టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారా?

దగ్గర దాకా వచ్చిన పదవి చేయి దాటి పోయింది. తాను పార్టీని నమ్ముకుంటే పార్టీ తనను వదిలేసింది. సమయం కోసం వేచి చూద్దామన్నా భవిష్యత్ కన్పించడం లేదు. [more]

Update: 2021-08-29 05:00 GMT

దగ్గర దాకా వచ్చిన పదవి చేయి దాటి పోయింది. తాను పార్టీని నమ్ముకుంటే పార్టీ తనను వదిలేసింది. సమయం కోసం వేచి చూద్దామన్నా భవిష్యత్ కన్పించడం లేదు. ఇదీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఆవేదన. పీసీసీ చీఫ్ పదవి దక్కలేదని కోమటిరెడ్డి బ్రదర్స్ లో అసంతృప్తి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు బయటపడకపోయినా భవిష్యత్ లో వారి నిర్ణయం పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి.

ఎన్నో ఆశలు….

పీసీసీ చీఫ్ పదవి వస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాను సీనియర్ అయినా తన పనితీరును, తన కుటుంబం పార్టీ పట్ల చూపిన చిత్తశుద్ధిని హైకమాండ్ గుర్తించలేదన్న ఆవేదనలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఇదే తనకు చివరి ఛాన్స్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుదికంటా ప్రయత్నించారు. అయితే తనను నమ్మించి కొందరు నేతలు పక్కదోవ పట్టించారని, రేవంత్ రెడ్డికి పరోక్షంగా సాయం చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుమానిస్తున్నారు.

నియోజకవర్గానికే….

అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పార్లమెంటు నియోజకవర్గానికే పరిమితమవుతానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి కి పగ్గాలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనని శపథం చేశారు. రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం త్వరలోనే కాంగ్రెస్ కు ఝలక్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది.

త్వరలోనే జంప్….

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలం నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు. ఇంతకాలం తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి పీసీసీ చీఫ్ పదవి వస్తుందని భావించారు. అందుకోసమే ఇంతకాలం వెయిట్ చేశారు. కానీ సోదరుడికి పీసీసీ చీఫ్ పదవి రాకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగినా నియోజకవర్గానికే పరిమితం కానున్నారు.

Tags:    

Similar News