కోమటిరెడ్డికి ఐదో‘సారి’యేనా..?

Update: 2018-10-29 00:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒకరు. ఆయన నల్గొండ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఈ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఐదోసారి కూడా విజయం సాధించాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రాతినిత్యం వహిస్తున్న స్థానాలపై ప్రత్యేకంగా టార్గెట్ చేసింది టీఆర్ఎస్. ఇలా ప్రత్యేక దృష్టి పెట్టిన నియోజకవర్గాల్లో నల్గొండ ఒకటి. ఇక్కడ ఎలాగైనా కోమటిరెడ్డిని ఓడించి వారి ఆధిపత్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. ఇందులో భాగంగా గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలో దిగిన కోమటిరెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని టీఆర్ఎస్ లో చేర్చుకుని టిక్కెట్ కేటాయించింది.

మళ్లీ పాత ప్రత్యర్థులే...

నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ప్రత్యేకించి 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రజల్లో కలిసిపోతారనే పేరుతో మాస్ ఇమేజ్ ఉంది. గత ఎన్నికల్లో ఆయన విజయంపై గట్టి భరోసాతో ఉండగా ఎవరూ ఊహించని విధంగా టీడీపీ రెబల్ గా బరిలో దిగిన కంచర్ల భూపాల్ రెడ్డి 50 వేల ఒట్లు సాధించి వెంకట్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వెంకట్ రెడ్డి 10 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దుబ్బాక నరసింహారెడ్డి 15 వేల ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచారు. అయితే, కోమటిరెడ్డికి కంచర్ల భూపాల్ రెడ్డి బలమైన ప్రత్యర్థిగా భావించిన టీఆర్ఎస్ ఆయనను ఏడాది క్రితమే పార్టీలో చేర్చుకుని ఇంఛార్జి బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు టిక్కెట్ ను కూడా ఆయనకే ఇచ్చింది. దీంతో గత ఎన్నికల్లో పోటీచేసిన దుబ్బాక నరసింహారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

వ్యక్తిగత ఛరిష్మా ఉన్నా...

మొదటి లిస్టులోనే టిక్కెట్ కేటాయించడంతో గత నెలన్నరగా కంచర్ల భూపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ టిక్కెట్ ఎలాగూ కోమటిరెడ్డికే కావడంతో ఆయన కూడా ముందు నుంచే ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురు కావడంతో కోమటిరెడ్డి ముందుజాగ్రత్తగా ఈసారి తీవ్రంగా కష్టపడుతున్నారు. గతంలో పార్టీలో ఉండి టీఆర్ఎస్ లో చేరిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మళ్లీ పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. తన హయాంలోనే నియోజకవర్గం అభివృద్ది చెందిందని గుర్తు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, తనపై కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆయన ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతంలో మంచి పట్టు ఉండటం, రాష్ట్ర స్థాయి నేత కావడం, మాస్ ఇమేజ్ ఉండటంతో పాటు కాంగ్రెస్ కి ఉన్న ఓటు బ్యాంకు ఆయనకు కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారు.

ద్విముఖ పోరే...

ఇక, ఎలాగైనా ఈసారి నల్గొండలో గులాబీ జెండా ఎగరేయాలని టీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. తమ వల్లె నల్గొండకు మెడికల్ కాలేజీ, బత్తాయి మార్కెట్ వచ్చిందని, నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ప్రజల్లోకి వెళ్తున్నారు. 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారని ఆరోపిస్తున్నారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలనిచ కంచర్ల భూపాల్ రెడ్డి ప్రజలను కోరుతున్నారు. ఆయనకు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో బాగా బలం ఉంది. ఇక వరుసగా 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సహజంగా నెలకొనే వ్యతిరేకత, కొత్తవారికి అవకాశం ఇద్దామనే ఆలోచనలు తనకు కలిసివస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఇక పట్టణంలో ఎక్కువగా ఉన్న ముస్లిం ఓటుబ్యాంకుపై కూడా ఆయన భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గతంలో సీపీఎంకి ఇక్కడ మంచి పట్టు ఉన్నా క్రమంగా ప్రభావం కోల్పోతూ వస్తోంది. ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉన్నా ప్రధాన పోటీదారుగా ఉండే అవకాశాలు మాత్రం తక్కువే. ఇక బీజేపీ అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రాలేదు. మొత్తానికి ద్విముఖ పోటీ నెలకొనగా కోమటిరెడ్డి ఐదోసారి గెలవాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితి.

Similar News