కొండా దంపతులు వెయిటింగ్ లో ఉన్నారా?

కొండా దంపతుల టైమ్ బాగాలేనట్లుంది. పార్టీలు మారినా గతంలో ఉన్న పట్టు చిక్కడం లేదు. ఇప్పటికే వైసీపీ, టీఆర్ఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్న కొండా దంపతులు [more]

Update: 2021-04-30 09:30 GMT

కొండా దంపతుల టైమ్ బాగాలేనట్లుంది. పార్టీలు మారినా గతంలో ఉన్న పట్టు చిక్కడం లేదు. ఇప్పటికే వైసీపీ, టీఆర్ఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్న కొండా దంపతులు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. కొండా దంపతులిద్దరినీ బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కాంగ్రెస్ లోనూ కొండా దంపతులు అసంతృప్తిగా ఉన్నారు. వరంగల్ జిల్లాను ఒకప్పుడు కొండా దంపతులు శాసించారు.

వరంగల్ జిల్లాను…..

ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొండా సురేఖ మంత్రి పదవి చేపట్టారు. పరకాల నుంచి గెలిచిన కొండా సురేఖ రాజకీయంగా కూడా నిలదొక్కుకున్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ కు అండగా నిలిచారు. తర్వాత టీఆర్ఎస్ లో చేరి విజయం సాధించారు. కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయారు. నేరుగా కేటీఆర్, కేసీఆర్ ల మీద విమర్శలు చేసి బయటకు వచ్చేశారు.

కార్పొరేషన్ ఎన్నికల తర్వాత…?

కాంగ్రెస్ లో చేరి పోటీ చేసినా గత ఎన్నికల్లో గెలుపు దక్కలేదు. దీంతో పరకాల నియోజకవర్గం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పట్టున్న కొండా దంపతులు కాంగ్రెస్ లో కుదురుగా ఉండరన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కొండా దంపతులు పనిచేస్తున్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బాగానే శ్రమపడ్డారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కొండా దంపతులు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

బీజేపీ గాలం….

అయితే కాంగ్రెస్ కు రాష్ట్రంలో భవిష్యత్ లేదని కొండా దంపతులు ఆందోళన చెందుతున్నారు. ఇది గమనించిన బీజేపీ నాయకత్వం వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వరంగల్ ప్రాంతంలో రోజురోజుకూ బీజేపీ బలోపేతం అవుతుండటంతో కొండా దంపతుల మనసు కూడా మళ్లిందంటున్నారు. మొత్తం మీద త్వరలోనే బీజేపీలోకి వెళ్లడమా? కాంగ్రెస్ లో కొనసాగడమా? అనే దానిపై కొండా దంపతులు నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News