రాజకీయ ఎత్తులకు కొణతాల ఎగ్జాంపుల్

విశాఖ జిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాల రాజకీయం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణది. ఆయన వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు అయిన నాయకుడు. వైఎస్సార్ తాను ముఖ్యమంత్రి [more]

Update: 2021-01-12 13:30 GMT

విశాఖ జిల్లా రాజకీయాల్లో మూడు దశాబ్దాల రాజకీయం మాజీ మంత్రి కొణతాల రామకృష్ణది. ఆయన వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు అయిన నాయకుడు. వైఎస్సార్ తాను ముఖ్యమంత్రి కాగానే కొణతాల రామకృష్ణను విశాఖ వంటి పెద్ద జిల్లాకు మంత్రిని చేశారు. ఆయన కోరిక మేరకు విశాఖ జిల్లా పెత్తనం అంతా అప్పగించారు. ఏకైక మంత్రిగా విశాఖలో చక్రం తిప్పిన రికార్డు కూడా కొణతాలదే. అటువంటి కొణతాల 2009 ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తరువాత కొద్ది రోజులకే వైఎస్సార్ మరణించడంతో గత పుష్కర కాలంగా అమావాస్య రోజులే ఆయన రాజకీయ జీవితంలో అలుముకున్నాయి.

నిశ్శబ్దంలోనే నిలిచి…..

కొణతాల రామకృష్ణ పుట్టిన రోజు తాజాగా జరిగింది. అతి కొద్ది మంది అభిమానులు మాత్రమే ఆ విషయం తెలుసుకుని ఆయనకు విషెస్ చెప్పారు. కొణతాల రామకృష్ణ వంటి నాయకుడి గతాన్ని కనుక చూసుకుంటే ఇది ఒక విధంగా బాధాకరమే. ఎందరో ముఖ్యమంత్రుల సరసన నిలిచి ఉమ్మడి ఏపీలో రాష్ట్ర స్థాయిలో పెద్ద నేతగా ఉన్న కొణతాల వర్తమానం మాత్రం నిశ్శబ్దలోనే గడచిపోతోంది. ఇప్పటికి రెండేళ్ళుగా కొణతాల రామకృష్ణ అసలు మాట్లాడడం లేదు. సైలెంట్ గానే గడుపుతున్నారు. నిజానికి ఆయన ఎక్కడ ఉన్నారు. ఏమి చేస్తున్నారు అన్నది కూడా ఎవరికీ తెలియదు. అలా కొణతాల రాజకీయం మారిపోవడం ఆయన ఒకనాటి అనుచరులకు మనస్తాపం కలిగిస్తోంది.

తప్పటడుగులే కారణం …..

జగన్ మొండి అని తెలుసు. పైగా పార్టీ అధినేత అని కూడా అని తెలుసు. అయినా వైఎస్సార్ వద్ద వ్యవహరించినట్లుగానే జగన్ తోనూ వ్యవహరించి కొణతాల రామకృష్ణ దెబ్బ తిన్నారు. అంతే కాదు, విశాఖలో తన తల్లి విజయమ్మను గెలిపించమని జగన్ కీలకమైన బాధ్యతలను 2014 ఎన్నికల వేళ అప్పగిస్తే కొణతాల సరిగ్గా పనిచేయలేదని, పైగా బీజేపీ నేతలతో రాజీపడ్డారని ఆరోపణలు వచ్చాయి. వీటిలో నిజమెంత అన్నది పక్కన పెడితే అధినేతతో కూర్చుని వాస్తవాలను వివరించడంతో కొణతాల రామకృష్ణ నాడు ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే ఈ రకంగా ఏకాకి అయ్యారని కూడా అంటున్నారు.

బాబుతో కుదిరేది కాదు…..

ఇక తెలుగుదేశాన్ని కొణతాల రామకృష్ణ తుదికంటా వ్యతిరేకించారు. ఆయన ఫక్త్ కాంగ్రెస్ వాది. అటువంటి కొణతాల తెలుగుదేశం పార్టీలో చేరి పెద్ద తప్పే చేశారని అనుచరులు అంటారు. జగన్ తో కలసి నడవాలన్నదే వారి సూచన. అయితే తనను పార్టీ నుంచి అకారణంగా జగన్ బహిష్కరించారు కాబట్టి దాన్ని విత్ డ్రా చేసుకోవాలని, అపుడే వైసీపీలో ఎంట్రీ ఇస్తానని కొణతాల రామకృష్ణ పెట్టిన షరతు జగన్ కి చిర్రెత్తించింది. అందుకే 2019 ఎన్నికల్లో ఆయన రీ ఎంట్రీ వైసీపీలోకి జరగకుండా అలా ఆగిపోయింది. ఇపుడు కొణతాల రామకృష్ణ తెలుగుదేశంలో కూడా లేరు, అలాగని రాజకీయంగాకూ చురుకుగా లేరు. షష్టి పూర్తి వయసు దాటేసిన కొణతాల రామకృష్ణకు ఇపుడు పెద్దగా అనుచర గణం కూడా లేదు. దాంతో ఆయన రాజకీయం దాదాపుగా ముగిసింది అన్న మాటే వినిపిస్తోంది. మొత్తానికి ఎత్తులు పై ఎత్తులు సరిగ్గా వేయకపోతే పడిపోతారు అనడానికి కొణతాల రామకృష్ణ ఒక అచ్చమైన ఉదాహరణ అంటున్నారు.

Tags:    

Similar News