కోమ‌టిరెడ్డి కుమ్ములాట‌.. `వేటు` కోసం వ్యూహం ?

రాజ‌కీయాల్లో ఒక్కొక్క సారి ఒక్కొక్క ర‌క‌మైన ప‌రిణామాలు జ‌రుగుతుంటాయి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి జంప్ చేయడం.. నాయ‌కుల‌కు కామ‌న్‌. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో నాయ‌కుల‌కు [more]

Update: 2019-06-26 04:30 GMT

రాజ‌కీయాల్లో ఒక్కొక్క సారి ఒక్కొక్క ర‌క‌మైన ప‌రిణామాలు జ‌రుగుతుంటాయి. ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి జంప్ చేయడం.. నాయ‌కుల‌కు కామ‌న్‌. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో నాయ‌కుల‌కు కొంత మొహ‌మాటం ఏర్ప‌డుతోంది. అరె కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న పార్టీని వెంట‌నే విడిచి పెట్ట‌డం ఎలా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ల‌క్ష స‌మ‌స్య‌ల‌కు స‌వాల‌క్ష ప‌రిష్కారాలు అన్న‌ట్టుగా.. ఉన్న పార్టీలోనే పొగ‌పెట్టి మంట సృష్టించి.. అధిష్టానానికి కాలేలా చేసి, అడ‌గకుండానే వేటు వేయించుకోవ‌డం ఇప్పుడున్న పాలిటిక్స్‌లో కొత్త ల‌క్ష‌ణం. అధినేత‌పై అల‌గడం, అధినేత బుజ్జ‌గించ‌డం, తాను మారాం చేయ‌డం ఇవ‌న్నీ పాత ప‌ద్ద‌తులు.

ఇప్పుడు ట్రెండ్ మారింది. తాను పార్టీలో ఉన్నంత వ‌ర‌కు త‌ప్పులన్నీ కూడా ఒప్పులుగానే క‌నిపిస్తాయి. ఇక‌,పార్టీకి రాం రాం చెప్పాల‌ని అనుకున్న‌ప్పుడు మాత్రం ఒప్పులు కూడా త‌ప్పులుగానే క‌నిపిస్తాయి. ఏకంగా అధిష్టానంమీదే బుర‌ద జ‌ల్లుతారు. ఇలాంటి ప‌రిణామాలు.. ఏపీ, తెలంగాణ‌ల్లో మ‌నం చాలానే చూశాం. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి కాంగ్రెస్‌లోనూ క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ లోట‌స్ విజృంభిస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌ను ఖాళీ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా క‌మ‌లనాథులు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే కీల‌క నాయ‌కులు పార్టీని ఖాళీ చేసేశారు. అయితే, కొంద‌రు మాత్రం మొహ‌మాట ప‌డుతున్నారు.

ఇలాంటి వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కీల‌కంగా క‌నిపిస్తున్నారు. ఈయ‌న కూడా దాదాపు బీజేపీ ట్రాప్‌లో చిక్కారు. అయితే, ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నామ‌నే, ఆ పార్టీ పంచ కింద‌బ‌తికామ‌నే మొహ‌మాటం అడ్డం వ‌స్తోంది. దీంతో ఆయ‌న మ‌రో మార్గం ఎంచుకున్నారు. తాను పార్టీని వీడ‌కుండా. పార్టీనే త‌న‌ను వ‌దిలించుకునే మార్గాన్ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో దిగ్గ‌జాలైన కుంతియా, భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వంటివారిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

‘‘ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్‌ లేదు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వంలో లోపం ఉంది. నేతలందరూ బీజేపీ వైపే చూస్తున్నారు’’ అంటూ కోమ‌టిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్త‌వానికి పార్టీలో నిల‌దొక్కుకోవాల‌ని బావించే నాయ‌కులు ఎవ‌రూ కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌రు. కానీ, ఇప్పుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారంటే.. కేవ‌లం ఆయ‌న వ్యూహాత్మ‌కంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు గెంటించుకోవాల‌నే ఉద్దేశంతో చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌ద్వారా బీజేపీలోకి వెళ్లాల‌నే త‌న క‌ల‌ను సాకారం చేసుకునేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News