కోమటిరెడ్డి అందుకే అలా చేస్తున్నారా?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నేత. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న ఆయన పార్టీ అధికారంలో ఉండగా మంత్రి పదవులను కూడా దక్కించుకున్నారు. ఆయన [more]

Update: 2021-01-28 11:00 GMT

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నేత. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న ఆయన పార్టీ అధికారంలో ఉండగా మంత్రి పదవులను కూడా దక్కించుకున్నారు. ఆయన గోల్ పీసీసీ చీఫ్ పదవి. తన ఆధ్వర్యంలో కాంగ్రెస్ ను గెలిపించాలన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష్యంగా ఉంది. తనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కొనడంతో పాటు పార్టీలో అందరినేతలను సమన్వయంతో కలుపుకుని వెళతానని చెబుతున్నారు.

సొంత పార్టీ నేతలతో….

నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థికంగా, సామాజికంగా బలమైన నేత. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న లీడర్. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సీనియర్ నేతలతో పొసగదు. ఎందుకంటే తన దారిలోనే అందరూ వెళ్లాలనుకునే మనస్తత్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డిది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తొలి నుంచి వైరమే. ఇద్దరిదీ ఒకే జిల్లా కావడం ఆధిపత్యం కోసం ప్రయత్నించడమే విభేదాలకు, వివాదాలకు కారణంగా చెప్పాలి.

మొన్నటి ఎన్నికల్లో ఓడి….

మరో సీనియర్ నేత జానారెడ్డి అన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పడదు. నల్లగొండ జిల్లాలో తొలి నుంచి మూడు గ్రూపులుగా ఉండేవి. నల్లగొండ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఆయన మనసంతా పీసీసీ పీఠం పైనే ఉంది. దానిని చేజిక్కించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నారు.

ఇక్కడ గెలిపించి……

పీసీసీ చీఫ‌ పదవి ఎంపిక వాయిదా పడటంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో జానారెడ్డి గెలవకుంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. జానారెడ్డి గెలుపు కోసం ఆయన నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఇక్కడ జానారెడ్డి గెలుపులో ప్రధానపాత్ర పోషించి పీసీసీ చీఫ్ పదవికి చేరువవ్వాలన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచనగా ఉంది. జానారెడ్డి గెలుపు సంగతి పక్కన పెడితే.. కోమటిరెడ్డిని ఆ పదవికి హైకమాండ్ ఎంపిక చేస్తుందా? లేదా? అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News