక్కీ చాన్స్ దక్కేలా ఉందిట. టీడీపీలో నానాటికీ తన విలువ తగ్గిపోతోంది అని ప్రతిభా భారతి మధన పడుతున్న వేళ మేమున్నామని కింజరాపు ఫ్యామిలీ శుభ సందేశం వినిపిస్తోందిట. కళా వెంకటరావు ప్రభావం నుంచి రాజాం ని వేరు చేసే పనిలో పడిన అచ్చెన్నాయుడు ప్రతిభ కుటుంబానికే రాజాం లో పెద్ద పీట వేయడానికి రెడీ అవుతున్నారుట. ఈ మేరకు ఆయన అభయం ఇచ్చేశారు అంటున్నారు. మరో వైపు చంద్రబాబు చూపు కూడా ప్రతిభ ఫ్యామిలీ వైపే ఉంది అంటున్నారు. దీంతో త్వరలోనే రాజాం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా ప్రతిభ కుమార్తె గ్రీష్మను నియమిస్తారని కూడా అంటున్నారు.

టికెట్ గ్యారంటీయా…?

ఇదిలా ఉంటే కోండ్రు మురళీమోహన్ మనసు వైసీపీ వైపు ఉందని అంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీలో చేరి రాజాం నుంచి పోటీ చేస్తారు అంటున్నారు. ఇప్పటికి రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ నెగ్గిన కంభాల జోగుల మీద వ్యతిరేకత కూడా ఉంది. పైగా రెండు తడవలు ఓడినా గట్టి పట్టున్న కోండ్రు మురళీకి వైసీపీ లాంటి బలమైన పార్టీ తోడుగా ఉంటే గెలుపు ఖాయమని అంటున్నారు. మరి కోండ్రు మురళి ఆ ఆలోచనలో ఉంటే టీడీపీ తరఫున గ్రీష్మ పోటీకి రెడీ అవుతున్నారు అంటున్నారు. ఆమెను ఎమ్మెల్యేగా చూడాలని ప్రతిభ ఆరాటపడుతున్నారు. మరి ఎటూ టీడీపీకి కూడా వేరే ఆప్షన్ లేకపోతే కనుక గ్రీష్మకే టికెట్ ఖాయమని అంటున్నారు. మొత్తానికి రాజాం ని అటూ ఇటూ అధినేతలు ఎవరికి రాసిస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News