క్షమా..క్రమ‘శిక్ష’ణా..?

Update: 2018-09-27 16:30 GMT

కాంగ్రెసులో అదే గొడవ. టిక్కెట్లు, ఆధిపత్యం , వర్గ విభేదాలు సహజాతి సహజం. కానీ పార్టీ ని ధిక్కరించిన వారిపై చర్యల విషయంలోనూ అవే గ్రూపు వివాదాలు. ఒకరు అవునంటే మరొకరు కాదంటూ గందరగోళం. హైకమాండ్ కు దిక్కుతోచని పరిస్థితి. క్రమశిక్షణలోనూ అదే కథాకమామిషు కొనసాగుతోంది. టీపీసీసీ నాయకత్వం, అధిష్ఠానంపై విరుచుకుపడిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఉదంతంలో పెద్దల్లో చీలికలు ఏర్పడ్డాయి. ఇరువర్గాలుగా మారి అనుకూల,ప్రతికూల భావాలను ప్రకటిస్తున్నారు. భిన్నమైన వాదనలతో కాంగ్రెసు రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. రెండు వర్గాల వాదనలోనూ హేతుబద్ధత కనిపించడమే ఈ ఎపిసోడ్ లో కీలక ఘట్టం.

ఉత్తమ్ ఉడుం పట్టు...

కోమటిరెడ్డి సోదరులకు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తొలినుంచీ పడదు. మొదట్లో తీవ్రస్థాయిలో ఆయనను వ్యతిరేకించారు. తమకు పీసీసీ పీఠం అప్పగించాలని సోదరులు అధిష్టానంతో చర్చలు జరిపారు. అలక బూనారు. బెదిరించారు. పార్టీని విడిచివెళ్లిపోతామన్నంత హంగామా సృష్టించారు. కానీ తెలంగాణలో , కాంగ్రెసులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉత్తమ్ ను మించిన ఛాయిస్ లేదని అధినాయకత్వం భావించింది. ఆయననే కొనసాగించింది. ఎన్నికలు ముగిసే వరకూ ఆయన నాయకత్వంలోనే పనిచేయాల్సి ఉంటుందని అందరికీ స్పష్టంగా చెప్పేసింది. ఆ తర్వాత కోమటిరెడ్డి సోదరుల దూకుడు కొంత తగ్గింది. కానీ పీసీసీ నాయకత్వాన్ని అదను దొరికినప్పుడల్లా చికాకు పరుస్తూనే ఉన్నారు. నల్లగొండలోని నాలుగైదు నియోజకవర్గాల్లో వారికి పట్టు ఉండటానికి తోడు ఆర్థికంగా పార్టీకి ఉపయోగపడతారనే ఉద్దేశంతో వారిపై ఎటువంటి చర్యలకు పూనుకోవడం లేదు. తాజాగా అధిష్టానం తో సంప్రదించి ఏర్పాటు చేసిన కమిటీల విషయంలో విభేదించి రాజగోపాలరెడ్డి ధ్వజమెత్తారు. ఇదే అదనుగా ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ ఏఐసీసీ కి ఫిర్యాదు చేశారు. రోజువారీ అసమ్మతిగా మారిన కోమటిరెడ్డి సోదరులను వదిలించుకుంటే తనకు రాజకీయంగా ఇబ్బందులు ఉండవనేది ఉత్తమ్ ఆలోచన. అందుకే ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు.

కుంతియా కుతకుత...

ఏఐసీసీ నుంచి టీపీసీసీ వ్యవహారాలకు ఇన్ ఛార్జిగా ఉన్న కుంతియా పై కూడా కోమటి రెడ్డి సోదరులు గతంలోనే ధ్వజమెత్తారు. తమ ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోవడం లేదనేది వారి అనుమానం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి చేతిలోని మనిషిగా కుంతియా మారిపోయారనేది వారి సందేహం. కుంతియా వచ్చిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మరింత బలపడటమే వారి అనుమానాలకు కారణం. దాంతో కోమటి రెడ్డి సోదరులు కుంతియాను సైతం విడిచిపెట్టడం లేదు. తమ అనుచరుల వద్ద, పీసీసీ నాయకుల వద్ద ఆయనపై బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. చాలా వరకూ వారి ఆరోపణలకు ఆధారాలు ఉండటం లేదు. దీనిపై కుంతియా చాలా ఆగ్రహంగా ఉన్నారనేది సమాచారం. అందుకే రాజగోపాలరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండును కుంతియా సమర్థిస్తున్నారు. జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ వంటివారు ఈవిషయంలో విభేదిస్తున్నారు. కీలకమైన ఎన్నికల తరుణంలో చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం చేకూరుస్తుందనేది వారి అభిప్రాయం. మధ్యలో జానారెడ్డి గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తున్నారు. అటు అధిష్టానం చర్యలు తీసుకున్నా, లేకపోతే క్షమించేసినా తనకు సమ్మతమేననేది ఆయన ఉవాచ. మొత్తమ్మీద టీపీసీసీ ఇన్ చార్జి మాత్రం గుర్రుగా ఉన్నట్లు పార్టీలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెసులో ఇదంతా కామనే వారి మీద ఎటువంటి చర్యలు ఉండవనే వారి సంఖ్య తక్కువేమీ లేదు. రాజగోపాలరెడ్డిపై చర్యలను తాత్కాలికంగా వాయిదా వేయడమే ఇందుకు నిదర్శనం. కొన్నాళ్లకు మొత్తం విషయం చల్లారిపోతుంది.

మహా కుంపటి...

కాంగ్రెసు, సీపీఐ, టీడీపీ, తెలంగాణ జనసమితి మహాకూటమి కట్టాలనే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. తెలంగాణ జనసమితిని మినహాయిస్తే ఇప్పటికే మిగిలిన మూడు పార్టీలు ఒక అవగాహనకు వచ్చేశాయి. 20 స్థానాల వరకూ మిత్రులకు ఇవ్వాల్సి ఉంటుందని కాంగ్రెసు భావిస్తోంది. ఇప్పుడు రాజగోపాల రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే కూటమి పొత్తులకు విఘాతం కలుగుతుందనే వాదన తెరపైకి వస్తోంది. మిత్రపక్షానికి సీటు ఇచ్చిన చోట కాంగ్రెసు నాయకులు తిరుగుబాటు చేసి అధిష్ఠానం పై విమర్శలు చేసే ప్రమాదం ఉంది. ముందుగా ఆరోపణల బారిన పడకుండా కట్టడి చేయాలంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారన్న సందేశం నాయకులకు చేరాలని ఉత్తమ్ వర్గం వాదిస్తోంది. లేకపోతే మహాకూటమి అసంతృప్తులతో కుంపటిగా మారిపోతుందని చెబుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ తిరుగుబాటు కనిపిస్తుందంటున్నారు. దీనిని నిరోధించేందుకు రాజగోపాల్ రెడ్డి ఉదంతాన్ని పావుగా వినియోగించుకోవాలనేది ఒక వర్గం బలమైన వాదన. దీనిపట్ల అధిష్ఠానం ఎంతమేరకు సానుకూలంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News