అలకలు.. స్పీడ్ డెసిషన్స్…. పొలిటికల్ రిజల్ట్ కొణతాల

కొణతాల రామకృష్ణ. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్. మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా విశేష రాజకీయ అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణ వైఎస్సార్ కి ప్రియ [more]

Update: 2020-03-06 13:30 GMT

కొణతాల రామకృష్ణ. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్. మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా విశేష రాజకీయ అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణ వైఎస్సార్ కి ప్రియ శిష్యుడు. ఆయన కొడుకు జగన్ పెట్టిన పార్టీలో తొలి రోజుల్లో చేరినా తరువాత ఆయన తెర వెనక్కుపోయారు. ఇక నాటి నుంచి కొణతాల వేసిన పిల్లిమొగ్గలు, రాజకీయంగా సరైన వ్యూహాలు లేకపోవడంతో ఇంతటి సీనియర్ నేత కూడా సరైన రాజకీయ వేదిక లేకుండా కనుమరుగయ్యారు. ఎన్నికల ముందు వైసీపీ, టీడీపీ అంటూ ఊగిసలాడి చివరికి టీడీపీలో చేరిన కొణతాల రామకృష్ణ ఇపుడు ఆ పార్టీలోనూ కనిపించడంలేదు.

తెరుమరుగుకు వెళ్లి…..

ఆయన గత తొమ్మిది నెలలుగా మీడియాకు కూడా చిక్కకుండా పూర్తిగా తెరమరుగు అయ్యారు. విశాఖలో ఈ మధ్య జరిగిన ప్రపంచ గవర సభల్లో కొణతాల రామకృష్ణ హఠాత్తుగా కనిపించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఆయన సామాజికవర్గ సమావేశం కాబట్టి వచ్చారు తప్ప మరేమీ కదని అంటున్నారు. రాజకీయంగా ఎక్కిన టీడీపీ పడవ మునగడం, వైసీపీతో దాగుడుమూతలు ఆడడంతో కొణతాల రామకృష్ణ ఎటూ కాకుండా పోయారని అనుచరులు మదనపడుతున్నారు. మళ్ళీ కొణతాల రామకృష్ణ రాజకీయాల్లో చురుకుగా ఉండడం అంటే కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

చేజేతులా….?

రాజకీయాలు బహు చిత్రమైనవి. మనం ఎపుడూ పోటీలోనే ఉండాలి. ఒక్కసారి తగ్గితే చాలు సీటు గోవిందా అవుతుంది. అలాంటిది పదేళ్ళుగా రాజకీయంగా పూర్తిగా ఒడుదుడుకులు పడుతున్న కొణతాల రామకృష్ణ సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకుపోవడం వల్లనే ఇలా అయిపోయారని అంటున్నారు. మిగిలిన నేతల మాదిరిగా కాకుండా మాటకు కట్టుబడే నైజంతో పాటు, ప్రజలు మేలు చేయాలన్న చిత్త శుద్ధి ఉండడం, ఉత్తరాంధ్రా సమస్యలపైన పూర్తి అవగాహన కలిగి ఉండడం కొణతాల రామకృష్ణలో ప్లస్ పాయింట్లు. అదే సమయంలో తాను కోరుకున్నది ఇదీ అని అటు అనుచరులకు కానీ ఇటు అధినాయకులకు కానీ చెప్పకుండా తరచూ అలకపానులు ఎక్కడడం, వేగంగా డెసిషన్లు తీసుకోకపోవడం మైనస్ పాయింట్లు అంటున్నారు.

కొత్త నీరుతో….

ఇక ఎందుకంటే మరో నాలుగేళ్ళ తరువాత రాజకీయాలు ఇంకా మారిపోతాయి కాబట్టి. ఇప్పటికే కొణతాల రామకృష్ణ సొంత ప్రాంతం అనకాపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ వంటి యువకులు పుంజుకున్నారు. అలాగే వైసీపీ ఎంపీగా సత్యవతి కూడా కొత్త నాయకత్వమే. ఇక విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుటుంబం నుంచి కుమారుడు ఆనంద్ వంటి వారు వైసీపీలో చేరి భవిష్యత్తు నేతలుగా ఉన్నారు. టీడీపీలోనూ కొణతాల రామకృష్ణ జూనియర్లు ఇపుడు పార్టీ నేతలుగా ఎదిగారు. మొత్తానికి చూసుకుంటే రెండు పార్టీల్లో కొత్త నాయకత్వం, కొత్త నీరు ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో కొణతాల రామకృష్ణ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ గా మిగిలారు. మొత్తానికి వైఎస్సార్ చలువతో ఎదిగిన కొణతాల రామకృష్ణ కొడుకు జగన్ రాజ్యంలో వెలగకపోవడం స్వయంకృతాపరాధమేనని అంటున్నారు.

Tags:    

Similar News