ఈయన బ్యాడ్ సెంటిమెంట్ మ‌ర్చిపోయారా?

హాట్ హాట్ రాజ‌కీయాల‌కు నెల‌వు అయిన గుంటూరు జిల్లాలో మ‌రో హాట్ పొలిటిక‌ల్ న్యూస్ చ‌క్కెర్లు కొడుతోంది. పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత కొమ్మాల‌పాటి [more]

Update: 2020-11-08 11:00 GMT

హాట్ హాట్ రాజ‌కీయాల‌కు నెల‌వు అయిన గుంటూరు జిల్లాలో మ‌రో హాట్ పొలిటిక‌ల్ న్యూస్ చ‌క్కెర్లు కొడుతోంది. పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నేత కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్ ఆ నియోజ‌క‌వ‌ర్గం వ‌దిలి గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేశార‌ని.. త‌న‌కు గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ బాధ్యత‌లు అప్పగించాల‌ని ఇప్పటికే అధిష్టానాన్ని కోరార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఇదే జిల్లాలోని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి. ఆంజ‌నేయులు, శ్రీథ‌ర్ ఇద్దరూ వియ్యంకులు. వీరు 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా గెలిచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప‌నిచేసిన ఆంజ‌నేయులు ఇప్పుడు పార్టీలో జ‌రిగిన మార్పుల‌తో న‌ర‌సారావుపేట పార్లమెంట‌రీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.

అలా మారితే..?

ఆంజ‌నేయులు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న న‌ర‌సారావుపేట పార్లమెంట‌రీ జిల్లా ప‌రిధిలోకే పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం కూడా వ‌స్తుంది. ఇప్పుడు ఇద్దరం ఒకే పార్లమెంటు ప‌రిధిలో ఉండ‌డం వ‌ల్ల రేపు టిక్కెట్ల కేటాయింపులో ఇబ్బంది వ‌స్తుంద‌నే శ్రీథ‌ర్ వేరే పార్లమెంటు ప‌రిధిలోకి మారుతున్నార‌ని ఆయ‌న వ‌ర్గం నేత‌లు చెపుతున్నారు. మ‌రో టాక్ ప్రకారం శ్రీథ‌ర్ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు అన్ని గుంటూరు పార్లమెంటు ప‌రిధితో పాటు అమ‌రావ‌తి ప‌రిధిలోనే ఉన్నాయి. ఈ వ్యాపారాల‌ను చ‌క్క పెట్టుకునే క్రమంతో పాటు న‌గ‌ర రాజ‌కీయాల్లో రాణించాల‌నే ఆయ‌న గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి మారే ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

హైకమాండ్ తో లాబీయింగ్…..

గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు ప‌శ్చిమం నుంచి టీడీపీ త‌ర‌పున గెలిచిన మ‌ద్దాలి గిరిధ‌ర్ రావు పార్టీని వీడి వైసీపీ సానుభూతి ప‌రుడిగా ఉన్నారు. ప్రస్తుతం అక్క‌డ పార్టీ కార్యక్రమాలు న‌డిచేందుకు చంద్రబాబు కోవెల‌మూడి ర‌వీంద్ర ( నాని)కి పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు. అయితే ఆయ‌న అక్కడ పార్టీని ఎంత వ‌ర‌కు న‌డిపిస్తార‌న్నదానిపై టీడీపీ వ‌ర్గాల్లోనే అనేక సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆర్థికంగా, సామాజిక ప‌రంగా బ‌లంగా ఉన్న కొమ్మాల‌పాటి శ్రీధర్ ను ఇక్కడ ఇన్‌చార్జ్ ప‌ద‌వి కోసం నేరుగా అధిష్టానంతోనే లాబీయింగ్ మొద‌లు పెట్టేశార‌ట‌.

లైన్ క్లియర్ అయందా?

కొమ్మాల‌పాటి శ్రీధర్ కి గుంటూరు ప‌శ్చిమ ప‌గ్గాలు అప్పగించేందుకు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌, మాజీ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశార‌ట‌. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు అయితే కొమ్మాల‌పాటి గుంటూరు ప‌శ్చిమంకు మారితే త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన పెద‌కూర‌పాడు ప‌గ్గాల‌ను త‌న కుమారుడు రంగారావుకు ఇప్పించుకునేందుకు లైన్ క్లీయ‌ర్ చేసుకోవ‌చ్చని భావిస్తున్నార‌ట‌.

క‌న్నా బ్యాడ్ సెంటిమెంట్ ….

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. గ‌త 40 సంవ‌త్సరాల్లో ఇక్కడ చ‌ద‌ల‌వాడ జ‌య‌రాం బాబు మిన‌హా మ‌రే నేత రెండోసారి గెల‌వ‌లేదు. పెద‌కూర‌పాడులో వ‌రుస‌గా నాలుగుసార్లు గెలిచిన సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ సైతం ఐదోసారి గుంటూరు ప‌శ్చిమంకు మారారు. ఐదోసారి గెలిచిన క‌న్నా ఆ త‌ర్వాత ఓడిపోవ‌డంతో పాటు రాజ‌కీయంగా క‌ష్టాల్లో కూరుకుపోయారు. పెద‌కూర‌పాడులో వ‌రుసగా రెండుసార్లు గెలిచిన శ్రీథ‌ర్ సైతం రేపు గుంటూరు ప‌శ్చిమం‌కు మారితే ఇక్కడ బ్యాడ్ సెంటిమెంట్‌కు ఎంత వ‌ర‌కు బ్రేక్ వేస్తారు ? అన్న చ‌ర్చలు కూడా జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News