కొణతాల కధ ఇక ఇంతేనా… ?

విశాఖ జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పిన నాయకుడు కొణతాల రామకృష్ణ. ఆయన రాజకీయ ప్రవేశమే లక్కీగా సాగింది. ఆయన 1989లో నాటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ పెతకంశెట్టి [more]

Update: 2021-08-23 14:30 GMT

విశాఖ జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పిన నాయకుడు కొణతాల రామకృష్ణ. ఆయన రాజకీయ ప్రవేశమే లక్కీగా సాగింది. ఆయన 1989లో నాటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ పెతకంశెట్టి అప్పలనరసింహం మీద కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచి దేశాన్ని ఆకట్టుకున్నారు. గిన్నీస్ రికార్డుకు కూడా ఎక్కారు. అలా వరసబెట్టి నాలుగు దఫాలు అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యాక కొణతాల రామకృష్ణ 2004లో ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసి గెలిచారు. నాడు వైఎస్సార్ ప్రభుత్వంలో జిల్లాలో ఏకైక మంత్రిగా చక్రం తిప్పారు. వైఎస్సార్ కూడా విశాఖ జిల్లాకు కొణతాలను సామంతరాజుగా చేసేశారు. వైఎస్ తొలిసారి సీఎం అయిన‌ప్పుడు జిల్లాలో కొణ‌తాల ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌గా ఉండేది.

అదే టర్నింగ్ పాయింట్….

కొణతాల రామకృష్ణ 2009 ఎన్నికల్లో మాత్రం ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు. అదే ఆయన రాజకీయానికి అతి పెద్ద బ్రేక్ వేసేసింది. వైఎస్సార్ బతికి ఉంటే నామినేటెడ్ పదవో, రాజ్యసభ సీటో ఆయనకు దక్కేది. కానీ వైఎస్సార్ చనిపోవడంతో కొణతాల రామకృష్ణ రాజకీయం కూడా రివర్స్ అయింది. ఆయన జగన్ వైపు వచ్చారు. వైసీపీ ఆవిర్భావంలో చురుకైన పాత్ర పోషించారు. ఇక 2014 ఎన్నికల్లో ఆయన తన తమ్ముడికి అనకాపల్లి టికెట్ ఇప్పించుకున్నారు. విశాఖలో వైసీపీ ఎంపీగా పోటీ చేసిన వైఎస్ విజయమ్మ కోసం కొణతాల రామకృష్ణ ప్రచారం చేశారు. కానీ ఆమె ఓటమి పాలు అయింది. దాంతో కొణతాల విపక్షాలతో కుమ్మక్కు కావడం వల్లనే ఇలా జరిగింది అని జగన్ భావించి ఆయన్ని పార్టీకి దూరం పెట్టారు.

టీడీపీ, వైసీపీలో చేరినా…?

ఆ తరువాత కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరినా కూడా అక్కడ కూడా మర్యాద దక్కలేదు. ఆయన రాజ్యసభ సీటు కోరుకున్నా చంద్రబాబు ఇవ్వలేదు. ఇక అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడంతో కొణతాల రామకృష్ణ బాగా నిరాశపడ్డారు, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడంతో కొణతాల పూర్తిగా రాజకీయ సన్యాసం చేసేశారు. అయితే ఆయని తిరిగి వైసీపీ వైపుగా తీసుకువచ్చేందుకు కొంతమంది ప్రయత్నించారు. కానీ జగన్ మాత్రం ససేమిరా అంటూనే వచ్చారు. ఇక తాజాగా అనకాపల్లిలో కొణతాల ఫ్యామిలీ ఆక్రమించుకున్న దేవాలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో కొణతాలకు వైసీపీ పూర్తిగా రెడ్ సిగ్నల్ చూపించింది అనే అంటున్నారు.

కెరీర్ పరంగా…..

మొత్తానికి చూస్తే కొణతాల రామకృష్ణ పొలిటికల్ కెరీర్ కంప్లీట్ గా క్లోజ్ అయిందనే చెప్పాలి. ఆయన వియ్యంకుడు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు 2024లో టికెట్ వచ్చినా కొణతాల సరే అనాల్సిందే తప్ప అంతకు మించి ఆయన సౌండ్ చేసే సీన్ టీడీపీలో లేదనే అంటున్నారు. ఎలాంటి కొణతాల రామకృష్ణ ఎలా అయిపోయారు అనే ఇపుడు జిల్లా రాజకీయాల్లో చర్చించుకునే పరిస్థితి ఉంది.

Tags:    

Similar News