కొణతాల రూట్… డేట్… ఫిక్సయ్యింది..!!

ఎట్టకేలకు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ సైకిలెక్కుతున్నారు. ఇందుకు ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఈ నెల 18న ఆయన [more]

Update: 2019-01-11 18:29 GMT

ఎట్టకేలకు విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ సైకిలెక్కుతున్నారు. ఇందుకు ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. ఈ నెల 18న ఆయన పార్టీలో చేరుతారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించిందని కూడా అంటున్నారు. ఈ మధ్యన జరిగిన తన పుట్టిన రోజు సందర్భంగా కొణతాల తాను ఏ పార్టెలో చేరేది పండుగ తరువాత చెబుతానని అన్నారు. దానికి తగినట్లుగానే ఇప్పుడు డేట్ కూడా బయటకు వచ్చింది. కాంగ్రెస్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా పనిచేసిన కొణతాలకు ఇది మరో రాజకీయ అవకాశం.

ఆయన చలవతో

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చలవతో జిల్లా రాజకీయాల్లో మంచి స్థానం పొందిన కొణతాల కొన్నాళ్ళు జగన్ స్థాపించిన వైసీపీలోనూ చక్రం తిప్పారు. తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొణతాల చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కొణతాలకు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకున్నారని, అహ్వానాలు అందిన పార్టీలు అన్నింటికన్నా తెలుగుదేశం అయితేనే మేలని నమ్మి ఆ పార్టీలోకి వెళ్తున్నారని అంటున్నారు.

తెర వెనుక అయ్యన్న

ఇక కొణతాల టీడీపీలో చేరిక వెనుక జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్న‌పాత్రుడు కీలకమైన పాత్ర పోషించారని అంటున్నారు. జిల్లాలో తన బలాన్ని పెంచుకోవడంతో పాటు ప్రత్యర్ధి మరో మంత్రి గంటా శ్రీనివాసరావుని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో చాలాకాలంగా కొణతాలను అయ్యన్న తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అదిప్పటికి కుదిరిందని అంటున్నారు చంద్రబాబు కూడా ఎన్నికల వేళ కొణతాల వంటి సీనియర్ నేత అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారని, తప్పక మంచి గౌరవం ఇస్తారని అంటున్నారు.

ఎక్కడ నుంచి..?

ఇక కొణతాల ఈ నెల 18న అనకాపల్లిలో భారీ సభ నిర్వహించి మరీ టీడీపీలో చేరాలని అనుకుంటున్నారు. ఆయన్ను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు. అయితే కొణతాల అనుచరులు మాత్రం అనకాపల్లి అసెంబ్లీకి పోటీ చేయమని కోరుతున్నారట. కొణతాల‌కు ఎంపీ సీటు ఇస్తే మాత్రం విశాఖ నుంచి పోటీకి చాన్స్ ఇవ్వాలని కోరాలనుకుంటున్నారట. మొత్తం మీద కొణతాల చేరికతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతాయని అంటున్నారు. అంతే కాదు, టీడీపీ కూడా బలపడుతుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News