ముందున్న వన్నీ కష్టాలేగా….?

వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనే ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ కొండా దంపతులు ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో వీరి కష్టాలు [more]

Update: 2019-01-04 00:30 GMT

వరంగల్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనే ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ కొండా దంపతులు ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో వీరి కష్టాలు పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే సూచనలైతే కనిపించడం లేదు. అతివిశ్వాసంతో వీరు వేసిన అడుగులు వారి రాజకీయ జీవితానికి ముగింపు పలికే ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. ఎమ్మెల్యే పదవితో పాటు ఎమ్మెల్సీ పదవిని కోల్పోయిన కొండా దంపతులకు ముందుంది కష్టకాలమే. ఇక, వీరి ఓటమి ఒక ఎత్తైతే వీరికి వ్యతిరేకంగా ఉన్న వారంతా గెలిచి రేపామాపో కీలక పదవులు కూడా దక్కించుకునే అవకాశం ఉంది.

కొండా అంచనాలు తలకిందులు

టీఆర్ఎస్ లో ఫస్ట్ లిస్ట్ లో కొండా సురేఖకు టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆమె టీఆర్ఎస్ వీడియ బయటకు వచ్చారు. వస్తూ వస్తూ కేసీఆర్ పాలనపై, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల దశలో టీఆర్ఎస్ ని ఇరకాటంలో పడేసే పరిస్థితులు తీసుకువచ్చారు. వెంటనే కాంగ్రెస్ లో చేరిన వారికి వారి స్వంత నియోజకవర్గం పరకాల టిక్కెట్ దక్కింది. అక్కడ వారు గతంలో బలమైన నాయకులుగా ఉండేవారు. కానీ, పరిస్థితులు సరిగ్గా అంచనా వేయకుండా పరకాల బరిలో దిగి దెబ్బతిన్నారు. సుమారు 50 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక కొండా దపంతుల పాత నియోజకవర్గం వరంగల్ ఈస్ట్ లో కూడా వారు నిలబెట్టిన అభ్యర్థి గట్టి పోటీనే ఇచ్చినా ఓటమి పాలయ్యారు.

ఎర్రబెల్లికి మంత్రి పదవి ఖాయం…

వైఎస్ హయాంలో వరంగల్ జిల్లాలో కీలక నేతలుగా ఎదిగిన కొండా దంపతులు జిల్లాలో రాజకీయ శత్రువులను పెంచుకుంటూ వెళ్లారు. మొదటి నుంచీ వారికి ఎర్రబెల్లి దయాకర్ రావుతో వైరం ఉంది. ఆయన ఇప్పుడు ఆరోసారి గెలిచారు. ఈసారి మంత్రిపదవి ఆయనకు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కొండా ప్రధాన శత్రువు మంత్రి కానున్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో శత్రువులుగా మారిన నన్నపునేని నరేందర్ వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వినయ్ భాస్కర్ కూడా వరంగల్ వెస్ట్ నుంచి నాలుగోసారి విజయం సాధించారు. ఆయనకు కూడా కీలక పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో కొండా దంపతులు పదవులు కోల్పోయి ఉండగా వారి వ్యతిరేకులు మాత్రం కీలక పదవులు దక్కించుకుని జిల్లా రాజకీయాలను శాసించనున్నారు. ఇది కొండా దంపతులకు ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించే అవకాశం ఉంది.

Tags:    

Similar News