ఇజ్జత్ కా సవాల్ అంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్

Update: 2018-11-17 03:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్. కొన్నిరోజుల క్రితం కూడా పార్టీ నియమించిన ఎన్నికల కమిటీలు సరిగ్గా లేవని రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే విమర్శలు చేసి షోకాజ్ నోటీసులు అందుకునే దాకా వెళ్లింది. అయితే, తర్వాత అంతా సద్దుమణిగింది. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పాలని పట్టుదలగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఈసారి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నల్గొండ నుంచి వెంకట్ రెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డితో పాటు వారి అనుచరుడు చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. వాస్తవానికి నల్గొండ టిక్కెట్ వెంకట్ రెడ్డిదే అయినా... నకిరేకల్, మునుగోడు టిక్కెట్లు మాత్రం వీరు పార్టీపై ఒత్తిడి చేసి తెచ్చుకున్నారు. ఓ దశలో నకిరేకల్ టిక్కెట్ లింగయ్యకు ఇవ్వకపోతే జిల్లాలో కాంగ్రెస్ ముఖ్యనేతలు ఓడిపాతారంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎట్టకేలకు పార్టీలో బ్రదర్స్ పంతం నెగ్గింది. ఫస్ట్ లిస్టులోనే ముగ్గురికీ టిక్కెట్లు వచ్చాయి. అయితే, పార్టీలో వీరి పంతం నెగ్గినా పోటీచేసే నియోజకవర్గాల్లో గెలవడం వీరికి నల్లేరు మీద నడకైతే కాదు.

కోమటిరెడ్డికి ఐదో సారి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు ఓటమి లేకుండా గెలిచారు. ఇప్పుడు ఐదోసారి పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన వెంకట్ రెడ్డిని ఈసారి ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ వ్యూహం పన్నారు. ఇక తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి కక్షసాధింపు చర్యకు పాల్పడిన టీఆర్ఎస్ కి ఈసారి గెలిచి తన సత్తా చాటాలని కోమటిరెడ్డి పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గంలో మాస్ లీడర్ గా పేరున్న వెంకట్ రెడ్డి రెండు నెలలుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గతంలో టీఆర్ఎస్ లోకి మారిన చాలా మంది నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి చేర్చగలిగారు. ఈసారి గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కీలక పదవి వస్తుందని చెపుతున్నారు. ఇక 20 ఏళ్లుగా కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. ఈసారి తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతానని, ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. భూపాల్ రెడ్డికి కూడా నియోజకవర్గంలో బలం ఉంది. దీంతో ఆయన కోమటిరెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక కేసీఆర్ కూడా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి తక్కెళ్లపల్లి రవీందర్ రావును ఎన్నికల ఇంఛార్జిగా నియమించారు. మొత్తానికి కంచర్ల నుంచి వెంకట్ రెడ్డి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు.

అనుచరుడి గెలుపు బాధ్యత కూడా

నకిరేకల్ లో తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. ఆయన రెండు నెలలుగా ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి అనుచరుడు చిరుమర్తి లింగయ్య పోటీలో ఉన్నారు. ఆయన 2009లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో వీరేశంపై రెండు వేల ట్లతో ఓటమిపాలయ్యరు. అయితే, చిరుమర్తి లింగయ్యకు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్నా... బలమైన నాయకుడు కాదు అనే భావన ప్రజల్లో ఉంది. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి వీరేశంపై పలు ఆరోపణలు ఉన్నారు. ఇటీవల కూడా పలు వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు వినిపించింది. ఇది ఆయనకు మైనస్ గా మారింది. అయితే, ఐదేళ్లలోనే ఆయన బలమైన నేతగా ఎదిగారు. వేముల వీరేశంతో తీవ్ర వైరం ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలాగైనా వీరేశంని ఓడించాలని గట్టి పట్టుదలతో ఉండి ఇక్కడి బాధ్యతలు కూడా వారే చూసుకుంటున్నారు.

మునుగోడులో అసమ్మతి ఉన్నా...

ఎమ్మెల్సీగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలారోజులుగా మునుగోడు నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అయితే, ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి టిక్కెట్ ఆశించారు. అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలమైన అభ్యర్థిగా భావించిన అధిష్ఠానం ఆయనకే టిక్కెట్ కేటాయించింది. దీంతో స్రవంతి అసంతృప్తితో ఉన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో ప్రత్యేకంగా క్యాడర్ ఉంది. ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇది సొమ్ము చేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి ముందుకుపోతున్నారు.

మూడూ గెలిస్తేనే...

మొత్తానికి కొట్లాడి మూడు టిక్కెట్లు తెచ్చుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఈ ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. మూడు నియోజకవర్గాల్లో గెలిస్తేనే టీఆర్ఎస్ కి తమ సత్తా చాటే అవకాశం ఉండటంతో పాటు పార్టీలోనే వారికి పలుకుబడి పెరుగుతుంది. అర్థ, అంగ బలం దండిగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఈ మూడు నియోజకవర్గాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. మరి, కొమటిరెడ్డి పంతం నెరవేరుతుందో... టీఆర్ఎస్ సత్తా చాటుతుందో చూడాలి.

Similar News